ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించాలి

17-11-2026 | 08:24pm

ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ హనన్ సూచన

మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి): ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని మంచిర్యాల ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ హనన్(Mancherial Traffic Inspector Hanan) సూచించారు. మంగళవారం మంచిర్యాల పట్టణంలోని ఎన్ కన్వెన్షన్ హాల్‌లో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా హనన్ మాట్లాడుతూ ప్రయాణికుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, ఆటోలను ఇష్టానుసారంగా రోడ్లపై నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని సూచించారు. ట్రాఫిక్ పోలీసులు సూచించిన ప్రదేశాల్లోనే ఆటోలను నిలిపి ఉంచాలని తెలిపారు. ప్రతి డ్రైవర్ వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలతోపాటు చెల్లుబాటయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని స్పష్టం చేశారు.

అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎంవీఐ సూర్యతేజ, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సత్యనారాయణ, సేఫ్ జర్నీ రోడ్ సేఫ్టీ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి చిల్వేరు శ్రీనివాస్, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు