గురుపీఠంలో ఆధ్యాత్మిక శోభ
భక్తులతో కిటకిటలాడిన శ్రీ గురుపీఠం
ట్రస్టు సభ్యుల ఆధ్వర్యంలో అన్నదానం
శివంపేట్,(విజయక్రాంతి): శివంపేట మండల(Shivampet Mandal) కేంద్రంలోని శ్రీ గురుపీఠంలో గురువారం సందర్భంగా శ్రీ దత్తాత్రేయ స్వామి(Sri Dattatreya Swamy)వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. గురువారం దత్తాత్రేయ స్వామి, సాయిబాబా మందిరంలో విశేషమైన రోజుగా భావించడంతో ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో గురుపీఠానికి తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరడంతో ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించి మంగళహారతి సమర్పించారు. భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని దత్తాత్రేయ స్వామివారిని వేడుకున్నారు.
ట్రస్టు సభ్యుల ఆధ్వర్యంలో అన్నదానం
ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం శ్రీ గురుపీఠం ట్రస్టు సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గురుపీఠానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. భక్తితో పాటు సేవాభావానికి ప్రాధాన్యతనిస్తూ అన్నదానం నిర్వహించడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు. దత్తాత్రేయ స్వామివారి నామస్మరణతో గురుపీఠం మార్మోగగా, వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ కార్యక్రమాలు శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, హైకోర్టు సీనియర్ న్యాయవాది జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్,ఆధ్వర్యంలో నిర్వహించారు. ట్రస్టు సభ్యులు, ఆలయ నిర్వాహకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలను విజయవంతం చేశారు.