పోటీ వద్దు.. సహకారమే ముద్దు

18-11-2026 | 05:05am
  1. ప్రపంచానికి కావాల్సింది శాంతి, సుస్థిరం
  2. ఆసియాన్ వేదికగా ప్రధాని మోదీ సందేశం
  3. భారత్-ఆగ్నేయాసియా బంధానికి కొత్త దిశ

మనీలా, నవంబర్ 17: దేశాల మధ్య పోటీ వద్దని, పరస్పర సహకారమే భవిష్యత్తుకు బంగారు మార్గమని ప్రధాని మోదీ(Prime Minister Modi) పిలుపునిచ్చారు. ప్రపంచం అనేక సంక్షోభాలు(Crises), భౌగోళిక రాజకీయ(geopolitics) ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితులను ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితిలో ఒకరినొకరు సహకరించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా(Manila, the capital of the Philippines)లో జరుగుతున్న 23వ ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సదస్సులో 11 సభ్య దేశాల నేతలను ఉద్దేశించి మోదీ మంగళవారం ప్రసంగించారు.

భారత్, ఆగ్నేయాసియా దేశాల(Southeast Asian countries) సమాఖ్య కలిసి ప్రపంచ జనాభాలో నాలుగో వంతు ఉన్నారని.. ఈ అపారమైన మానవ వనరులు, ఆర్థిక శక్తి ప్రపంచ అభివృద్ధికి దోహదపడాలని ఆకాంక్షించారు. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల్లో శాంతి, స్థిరత్వం, పరస్పర విశ్వాసం అత్యంత అవసరమన్నారు. యుద్ధాలు, ఆర్థిక అనిశ్చితులు, ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచం వరుస సంక్షోభాలను ఎదుర్కొంటోందని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వ్యవస్థపై దీని ప్రభావం పడకుండా ఉండాలంటే దేశాలన్నీ ఒకరికొకరు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. 

కలిసి భవిష్యత్తును నిర్మించుకుందాం

ఆసియాన్-భారత్ సదస్సు ఈ ఏడాది ఇతివృత్తమైన ‘నావిగేటింగ్ అవర్ ఫ్యూచర్, టుగెర్’ (కలిసి మన భవిష్యత్తును నిర్మించుకుందాం) ఎంతో ప్రాధాన్యత కలిగి ఉందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. భారత్, ఆసియాన్ దేశాలు కలిసి ఈ ప్రాంతాన్ని శాంతి, సుస్థిరత్వం, సమృద్ధికి కేంద్రంగా మార్చగల సామర్థ్యం, సంకల్పం కలిగి ఉన్నాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్ అభివృద్ధి, ఆసియాన్ దేశాల శ్రేయస్సు ఒకదానితో మరొకటి గాఢంగా ముడిపడి ఉన్నాయన్నారు.

భారత్ పెట్టుకున్న ‘వికసిత భారత్-2047’, ఆసియాన్ రూపొందించుకున్న ‘ఆసియాన్ కమ్యూనిటీ విజన్-2045’ ఉమ్మడి ఆకాంక్షలను నెరవేర్చడంలో కీలకపాత్ర పోషిస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రెండు దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలు ఆర్థిక వృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల, ప్రాంతీయ అనుసంధానానికి కొత్త అవకాశాలు సృష్టిస్తాయన్నారు. భారత్ అనుసరిస్తున్న ‘యాక్ట్ ఈస్ట్’ విధానం ఆసియాన్ దేశాలతో సంబంధాలకు కొత్త ఊపునిచ్చిందని మోదీ చెప్పారు.

ఆగ్నేయాసియా దేశాలతో భారత్‌కు ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు ఇప్పుడు వ్యూహాత్మక, ఆర్థిక భాగస్వామ్యంగా మరింత విస్తరిస్తున్నాయని వివరించారు. ఆసియాన్ ఐక్యతకు, ప్రాంతీయ వ్యవహారాల్లో దాని కేంద్ర పాత్రకు భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. వాణిజ్యం, పెట్టుబడులు, రవాణా, సముద్ర భద్రత, సాంకేతిక పరిజ్ఞానం వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 

డిజిటల్, రక్షణ, అంతరిక్షం రంగాల్లోనూ సహకారం విస్తరణ

భారత్-ఆసియాన్ భాగస్వామ్యం మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ సాంకేతికత, రక్షణ, అంతరిక్షం వంటి ఆధునిక రంగాల్లోనూ విస్తరిస్తోందని మోదీ అన్నారు. ప్రకృత్తి విపత్తులు, వాతావరణ మార్పులు, తీర ప్రాంతాలకు ఎదురయ్యే ప్రమాదాలు భారత్, ఆసియాన్ దేశాలకు ఉమ్మడి సవాళ్లుగా ఉన్నాయన్నారు. సమయానికి ప్రమాదాలను గుర్తించడం, ప్రజలకు ముందస్తు సమాచారం అందించడం, అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలను వేగవంతం చేయడం వంటి అంశాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడం ఇరుపక్షాలకూ ప్రయోజనకరంగా ఉంటుందని ప్రధాని చెప్పారు.

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం ద్వారా సురక్షితమైన, సమ్మిళితమైన, సంపన్నమైన ఇండో-పసిఫిక్ ప్రాంత నిర్మాణానికి కృషి చేయాలని మోదీ ఆకాంక్షించారు. ఈ సదస్సును విజయవంతంగా నిర్వహించిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిని ప్రధాని మోదీ అభినందించారు. ఈ సదస్సు భారత్, ఆసియాన్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు