గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన మహనీయుడు భగవాన్ బిర్సా ముండా

15-11-2026 | 03:05pm
  1. గుర్తింపునకు నోచుకోని గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రను వెలుగులోకి తీసుకురావాలి 
  2. ఎంపీ గోడం నగేష్
  3. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి..
  4. జిల్లా కలెక్టర్ రాజర్షి షా...
  5. గిరిజన ఆవాసాలకు ప్రభుత్వ సేవలను చేరువ చేసేందుకు బహుళ ప్రయోజన కేంద్రాలు 
  6. ఐటీడీఏ పీఓ మంద మకరందు

ఉట్నూరు, నవంబర్15 (విజయక్రాంతి): భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం, భూమి, అడవి, సంస్కృతి పరిరక్షణ కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు భగవాన్ బిర్సా ముండా(Birsa Munda) 151వ జయంతి వేడుకలను పురస్కరించుకొని ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు కేబీ కాంప్లెక్స్‌లో జనజాతి గౌరవ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్లమెంట్ సభ్యులు నగేష్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి మంద మకరందు భగవాన్ బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు నగేష్ మాట్లాడుతూ... భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచినప్పటికీ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన ఎంతోమంది గిరిజన మహనీయుల చరిత్రలు, వారి త్యాగాలు సరైన గుర్తింపునకు నోచుకోలేదని పేర్కొన్నారు. అటువంటి వీరుల చరిత్రను వెలుగులోకి తీసుకువచ్చి భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.

భగవాన్ బిర్సా ముండా వంటి మహానాయకులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడటమే కాకుండా గిరిజనుల భూమి, హక్కులు, సంస్కృతి, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం ఉద్యమాలు నిర్వహించారని గుర్తుచేశారు. వారి పోరాటాలు, త్యాగాలను దేశ ప్రజలకు తెలియజేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల సేవలకు తగిన గుర్తింపు కల్పిస్తూ, భగవాన్ బిర్సా ముండా జయంతి అయిన నవంబర్ 15వ తేదీని జనజాతి గౌరవ దివస్‌గా ప్రకటించిందన్నారు. తద్వారా గిరిజనుల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలకు దేశవ్యాప్తంగా గౌరవం లభిస్తోందని తెలిపారు.

గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన ప్రాంతాల్లో తాగునీరు, రహదారులు, విద్యుత్, విద్య, వైద్యం, పౌష్టికాహారం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. మారుమూల గిరిజన గ్రామాలకు సైతం విద్యుత్, రహదారులు, ఇతర సదుపాయాలు కల్పిస్తూ గిరిజన కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు వివరించారు.

పీఎం జన్మన్ పథకంతో మారుమూల గిరిజన గ్రామాలకు అభివృద్ధి ఫలాలు:

ప్రత్యేకంగా వెనుకబడిన గిరిజన తెగల (PVTGs) అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం జన్మన్ (PM-JANMAN) కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ పథకం ద్వారా మారుమూల ప్రాంతాల్లో నివసించే గిరిజన కుటుంబాలకు గృహాలు, తాగునీరు, రహదారులు, విద్యుత్, విద్య, వైద్యం, పౌష్టికాహారం వంటి ప్రాథమిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు తెలిపారు.

గిరిజనుల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి చేరవేసినప్పుడే గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీ పేర్కొన్నారు.

* గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాట స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయాలి – జిల్లా కలెక్టర్ రాజర్షి షా

జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, భగవాన్ బిర్సా ముండా జీవితం, పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని తెలిపారు. గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, వారి పోరాట చరిత్రను విద్యార్థులు, యువతకు తెలియజేయాలని సూచించారు.

భగవాన్ బిర్సా ముండా నాయకత్వంలో జరిగిన ఉల్గులాన్ (మహా తిరుగుబాటు) ఉద్యమం బ్రిటిష్ పాలనకు, గిరిజనులపై జరిగిన దోపిడీకి వ్యతిరేకంగా సాగిన గొప్ప పోరాటమని పేర్కొన్నారు. గిరిజనుల జీవనాధారమైన జల్, జంగల్, జమీన్ (నీరు, అడవి, భూమి) పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషిని స్మరించుకోవాలని తెలిపారు.

మూఢనమ్మకాలు, మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కల్పించాలి:

గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. సమాజ అభివృద్ధికి ఆటంకంగా మారుతున్న మూఢనమ్మకాలు, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ముఖ్యంగా యువతలో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఇందుకోసం అన్ని శాఖల అధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

చిన్నపిల్లలు, గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వపరంగా ఉచిత వైద్య సేవలు, విద్య, పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐటీడీఏ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీకి సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహించి త్వరలో నియామక ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

190 గిరిజన ఆవాసాలకు తాగునీటి సౌకర్యం:

గిరిజన ప్రాంతాల్లోని మొత్తం 190 ఆవాసాలకు గాను ఇప్పటికే సుమారు 150 ఆవాసాలకు తాగునీటి కనెక్టివిటీ కల్పించామని, మిగిలిన 40 ఆవాసాలకు కూడా జల్ జీవన్ మిషన్, పీఎంజీఎస్‌వై పథకాల ద్వారా త్వరలో తాగునీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

యువతకు నైపుణ్య శిక్షణ – ఉపాధి అవకాశాలు:

గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వైటీసీ (YTC) కేంద్రాల ద్వారా పోలీస్ కానిస్టేబుల్, సబ్‌ఇన్‌స్పెక్టర్ (SI) ఉద్యోగాలతో పాటు కంప్యూటర్, ప్లంబింగ్ తదితర రంగాల్లో ఉచిత నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ వంటి నగరాల్లో ఉద్యోగాలు పొందేలా కృషి చేయాలని సూచించారు.

అలాగే పీవీపీటీ, ఏపీవోపీవీటీ సమావేశాల ద్వారా గిరిజన ప్రాంతాల్లోని సమస్యలు, ప్రజల అవసరాలు, అందుబాటులో ఉన్న వనరులు, అభివృద్ధి అవకాశాలను గుర్తించి పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. గిరిజన ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందేలా, విద్య, వైద్యం, మౌలిక వసతులు, ఉపాధి రంగాల్లో అభివృద్ధి సాధించేలా అన్ని శాఖలు బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

* బహుళ ప్రయోజన కేంద్రాల ద్వారా గిరిజన ఆవాసాలకు ప్రభుత్వ సేవలు 

* – ఐటీడీఏ పీఓ మంద మకరందు

ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లోని పీవీటీజీ (PVTG) ఆవాసాల ప్రజలకు ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో బహుళ ప్రయోజన కేంద్రాల (Multi-Purpose Centres) ఏర్పాటుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు.

పంచాయతీరాజ్, పంచాయతీ సంక్షేమం, వైద్య ఆరోగ్య శాఖలతో పాటు ఇతర సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, ఈ కేంద్రాల ద్వారా ప్రజలకు అందించాల్సిన సేవలు, నిర్వహించాల్సిన కార్యక్రమాలపై నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

సంబంధిత శాఖలు రూపొందించిన ముసాయిదా కార్యాచరణ ప్రణాళికలను జిల్లా కలెక్టర్ సమీక్షకు సమర్పించి, ఆమోదం అనంతరం బహుళ ప్రయోజన కేంద్రాలను అధికారికంగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కేంద్రాల ద్వారా ఐటీడీఏ, గ్రామపంచాయతీ, వైద్య ఆరోగ్య శాఖ తదితర ప్రభుత్వ శాఖల సేవలను నేరుగా గిరిజన ఆవాసాల ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల కోసం ప్రతిసారీ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వారి ఆవాసాల వద్దనే సేవలు అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వివరించారు.

ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో 15 రోజుల పాటు జనజాతి గౌరవ దివస్ వేడుకలు

గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల చరిత్ర, త్యాగాలు, పోరాట స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయడంతో పాటు విద్యార్థుల్లో చైతన్యం పెంపొందించేందుకు నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు గిరిజన ప్రాంతాల్లోని ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, ఇతర విద్యాసంస్థల్లో జనజాతి గౌరవ దివస్ వేడుకలను నిర్వహిస్తున్నట్లు పీఓ తెలిపారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ గిరిజనుల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, స్వాతంత్ర్య పోరాటంలో గిరిజన వీరుల పాత్రను వివరిస్తున్నట్లు తెలిపారు.

ఐటీడీఏ పరిధిలో విద్యాసంస్థల అభివృద్ధి:

ఐటీడీఏ పరిధిలో గిరిజన విద్యాభివృద్ధి కోసం 144 ఆశ్రమ పాఠశాలలు, 28 గురుకులాలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు (EMRS), 925 ప్రాథమిక పాఠశాలలు పనిచేస్తున్నాయని వివరించారు. వీటితో పాటు ప్రస్తుతం 18 మల్టీ పర్పస్ కేంద్రాలు ప్రజలకు సేవలు అందిస్తున్నాయని తెలిపారు.

ఈ విద్యాసంస్థల ద్వారా గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు కల్పించేందుకు ఐటీడీఏ ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.

గిరిజన మహనీయుల ఆశయాలను కొనసాగించాలి:

వీర సాగర్ ముండా, కొమురం భీమ్, రాంజీ గోండు, తాండ్య మామ, అల్లూరి సీతారామరాజు, రాణి గైదిన్ల్యూ వంటి ఎందరో గిరిజన వీరులు తమ హక్కులు, భూమి, అడవి, సంస్కృతి పరిరక్షణ కోసం పోరాటాలు చేశారని గుర్తుచేశారు. వారి త్యాగాలు, పోరాట ఫలితంగా గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక చట్టాలు, సంక్షేమ పథకాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:

గిరిజనుల కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్న పథకాలతో పాటు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా గిరిజనులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని పీఓ కోరారు.

ఉపాధి హామీ పథకం ద్వారా 125 రోజుల పని కల్పన, పీఎం జన్మన్ (PM-JANMAN), డీఏ-జేగువా (DA-JGUA) తదితర పథకాల ద్వారా గిరిజన ప్రాంతాల్లో రహదారులు, భవనాలు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వివరించారు.

అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి, వాటి ప్రయోజనాలు అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.

భగవాన్ బిర్సా ముండా, కొమురం భీమ్ వంటి గిరిజన మహనీయుల పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని విద్య, ఆరోగ్యం, ఉపాధి, సామాజిక అభివృద్ధి రంగాల్లో గిరిజనులు ముందుకు సాగినప్పుడే వారి ఆశయాలకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు