ఏడుపాయల్లో కార్తీక శోభ..
* వనదుర్గమ్మ సన్నిధిలో ఆకాశ దీప కాంతులు
* ప్రత్యేక ఆకర్షణగా చక్ర అలంకరణ
పాపన్నపేట, నవంబర్17: దేశంలోనే రెండో వనదుర్గామాత ఆలయంగా.. జనమేజయుని సర్పయాగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత సన్నిధి(Edupayala Vanadurga Mata Temple)లో కార్తీక శోభ సంతరించుకుంది. మంగళవారం ఆలయ అర్చకులు రావికోటి పార్థివ శర్మ వివిధ రకాల పుష్పాలతో చక్ర రూపాన్ని సుందరంగా తీర్చిదిద్దడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
రాత్రి సమయంలో వేదమంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కార్తీక దీపోత్సవం, ఆకాశ దీపోత్సవ వేడుకలను నిర్వహించారు. అమ్మవారి ముందున్న ధ్వజస్తంభం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్తంభానికి ఆకాశ దీపాన్ని శాస్త్రోక్తంగా వెలిగించి పైకి ఎగురవేశారు. లోక కళ్యాణార్థం ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఈ ఆకాశదీపాన్ని వెలిగించనున్నట్లు ఆలయ అర్చకులు పేర్కొన్నారు.