రోడ్డుపై అడుగుపెడితే పీతలే.. ఈ వింత ఎక్కడో తెలుసా?
వేలల్లో కాదు.. లక్షల్లో కాదు.. ఏకంగా కోట్లాది ఎర్ర పీతలు(Red crabs) రోడ్లపైకి వస్తే ఎలా ఉంటుంది? వాహనాలు కనిపించాల్సిన రోడ్ల(Roads)పై ఎర్రటి తివాచీ పరిచినట్లుగా పీతలే కనిపిస్తే? వినడానికి వింతగా ఉన్నా.. ఆస్ట్రేలియా(Australia)లోని క్రిస్మస్ ఐలాండ్(Christmas Island)లో ప్రస్తుతం కనిపించే అద్భుత దృశ్యం ఇదే! సంతానోత్పత్తి కోసం అడవుల నుంచి సముద్రం వైపు కదులుతున్న ఎర్ర పీతల భారీ వలస ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తోంది.
ఆస్ట్రేలియాకు చెందిన క్రిస్మస్ ఐలాండ్‌లో కోట్లాది రెడ్ క్రాబ్స్ నివసిస్తుంటాయి. సాధారణంగా దట్టమైన అడవుల్లో ఉండే ఈ పీతలు సంతానోత్పత్తి సమయం రాగానే ఒక్కసారిగా సముద్రం వైపు బయలుదేరుతాయి. వర్షాలు ప్రారంభమై వాతావరణం అనుకూలించగానే వాటి వలస ప్రయాణం మొదలవుతుంది.
ఇక ఆ తర్వాత కనిపించే దృశ్యం మాటల్లో వర్ణించలేనిది. అడవుల నుంచి రోడ్లపైకి చేరే పీతలు గుంపులు గుంపులుగా ముందుకు సాగుతాయి. కాలిబాటలు, రహదారులు, ఇళ్ల పరిసరాలు.. ఇలా ఎక్కడ చూసినా ఎర్రటి పీతలే కనిపిస్తాయి. దూరం నుంచి చూస్తే రోడ్లపై ఎర్రటి నది ప్రవహిస్తున్నట్లుగా అనిపిస్తుంది. అందుకే ఈ ప్రకృతి అద్భుతాన్ని 'రెడ్ క్రాబ్ మైగ్రేషన్'గా పిలుస్తారు.
ఈ వలసలో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అక్కడి అధికారులు పీతల ప్రాణాలను కాపాడేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. కోట్లాది పీతలు రోడ్లు దాటే సమయంలో వాహనాల కింద పడి చనిపోకుండా చర్యలు తీసుకుంటారు.
పీతల వలస ఎక్కువగా ఉండే రహదారులను తాత్కాలికంగా మూసివేస్తారు.వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తారు.పీతలు సురక్షితంగా రోడ్లు దాటేందుకు ప్రత్యేక క్రాబ్ బ్రిడ్జిలు ఏర్పాటు చేశారు.రోడ్ల కింద నుంచి వెళ్లేందుకు అండర్‌పాస్‌లను కూడా నిర్మించారు.మనిషి ప్రయాణానికి అడ్డంకిగా కనిపించే ఈ చిన్న జీవుల కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయడం నిజంగా విశేషమే!
ఈ పీతల వలస వెనుక ఓ అద్భుతమైన జీవన చక్రం దాగి ఉంది. సముద్ర తీరానికి చేరుకున్న ఆడ పీతలు తమ గుడ్లను సముద్రపు నీటిలో విడుదల చేస్తాయి. ఆ గుడ్ల నుంచి వెలువడే లార్వాలు సముద్రంలోనే కొంతకాలం పెరుగుతాయి. క్రమంగా చిన్న పీతలుగా మారిన తర్వాత తిరిగి భూమిపైకి చేరి అడవుల్లోకి వెళ్తాయి.అలా ప్రతి సంవత్సరం జరిగే ఈ వలస ప్రకృతి జీవవైవిధ్యంలో కీలక పాత్ర పోషిస్తోంది. తరతరాలుగా కొనసాగుతున్న ఈ ప్రయాణం క్రిస్మస్ ఐలాండ్‌కు ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తోంది.
అభివృద్ధి పేరుతో అడవులను నరికేస్తున్నాం.. రోడ్లు, భవనాల నిర్మాణంతో జీవుల ఆవాసాలను మార్చేస్తున్నాం. కానీ క్రిస్మస్ ఐలాండ్‌లో కనిపిస్తున్న దృశ్యం మాత్రం మనిషికి ఓ గొప్ప సందేశాన్ని ఇస్తోంది. ఈ భూమి కేవలం మనుషులది మాత్రమే కాదు.. ప్రతి జీవికి ఇందులో సమానమైన స్థానం ఉంది. కోట్లాది పీతల సహజ ప్రయాణానికి అడ్డంకులు కలగకుండా అధికారులు తీసుకుంటున్న చర్యలు పర్యావరణ పరిరక్షణకు ఓ చక్కటి ఉదాహరణ. ప్రకృతిని జయించడం కాదు.. దానితో కలిసి జీవించడం నేర్చుకోవాలని ఈ ఎర్రటి పీతల వలస మనకు గుర్తుచేస్తోంది.
రోడ్లపై ఎర్రటి సముద్రంలా కనిపించే ఈ దృశ్యం ఓ అందమైన ప్రకృతి అద్భుతం మాత్రమే కాదు.. భూమిపై ప్రతి జీవికి బతికే హక్కు ఉందనే విషయాన్ని చాటిచెప్పే గొప్ప సందేశం కూడా!