అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క
ఏటూరునాగారం /కన్నాయిగూడెం, నవంబర్ 17(విజయక్రాంతి): అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందించి నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క(Telangana Minister Seethakka) అన్నారు. మంగళవారం ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని గిరిజన భవన్లో నిర్వహించిన నూతన చేయూత పింఛన్ల మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టొప్పోతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ల మంజూరు ఉత్తర్వులను అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఏళ్ల తరబడి పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకు నూతన చేయూత పింఛన్ల మంజూరు ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా భర్తలను కోల్పోయిన మహిళలు, ఒంటరి మహిళలు, ఆసరా లేని వారికి పింఛన్ల మంజూరులో ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. పింఛన్ల కోసం అందిన దరఖాస్తులను పరిశీలించి అర్హులకు మంజూరు ఉత్తర్వులు అందిస్తున్నామని, ఈ పత్రాలు పొందిన లబ్ధిదారుల వివరాలను అధికారులు ఆన్లైన్లో నమోదు చేసి తదుపరి ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా నూతన పింఛన్ల కోసం పెద్ద సంఖ్యలో మహిళలు దరఖాస్తు చేసుకున్నారని, పరిశీలన అనంతరం సుమారు 3.5 లక్షల మంది మహిళలకు పింఛన్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ నెల 12వ తేదీ నుంచి మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. గతంలో ములుగు నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో అందిన దరఖాస్తులను పరిశీలించి అర్హులకు పింఛన్లు మంజూరు చేశామని, ఏటూరునాగారం మండలంలో కూడా గతంలో పలువురికి నూతన పింఛన్లు అందించినట్లు తెలిపారు. పేద కుటుంబాలకు నెలవారీ పింఛన్ ఎంతో ఆసరాగా నిలుస్తుందని, లబ్ధిదారుల ముఖాల్లో సంతోషం చూడటమే తమ లక్ష్యమన్నారు.
అర్హత ఉండి పింఛన్లు మంజూరు కాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. అలాంటి వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిశీలించాలని అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు సమన్వయంతో అర్హులైన వారిని గుర్తించి దరఖాస్తు చేసుకునేలా సహకరించాలన్నారు. ఇప్పటికే మంజూరైన పింఛన్ల వివరాలను వెంటనే ఆన్లైన్లో నమోదు చేసి సంబంధిత అధికారులకు పంపించాలని ఆదేశించారు. ఏ ఒక్క అర్హుడూ సంక్షేమ పథకాల ప్రయోజనాలకు దూరం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు.
అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాని పేద కుటుంబాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. గత విడతలో 5 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించామని, ప్రస్తుతం మంజూరైన ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు మరో 3 వేల నుంచి 5 వేల ఇండ్లు మంజూరు చేయాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. రాబోయే రెండు మూడు నెలల్లో మరిన్ని విడతల్లో ఇండ్ల మంజూరుకు కృషి చేస్తామని, అర్హులైన పేదలందరికీ దశలవారీగా ఇండ్లు అందించడమే లక్ష్యమన్నారు.
మహిళలకు సామాజిక, ఆర్థిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్లను వారి పేరిట మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మహిళలకు సొంతింటిపై హక్కు ఉండాలని, అందుకే ఇంటి హక్కు పత్రాలను మహిళల పేరిట అందిస్తున్నామన్నారు. మహిళలకు సొంతిల్లు ఉండటం ద్వారా ఆత్మవిశ్వాసంతో పాటు భవిష్యత్తుపై భరోసా కలుగుతుందని పేర్కొన్నారు.
పేద కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. అర్హులైన కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, నూతన రేషన్ కార్డుల మంజూరు వంటి కార్యక్రమాల ద్వారా ఆర్థిక భారం తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క సూచించారు.
12 గ్రామ పంచాయతీల్లో 463 నూతన చేయూత పింఛన్లు
ఏటూరునాగారం మండల పరిధిలోని 12 గ్రామ పంచాయతీల్లో మొత్తం 463 మందికి నూతన చేయూత పింఛన్లు మంజూరయ్యాయి. గ్రామ పంచాయతీల వారీగా అల్లంవారి ఘనపూర్‌లో 21 మందికి, చెల్పాకలో 13 మందికి, చిన్నబోయినపల్లిలో 32 మందికి, ఏటూరునాగారంలో 181 మందికి, కొండాయిలో 32 మందికి, కోయగూడ ఎల్లాపూర్‌లో 30 మందికి, ముల్లకట్టలో 16 మందికి, రామన్నగూడెంలో 23 మందికి, రోహీర్లో 37 మందికి, శంకరాజుపల్లిలో 24 మందికి, శాపల్లిలో 18 మందికి, శివాపూర్లో 36 మందికి నూతన చేయూత పింఛన్లు మంజూరయ్యాయి.
రూ.68.10 లక్షలతో విద్యుత్ డివిజన్ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన
అనంతరం ఏటూరునాగారం మండల కేంద్రంలో రూ.68.10 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన విద్యుత్ డివిజన్ కార్యాలయ భవనానికి మంత్రి దనసరి అనసూయ సీతక్క భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. నూతన కార్యాలయ భవనం అందుబాటులోకి వస్తే విద్యుత్ శాఖ అధికారులకు అవసరమైన కార్యాలయ వసతులు సమకూరడంతో పాటు విద్యుత్ సరఫరా వ్యవస్థపై పర్యవేక్షణ మరింత మెరుగుపడనుంది.
అనంతరం మంత్రి దనసరి అనసూయ సీతక్క మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు, తలసేమియా బాధితులకు నూతన చేయూత పింఛన్ల మంజూరు ఉత్తర్వులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో సుమారు 3.5 లక్షల మంది మహిళలు ఉన్నారని, గత రెండు రోజులుగా ములుగు నియోజకవర్గంలో పర్యటిస్తూ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.
అర్హత ఉండి పింఛన్లు అందని వారి దరఖాస్తులను తిరిగి పరిశీలిస్తామని, తాజాగా మరో 13 వేల మందిని జాబితాలో చేర్చినట్లు తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధికి వడ్డీ లేని రుణాలు, ఉచిత బస్సు ప్రయాణం, మహిళా సంఘాలకు బస్సుల కేటాయింపు వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. మహిళా సంఘాలకు రూ.75 వేల కోట్ల రుణాలు అందించే కార్యక్రమాన్ని చేపట్టామని, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులను మహిళల పేరిట మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 19న ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
కుటుంబ సంపాదన సభ్యుడిని కోల్పోయిన కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా ప్రారంభించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, డీఆర్డీఓ చంద్రశేఖర్, జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ రఘు, స్థానిక సర్పంచులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.