క్యాన్సర్ రోగులకు కేంద్రం భారీ ఊరట

09-11-2026 | 05:09pm

న్యూఢిల్లీ: క్యాన్సర్ చికిత్స(Cancer Treatment) కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్న రోగులు, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రాణాంతక వ్యాధి చికిత్సలో ఉపయోగించే పలు ఔషధాల ధరలను గణనీయంగా తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 137 రకాల యాంటీ క్యాన్సర్ మందులపై ట్రేడ్ మార్జిన్‌లను నియంత్రించడంతో 1,364 ఔషధ ఫార్ములేషన్ల సవరించిన ధరలు నవంబర్ 9 నుంచి అమల్లోకి వచ్చాయి.

679 బ్రాండ్లపై 50 శాతానికి పైగా తగ్గింపు!

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) ఈ ధరల నియంత్రణ చర్యలు చేపట్టింది. అక్టోబర్ 17న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 137 గుర్తించిన క్యాన్సర్ ఔషధాల గరిష్ట రిటైల్ ధర (MRP)పై ట్రేడ్ మార్జిన్‌కు పరిమితి విధించింది.

నవంబర్ 8 నాటికి 85 ఫార్మా కంపెనీలు(Pharma companies) 121 ఔషధాలకు సంబంధించిన 1,364 ఫార్ములేషన్ల సవరించిన ధరలను ప్రభుత్వానికి నివేదించాయి. వీటిలో 679 బ్రాండ్ల ధరలు 50 శాతానికి పైగా తగ్గాయి. కొన్ని ఔషధాలపై గరిష్టంగా 96.45 శాతం వరకు ధర తగ్గింపు నమోదైంది. ఈ ధరల మార్పులతో వినియోగదారులకు ఏటా సుమారు రూ.3,540.38 కోట్ల మేర ఆదా అవుతుందని కేంద్రం అంచనా వేస్తోంది.

ధరలు ఎలా చెక్ చేసుకోవాలి?

క్యాన్సర్ మందులు కొనుగోలు చేసే రోగులు వాటి ప్యాకెట్లపై ముద్రించిన కొత్త MRPని తప్పనిసరిగా పరిశీలించాలి. అలాగే కేంద్ర ప్రభుత్వానికి చెందిన 'ఫార్మా సహీ దామ్'(Pharma Sahi Daam) మొబైల్ యాప్ లేదా NPPA అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఔషధాల ధరలను తనిఖీ చేసుకోవచ్చు. సవరించిన MRP కంటే ఎక్కువ ధరకు మందులు విక్రయించే హక్కు మెడికల్ షాపులు, ఆసుపత్రుల ఫార్మసీలకు లేదు.

ఎక్కువ ధర వసూలు చేస్తే ఫిర్యాదు చేయొచ్చు!

కొత్త ధరలు అమల్లోకి వచ్చినప్పటికీ మెడికల్ షాపులు లేదా ఆసుపత్రి ఫార్మసీలు అధికంగా డబ్బులు వసూలు చేస్తే వినియోగదారులు నేరుగా 'ఫార్మా జన్ సమాధాన్'(Pharma Jan Samadhan) పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు. అలాగే NPPA టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ 1800-111-255 ద్వారా కూడా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. క్యాన్సర్ చికిత్సలో మందుల ఖర్చు కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతున్న నేపథ్యంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రోగులకు గణనీయమైన ఊరటనిచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు