ఔను.. నా భార్యను మోసగించా!

10-11-2026 | 05:15am
  1. చైనా స్పై అలిస్‌తో నాకు ఎఫైర్ ఉంది
  2. అమెరికా టెక్ దిగ్గజం ఎన్విడియా సీఈవో జెన్సన్ లేఖ
  3. ఏఐ చిప్స్ రహస్యాలను చైనాకు చేరవేసినట్లు అలిస్‌పై ఆరోపణలు
  4. స్వతంత్ర దర్యాప్తుకు ఎన్విడియా డైరెక్టర్ల ఆదేశం
  5. జెన్సన్‌కు అండగా నిలిచిన ట్రంప్
  6. ఆరోపణలను ఖండించిన చైనా

వాషింగ్టన్, నవంబర్ 9: ప్రపంచ ఐటీ దిగ్గజ కంపెనీల్లో ఎన్విడియా(Nvidia)కు పెట్టింది పేరు. అమెరికా కేంద్రంగా పనిచేసే ఈ కంపెనీ.. ఏఐ చిప్స్ తయారీలో అగ్రస్థానంలో ఉంది. దాని సీఈవో జెన్సన్ హువాంగ్ చుట్టూ ఇప్పుడు ఎఫైర్ వివాదాలు ముసురుకున్నాయి.

చైనాకు చెందిన అలిస్ అనే మహిళతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. ఆ ఎఫైర్ వల్ల భార్యను మోసగించానని, తనను క్షమించాలంటూ లేఖ కూడా విడుదల చేశారు. అయితే.. సదరు మహిళ చైనా గూఢచారి అని ఇప్పటికే అమెరికా తేల్చింది. దీంతో జెన్సన్  అలిస్ వ్యవహారం ఇటు అమెరికాతోపాటు అటు చైనాలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నది.  

భార్యకు ద్రోహం చేశా: జెన్సన్ లేఖ

చైనాకు చెందిన అలిస్ హువాంగ్ అలియాస్ అలిస్ హువాంగ్ లీ అనే మహిళను చైనా స్పైగా ఇటీవల అమెరికా ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ ఓ లేఖ విడుదల చేశారు. అలిస్‌తో తనకు వివాహేతర సంబంధం ఉందని అందులో ప్రస్తావించారు. తన భార్య, పిల్లలకు క్షమాపణలు చెప్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ‘అలిస్‌తో ఎఫైర్ వల్ల నా భార్య, పిల్లలు ఎంత బాధపడ్డారో నేను అర్థం చేసుకోగలను.

40 ఏండ్లుగా నాతో వైవాహిక జీవితాన్ని గడుపుతున్న నా భార్య లోరీ హువాంగ్‌ను మోసం చేశాను. అందుకు పూర్తి బాధ్యత నాదే. క్షమాపణలు చెప్పినంత మాత్రాన నేను చేసిన తప్పు మాసిపోదు. ఎన్విడియా డైరెక్టర్లకు, ఉద్యోగులకు కూడా ఈ వ్యవహారాన్ని చెప్పాలనుకుంటున్నాను. వాళ్లు కూడా నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. ఎఫైర్ కారణంగా సంస్థలో ఎలాంటి అక్రమాలకు తావివ్వలేదు. ఎన్విడియా వ్యవహారాలన్నీ సవ్యంగానే ఉన్నాయి’ అని ఆ లేఖలో రాసుకొచ్చారు. 

చిప్స్ రహస్యాలు చైనాకు!

చైనా గూఢచారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అలిస్.. అమెరికాలోని ఏఐ చిప్స్ దిగ్గజ కంపెనీ ఎన్విడియా సీఈవో జెన్సన్‌తో ఎఫైర్ పెట్టుకోవడంతో చిప్స్ రహస్యాలను బీజింగ్‌కు చేరవేసి ఉండొచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. కావాలనే చైనా ఆమెను రంగంలోకి దింపి.. తమ భద్రతా వ్యవహారాలతోపాటు కీలకమైన చిప్స్ రహస్యాలను కూడా దొంగిలించిందని అమెరికా నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి.

ఇప్పటికే అలిస్‌ను చైనా స్పైగా ప్రకటించిన అమెరికా.. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నది. మరోవైపు సంస్థలో చోటుచేసుకున్న ఈ వ్యవహారంపై ఎన్విడియా డైరెక్టర్లు స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించారు. ఎలాంటి రహస్య సమాచారాలు బయటకు వెళ్లలేదని, ఎంతకైనా మంచిదని స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. జెన్సన్ నాయకత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. అయితే.. ఈ నెల 18న తమ ముందు హాజరై పూర్తి వివరాలు అందజేయాలని జెన్సన్‌ను అమెరికా ప్రతినిధుల సభకు చెందిన ముగ్గురు రిపబ్లికన్ కమిటీ చైర్మన్లు ఆదేశించారు. 

జెన్సన్ మంచోడు: ట్రంప్

చైనా లేడీతో తనకు ఎఫైర్ ఉందని ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాసిన లేఖపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. జెన్సన్ చాలా మంచి వ్యక్తి అని, అమాయకుడని, దేశం కోసం ఎంతో పనిచేశారని పేర్కొన్నారు. ఆయన ఎలాంటి తప్పు చేసి ఉండడని తాను భావిస్తున్నట్లు తెలిపారు. అయితే.. చైనా గూఢచారి అలిస్ పాత్రపై విచారణలో అన్నీ తేలుతాయని ట్రంప్ అన్నారు. 

అదంతా కట్టు కథ: చైనా

చైనా నిఘా సంస్థల కోసం అలిస్ హువాంగ్ లీ పనిచేస్తున్నారన్న ఆరోపణలను చైనా తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ నిరాధార ఆరోపణలని, తమపై బురదజల్లేందుకు చేస్తున్న కుట్ర అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్ అన్నారు. అమెరికా  చైనా మధ్య ఉన్న సంబంధాలను దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రలో భాగంగానే ఇలా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 

ఎవరీ లేడీ?!

చైనా గూఢచారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అలిస్ హువాంగ్ లీ.. సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్ అనే డేటా సెంటర్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఈ కంపెనీపై అమెరికా విచారణ ప్రారంభించింది. ఎన్విడియా సీఈవో జెన్సన్‌తో 2024లో అలిస్‌కు పరిచయం ఏర్పడినట్లు అమెరికా నిఘా సంస్థలు గుర్తించాయి. ఆ సమయంలో వారిద్దరూ కలిసి తైపీలోని ఓ హోటల్‌లో సన్నిహితంగా ఉన్నప్పటి ఫొటోలు, ఆ తర్వాత 2025లోనూ సన్నిహితంగా ఉన్నట్లు ఫొటోలు ప్రస్తుతం సర్క్యులేట్ అవుతున్నాయి.

అలిస్ సహకారంతో భారీగా ఏఐ చిప్స్‌ను ఎన్విడియా నుంచి మెగాస్పీడ్ సంస్థ కొనుగోలు చేసింది. దానికితోడు జెన్సన్‌తో ఎఫైర్ పెట్టుకొని ఎన్విడియా చిప్స్ రహస్యాలను అలిస్ దొంగిలించి చైనాకు చేరవేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై అమెరికా పూర్తి విచారణ చేపట్టింది. అలిస్ ప్రస్తుతం తమ సంస్థలో పనిచేయడం లేదని మెగాస్పీడ్ పేర్కొంది. గతంలో ఆమె చైనాలోని హునాన్ టీవీలో యాంకర్‌గా, అక్కడి ప్రభుత్వ మీడియా సీసీటీవీలో రిపోర్టర్‌గా పనిచేసినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తమ సంస్థలో అలిస్ పనిచేయలేదని, ఆమె ఎవరో కూడా తమకు తెలియదని హునాన్ టీవీ యాజమాన్యం అంటున్నది. 

350 లక్షల కోట్ల సంస్థకు వారసుడెవరు?

జెన్సన్ హువాంగ్ 1993లో ఎన్విడియా అనే ఐటీ సంస్థను స్థాపించారు. ఆ సమయంలో ఆయన వయసు 30 ఏండ్లు. జెన్సన్‌కు లోరీతో 1985లో వివాహమైంది. క్రమక్రమంగా ఏఐ చిప్స్ తయారీలో ఎన్విడియా ప్రపంచ దిగ్జజ కంపెనీగా ఎదిగింది. జెన్సన్, లోరీ దంపతులకు మాడిసన్ అనే కూతురు, స్పెన్సర్ అనే కొడుకు ఉన్నారు. వీళ్లు కూడా ఎన్విడియాలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. లోరీకి ఎన్విడియాలో ప్రత్యేకంగా భాగస్వామ్యం లేకపోయినప్పటికీ కుటుంబం తరఫున చారిటీని ఆమె నడిపిస్తున్నారు.

చైనా స్పైతో తనకున్న ఎఫైర్ గురించి ప్రస్తావించిన జెన్సన్ త్వరలో ఎన్విడియా సీఈవో బాధ్యతల నుంచి తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 4 ట్రిలియన్ డాలర్లకుపైగా (సుమారు రూ. 350 లక్షల కోట్ల) మార్కెట్ విలువ కలిగిన ఎన్విడియా సంస్థను జెన్సన్ తర్వాత చూసుకునేదెవరు అనేది ఇప్పుడు టెక్ కంపెనీల్లో చర్చకు దారితీసింది. ఇదిలా ఉంటే.. ఎఫైర్ వ్యవహారంతో ఎన్విడియా కంపెనీ షేర్లు 5శాతం మేర కుప్పకూలాయి.

మరిన్ని వార్తలు