ఎటుచూసినా జనం.. అమ్మ వనంలో భక్తఘణం..

15-11-2026 | 02:32pm
  1. * ఏడుపాయల వనదుర్గమ్మ సన్నిధిలో పోటెత్తిన భక్తజనం
  2. * మంజీరాలో పుణ్యస్నానమాచరించి అమ్మ దర్శనానికి బారులు 
  3. * అమ్మను దర్శించి తరించిన భక్తులు 

పాపన్నపేట, నవంబర్15: ఎటు చూసినా జనమే జనం.. అందరిలో భక్తి భావం.. ఆధ్యాత్మిక వాతావరణం.. మంజీరా "ఏడు" పాయలుగా చీలి ప్రవహించే ప్రాంతం.. జనమేజయుని సర్పయాగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.. దేశంలోనే రెండో వనదుర్గామాత ఆలయంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత సన్నిధి(Edupayala Vanadurga Mata Temple)లో ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆలయ అర్చకులు వేకువ జామునే అమ్మవారికి అభిషేకం, అర్చనలు నిర్వహించిన అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు.

జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాలు, హైదరాబాద్ నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మంజీరాలో పుణ్యస్నానమాచరించి అమ్మ దర్శనానికి బారులు తీరారు. అమ్మ దర్శనంతో భక్తులు తన్మయత్వం చెందారు. పలువురు భక్తులు అమ్మవారికి డప్పు చప్పుల్ల మధ్య బోనాలు, ఓడి బియ్యం సమర్పించారు. మరికొందరు భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల జయ జయ ద్వానాల మధ్య ఏడుపాయల వనదుర్గాదేవి క్షేత్రం హోరెత్తింది. వనదుర్గమ్మా.. దీవించమ్మా.. అంటూ భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. ఆలయ అర్చకులు పూజలు చేపట్టి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ సిబ్బంది భక్తులకు తగు ఏర్పాట్లు చేశారు.

మరిన్ని వార్తలు