23 నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా దరఖాస్తుల స్వీకరణ
బెజ్జూర్, నవంబర్ 20 (విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలో ఈ నెల 23వ తేదీ సోమవారం నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా (Indiramma Family Insurance) పథకం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు ఎంపీడీవో బండారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. బెజ్జూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రేషన్ కార్డుదారులు ఈ పథకానికి అర్హులని వెల్లడించారు. ఈ బీమా పథకం (Insurance Scheme) కింద ఒక్కో లబ్ధిదారుడి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక భరోసా లభిస్తుంది. ప్రతి లబ్ధిదారుడి తరఫున ప్రభుత్వమే బీమా కంపెనీకి ప్రీమియం చెల్లిస్తుంది. లబ్ధిదారులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
మండలంలోని మిగతా గ్రామపంచాయతీల్లోనూ విడతల వారీగా దరఖాస్తుల స్వీకరణ చేపడతామని తెలిపారు. డిసెంబర్ 18వ తేదీలోగా మండలంలోని అన్ని గ్రామపంచాయతీల రేషన్ కార్డుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దరఖాస్తు చేసుకునే సమయంలో కుటుంబ యజమాని రేషన్ కార్డు తీసుకొస్తే సరిపోతుందని, ఎలాంటి ఇతర పత్రాలు, జిరాక్స్ కాపీలు అవసరం లేదని వివరించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శిని సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. రేషన్ కార్డు లేనివారికి కూడా బీమా సదుపాయం కల్పించే అంశంపై త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామ్మోహన్ రావు, ఏపీవో మురళి, పంచాయతీ కార్యదర్శులు, ఐకేపీ సీసీలు తదితరులు పాల్గొన్నారు.