అదనపు తరగతి గదులు, నూతన భవనాలు మంజూరు చేయాలి

15-11-2026 | 04:31pm

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ పాఠశాలలకు నూతన భవనాలు నిర్మించాలని, అలాగే విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా తరగతి గదులు లేని పాఠశాలలకు అదనంగా తరగతి గదులు నిర్మించడానికి నిధులు మంజూరు చేయించాలని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి(MP Vem Narender Reddy)కి తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ) మహబూబాబాద్ జిల్లా ప్రతినిధులు కలిసి వినతిపత్రం సమర్పించారు.

మహబూబాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న మౌలిక సదుపాయాల కొరతను పరిష్కరించాలని ఈ సందర్భంగా కోరారు. అలాగే అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు మంజూరు చేయాలని, బాలురు, బాలికలకు అవసరమైన ప్రత్యేక మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించాలని కోరారు. పాఠశాల భవనాల నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ స్థలాలను కేటాయించేలా సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో టీ పీ జే ఏ సీ రాష్ట్ర కో కన్వీనర్ మైస శ్రీనివాసులు, పార్నంది రామయ్య, దుబ్బ వెంకన్న, నాగం గణేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు