పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేయాలి
జిల్లా వ్యవసాయాధికారి దేవ్ కుమార్
పాపన్నపేట,నవంబర్17: పరిస్థితులకు అనుగుణంగా నీటి లభ్యతను(Water availability) బట్టి రైతులు పంటలు సాగు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి(District Agriculture Officer) దేవ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం పాపన్నపేట మండల పరిధిలోని నార్సింగ్ సర్పంచ్ మల్లేశం అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభకు ఆయన హాజరై మాట్లాడారు.
ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావం తక్కువగా నమోదు కావడంతో సాగునీటి కొరత తప్పదన్నారు. రైతులు నీటి లభ్యత బట్టి ఆరుతడి పంటలైన కూరగాయలు, నూనె గింజలు లాంటివి సాగు చేసుకోవాలన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేసుకోవడం వల్ల పంట నష్టం జరగకుండా రైతుకు లాభం చేకూరుతుందన్నారు.
గతంలో శాస్త్రవేత్తల ద్వారా ప్రతీ గ్రామంలో జిల్లా వ్యాప్తంగా ఆరుతడి పంటలు, చీడపీడల నివా రణ, ఎల్నినో ప్రభావం గురించి ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. దీర్ఘ కాలిక ఆదాయం పొందే అవకాశం ఉన్న ఆయిల్ పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలన్నారు. ఉద్యానవన శాఖల అధికారుల సలహాలు తీసుకొని పండ్ల తోటలు సాగు చేస్తే తక్కువ నీటితో అధిక లాభాలు ఆర్జించే అవకాశం ఉంద న్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీఓ యాదయ్య, తహసీల్దార్ సతీష్ , ఏవో శ్రీనివాస రాజ్, వివిధ శాఖల అధికారులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.