గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం..
- వడ్డేమాన్, ఎదులాపూర్ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు.
- లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరీ పత్రాల పంపిణీ.
చిన్నచింతకుంట నవంబర్ 19: దేవరకద్ర నియోజకవర్గ(Devarakadra Constituency) పరిధిలోని చిన్నచింతకుంట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గ శాసనసభ్యులు జి. మధుసూదన్ రెడ్డి(MLA G. Madhusudan Reddy) మండలంలోని వడ్డేమాన్, ఎదులాపూర్ గ్రామాల్లో పర్యటించి నూతనంగా నిర్మించిన ప్రభుత్వ భవనాలను ప్రారంభించారు.
తొలుత వడ్డేమాన్ గ్రామంలో నూతనంగా నిర్మించిన మహిళా సంఘం భవనాన్ని ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని అర్హులైన చేయూత పెన్షన్ లబ్ధిదారులకు
మంజూరీ పత్రాలను స్వయంగా అందజేశారు. తదనంతరం ఎదులాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ మహిళా సంఘం భవనాన్నిమరియు గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, మహిళా సంఘాల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు మరియు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.