ఎంసీహెచ్ లో మాతృ, శిశు మరణాలపై సమీక్ష

19-11-2026 | 07:12pm
  1. వంద శాతం నమోదు చేసి పరీక్షలు చేయించాలి
  2. డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్

మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి) : మంచిర్యాలలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ(Department of Medical and Health) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్)లో జిల్లాలో మాతృ మరణాలు, శిశు మరణాలపైన ఆడిట్, వైద్య సిబ్బంది, వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బంది, ఆశ ఆరోగ్య కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు.

గురు వారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సంచాలకులు డాక్టర్ అశోక్ కుమార్, ఆర్ఎంఓ డాక్టర్ కుమారస్వామి, ఉపజిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ అరుణశ్రీతో కలిసి మాత శిశు సంరక్షణ కేంద్రంలో పనిచేస్తున్న స్త్రీ వైద్య నిపుణులు, చిన్న పిల్లల వైద్య నిపుణులు,

నర్సింగ్ అధికారులతో ఈ ఏడాదిలో నమోదైన రెండు మాతృ మరణాలను, ఆరు శిశు మరణాలపై ఆడిట్, సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా డీఎం అండ్ హెచ్ఓ మాట్లాడుతూ మాతృ మరణాలు లేకుండా చూడాలని, ప్రతి ఉపకేంద్రం పరిధిలో వైద్య సిబ్బంది 100 శాతం గర్భిణీ స్త్రీలను 90 రోజులలోపు నమోదు చేయాలని, అదేవిధంగా నాలుగు విడతలుగా పరీక్షలు చేయించి అన్ని రకాల టీకాలు ఇప్పించాలన్నారు.

పరీక్షల అనంతరం రక్తహీనతకు మందులు సమయానికి అందజేయడం, అమ్మ ఒడి అంబులెన్స్ ద్వారా స్కానింగ్ కేంద్రానికి తరలించి స్కానింగ్ చేయించి గర్భిణీలు తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రతి సెషన్ లో తెలియజేయాలన్నారు.

ప్రమాద సూచికలతో గర్భిణీలు కనబడినా, ముఖ్యంగా రక్తహీనత, శ్వాస తీసుకునే సమయంలో ఆయాసము, తీవ్రమైన జ్వరము, ప్రసవానికి ముందు ప్రసవం తర్వాత నెల వరకు ఉన్నా, మూర్చ, తలనొప్పి, వాంతులు, చాతిలో నొప్పి, కాళ్ళ వాపులు, మూత్రశయం నొప్పి, ఉమ్మి నీరు, మాయజారుట, 12 గంటలకు పైగా నొప్పులు, తదితర లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రికి తరలించాలని సూచించారు.

గర్భిణీ స్త్రీ కాన్పు ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని, ఏ ఆసుపత్రిలో ప్రసవం కావాలనేది నిర్ణయించుకొని ప్రయాణ సౌకర్యం కోసం అమ్మఒడి 108 అంబులెన్ లను ఉపయోగించుకోవాలన్నారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 9న గర్భవతులందరికీ పరీక్ష చేయాలన్నారు.

ఈ సమీక్షలో స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ హిమబిందు, డాక్టర్ స్వరూప, డాక్టర్ నాగవేణి, డాక్టర్ కీర్తి, డాక్టర్ ప్రియదర్శిని, డాక్టర్ ప్రణీత, డాక్టర్ విక్రమ్, డాక్టర్ ప్రీతి, డాక్టర్ లహరి, డాక్టర్ స్పూర్ణ, డెమో బుక్కా వెంకటేశ్వర్, అల్లాడి శ్రీనివాస్, రషీద్, ఆర్ఎస్ పద్మ, శ్రీనివాస్, దూప్ సింగ్, వెంకట సాయి, సదన్, ఆరోగ్య, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది, సూపర్ వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు