దీక్షా దివస్ పోస్టర్ ను ఆవిష్కరించిన బిఆర్ ఎస్ నాయకులు
కరీంనగర్ సిటీ నవంబర్17 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర(Telangana State) సాధన ఉద్యమ చరిత్రలో నవంబర్ 29వ తేదీకి ప్రత్యేక స్థానం ఉందని, తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో.. అనే నినాదంతో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Kalvakuntla Chandrashekar Rao) చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రాష్ట్ర ఏర్పాటు దిశగా కీలక మలుపుగా నిలిచిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చే దిశగా కేసీఆర్ చేపట్టిన దీక్ష చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఈ నెల 29న దీక్షా దివస్‌ను పురస్కరించుకుని కేసీఆర్‌ను పోలీసులు అరెస్టు చేసిన అలుగునూరులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ చింతకుంటలో గల బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దీక్షా దివస్ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు.
2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమ గతిని మార్చిన చారిత్రక ఘట్టమని వినోద్ కుమార్ గుర్తుచేశారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ప్రాణాలను సైతం పణంగా పెట్టి దీక్షకు దిగారని పేర్కొన్నారు.
కరీంనగర్ నుంచి బయలుదేరిన కేసీఆర్‌ను అలుగునూరు వద్ద పోలీసులు అరెస్టు చేసి ఖమ్మం తరలించారని, ఈ అరెస్టుతో తెలంగాణవ్యాప్తంగా ఉద్యమం తీవ్రరూపం దాల్చిందని వివరించారు. విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమంలో భాగస్వాములయ్యాయని తెలిపారు.
ఖమ్మంలో దీక్ష కొనసాగించిన కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిమ్స్ ఆసుపత్రికి తరలించారని, అక్కడ కూడా ఆయన దీక్షను కొనసాగించారని గుర్తుచేశారు. ఒకవైపు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన, మరోవైపు తెలంగాణవ్యాప్తంగా ఎగసిపడుతున్న ప్రజా ఉద్యమం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచిందన్నారు.
కేసీఆర్ దీక్ష ఫలితంగా 2009 డిసెంబర్ 9న అప్పటి కేంద్ర హోంమంత్రి పి. చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారని వినోద్ కుమార్ గుర్తుచేశారు. అయితే ఆంధ్ర నాయకుల ఒత్తిడి కి తలొగ్గి డిసెంబర్ 23న కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని ప్రకటనను వెనక్కి తీసుకోవడంతో తెలంగాణలో మళ్లీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందన్నారు.
ఆ పరిణామాల కారణంగా తెలంగాణ సమాజం తీవ్ర ఆందోళనకు గురైందని, ఆ తర్వాతి ఉద్యమ క్రమంలో ఎంతోమంది విద్యార్థులు, యువకులు ప్రాణత్యాగాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న ఇచ్చిన హామీని అమలు చేసి ఉంటే అనేకమంది ప్రాణాలు కాపాడి ఉండేవారన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఒక రాజకీయ పార్టీకి పరిమితమైనది కాదని, కేసీఆర్ నాయకత్వంలో సాగిన ఉద్యమం అన్ని రాజకీయ పార్టీలను, ప్రజాసంఘాలను, విద్యార్థులు, ఉద్యోగులు, న్యాయవాదులు, వైద్యులు, మహిళలు, యువతను ఒకే లక్ష్యం కోసం ఏకం చేసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు సైతం వివిధ దశల్లో తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలిచారని వివరించారు. ప్రజల ఆకాంక్షను బలంగా వినిపించిన ఉద్యమమే తెలంగాణ రాష్ట్ర సాధనకు బాటలు వేసిందన్నారు.
తెలంగాణ ఉద్యమ చరిత్రలో ప్రత్యేక స్థానం కలిగిన అలుగునూరులోనే ఈసారి దీక్షా దివస్ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కేసీఆర్ అరెస్టుకు సాక్షిగా నిలిచిన ప్రాంతంలో సభ నిర్వహించడం ఉద్యమ చరిత్రను మరోసారి గుర్తుచేసుకునే గొప్ప అవకాశమన్నారు. కరీంనగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల నుంచి ప్రజలను సమీకరించేందుకు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
దీక్షా దివస్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు వారం రోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పార్టీ నాయకత్వం వెల్లడించింది. ఇందులో భాగంగా వాల్ రైటింగ్, కరపత్రాల పంపిణీ, సోషల్ మీడియా ప్రచారంతో పాటు మహిళలు ఇంటింటికీ వెళ్లి బొట్లు పెట్టే కార్యక్రమాలు చేపట్టనున్నారు. మండల, నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రజలకు వివరించనున్నారు. డప్పు కార్యక్రమాలు, ఇతర ప్రచార కార్యక్రమాల ద్వారా దీక్షా దివస్ ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు
దీక్షా దివస్ కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమం మాత్రమే కాదని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటాన్ని స్మరించుకునే చారిత్రక దినోత్సవమని నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, విద్యావంతులు, వైద్యులు, న్యాయవాదులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, కరీంనగర్ నగర ప్రముఖులు, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన తెలంగాణ అభిమానులు రాజకీయాలకు అతీతంగా ఈ వేడుకల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా రవాణా, పార్కింగ్, తాగునీరు, వైద్య సదుపాయాలు, ఇతర ఏర్పాట్లు చేయాలని నాయకులు నిర్ణయించారు. సభ నిర్వహణకు సంబంధించి జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్‌కు అనుమతుల కోసం దరఖాస్తు చేయాలని సమావేశంలో చర్చించారు.
ఈ సమావేశంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, ఎమ్మెల్యే సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, ఒడితల సతీష్ కుమార్, రవిశంకర్, దాసరి మనోహర్ రెడ్డి, చల్మెడ లక్ష్మీనరసింహారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు తుల ఉమ, దావ వసంత, జిల్లా అధ్యక్షుడు జి.వి. రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ తదితర పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.