ఉప్పలమ్మ ఆలయానికి రూ.21 వేల విరాళం
జవహర్ నగర్, నవంబర్ 15 (విజయక్రాంతి): ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు ప్రతి ఒక్కరూ తమవంతు సహాయ సహకారాలు అందించాలని జవహర్ నగర్ మాజీ కార్పొరేటర్ జమాల్పూర్ నవీన్ కుమార్ కోరారు. ప్రజల భాగస్వామ్యంతో ఆధ్యాత్మిక వైభవాన్ని పునరుద్ధరించవచ్చని అన్నారు.
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ పాతబస్తీలో కొలువుదీరిన శ్రీ ఉప్పలమ్మ దేవాలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ వేడుకల నిర్వహణకు తనవంతు సహకారంగా మాజీ కార్పొరేటర్ జమాల్పూర్ నవీన్ కుమార్ రూ.21 వేల నగదును విరాళంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక వేడుకల విజయవంతానికి ప్రజలందరూ విరాళాలు అందించి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు శ్రీనివాస్ రెడ్డి, రాజ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డి శెట్టి మహేష్ గుప్తా, దేవాలయ నూతన కమిటీ కార్యవర్గ సభ్యులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.