చదువు ఉంటేనే సకల సంపదలు సాధ్యం

03-11-2026 | 11:01pm

విద్యార్థులు శ్రద్ధగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి: డాక్టర్ వెన్న ఈశ్వరప్ప

గాదిర్యాల్ గ్రామాభివృద్ధికి సహకరిస్తాని హామీ

మహమ్మదాబాద్, నవంబర్ 3 (విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించినప్పుడే సకల సంపదలు సమకూరుతాయని, విద్యార్థులు శ్రద్ధతో చదువుకోవాలని సేవారత్న అవార్డు గ్రహీత, సంఘ సేవకుడు, బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ వెన్న ఈశ్వరప్ప(Dr. Venna Eswarappa) అన్నారు. మంగళవారం మహమ్మదాబాద్ మండలంలోని గాదిర్యాల్ గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు స్వామి వివేకానంద జీవిత చరిత్ర, సూక్తుల పుస్తకాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రులు,గురువులు చెప్పిన మాటలను పాటిస్తూ శ్రద్ధగా చదువుకొని సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. పాఠశాలలో తాగునీటి సమస్య ఉందని, ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రధానోపాధ్యాయుడు రాములు, సర్పంచ్ మాణిక్యమ్మ కోరగా ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు.

గ్రామాభివృద్ధికి సహకరిస్తా..

గాదిర్యాల్, గ్రామాభివృద్ధికి సహకరించాలని సర్పంచ్ మాణిక్యమ్మ డాక్టర్ వెన్న ఈశ్వరప్పను కోరారు. గ్రామంలో సీసీ రోడ్లు, హైమాస్ట్ లైట్లు,తాగునీటి కోసం నూతన బోరు, శిథిలావస్థకు చేరిన బీసీ కమ్యూనిటీ హాల్ స్థానంలో నూతన భవనం నిర్మించాలని విన్నవించారు. దీంతో ఆయన గ్రామంలోని బీసీ కమ్యూనిటీ హాల్‌తో పాటు బిసి కాలనీలో ఉన్న రోడ్డును పరిశీలించారు. ఎంపీ దృష్టికి సమస్యలను తీసుకెళ్లి ఎంపీ నిధుల ద్వారా కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్లు, హైమాస్ట్ లైట్లు, నూతన బోరు మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రాములు, ఉపాధ్యాయ బృందం,బీజేపీ మండల అధ్యక్షుడు మూస నరసింహ, కురువ కృష్ణ, చిట్యాల యాదగిరి, ప్రభు నాయక్, ముచ్చర్ల సురేష్, బద్రిశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు