రామప్ప శిల్పకళ అద్భుతం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు
వెంకటాపూర్, నవంబర్ 29 (విజయక్రాంతి): మండలంలోని ప్రపంచ ప్రఖ్యాత రామప్ప దేవాలయాన్ని(Ramappa Temple) ఆదివారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఐవైఆర్ కృష్ణారావు కుటుంబ సమేతంగా సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ మండపంలో ఈవో ఇమ్మడి భాస్కర్ శాలువాలతో ఆయనను సన్మానించగా, అర్చకులు ఆశీర్వచనం అందజేశారు.
టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ రామప్ప ఆలయ చరిత్ర, కాకతీయుల వైభవం, ఆలయ శిల్పకళా విశేషాలను వివరించారు. ఈ సందర్భంగా ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ.. రామప్ప దేవాలయ శిల్పకళ అద్భుతమని, ఆనాటి శిల్పుల పనితనం, నైపుణ్యం ఎంతో గొప్పదని కొనియాడారు. కార్యక్రమంలో రామప్ప హరిత మేనేజర్ శ్రవణ్, టూరిస్ట్ పోలీసులు శ్రీనివాస్, దశరథ్, బద్రు, పురావస్తు, దేవాదాయ, పర్యాటక శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.