గ్రామపంచాయతీలో చేయూత పింఛన్ల జాతర
ఉట్నూర్, నవంబర్ 17 ( విజయక్రాంతి ): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన చేయూత పింఛన్ల('Cheyutha Pension Scheme) జాతర గ్రామపంచాయతీలో కొనసాగుతుంది. ఉట్నూర్ డివిజన్లోని ఇంద్రవెల్లి, ఉట్నూర్, గాదిగూడ, నార్నూర్ మండలాల పరిధిలోని ఆయా గ్రామపంచాయతీలో చేయూత పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు మంజూరి పత్రాలను లబ్ధిదారులకు అందజేస్తున్నారు.
మంగళవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముకాడే ఉత్తం, సర్పంచ్ రాథోడ్ మోహన్ నాయక్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ జహీర్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు చేయూత పెన్షన్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఇంద్రవెల్లి మండల కేంద్రంలో 213 మందికి చేయూత పెన్షన్లు మంజూరు అయినట్లు సర్పంచ్ తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మోహన్ నాయక్ మాట్లాడుతూ ఈనెల 19వ తేదీ నుండి ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభమవుతుందని, ఈ పథకంలో రేషన్ కార్డులు ఉన్నవారు గ్రామ పంచాయతీకి వచ్చి నామిని వివరాలను దరఖాస్తు ఫారం లో వ్రాసి ఇవ్వాలని సూచనలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం తీసుకువచ్చిన ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయనతోపాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.