01-11-2025 12:36:20 AM
* మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి
* మొంథా’ నష్టంపై మాజీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ డిమాండ్
హుస్నాబాద్, అక్టోబర్ 31 :మొంథా తుపాను కారణంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు భారీ పరిహారాన్ని అందించాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన హుస్నాబాద్ శివారులో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండలాల్లో, ముఖ్యంగా భీమదేవరపల్లి మండలంలో ఏకంగా 42 సెంటీమీటర్ల వర్షం పడటం వల్ల పంట నష్టం తీవ్రంగా జరిగిందన్నారు.
హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, భీమదేవరపల్లి, సైదాపూర్, ఎల్కతుర్తి మండలాల్లో పంటలు నీ టమునిగాయన్నారు. పంట నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.10 వేలు పరిహారం సరిపోదన్నారు. ఎకరానికి కనీసం రూ.28 వేల పెట్టుబడి అవుతున్నందున, నష్టపోయిన ప్రతి ఎకరానికి రూ.25 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తుఫాను కారణంగా నియోజకవర్గంలో నలుగురు మృత్యువాత పడ్డారని సతీశ్ కుమార్ ఆవేదన వ్యక్తం చే శారు. భీమదేవరపల్లి లో నివాసం ఉండే కల్పన, ప్రణయ్ అనే భార్యాభర్తలు, మల్లంపల్లికి చెంది న పుల్లూరు రామకృష్ణ, కొత్తపల్లికి చెందిన అప్పని నాగేంద్ర మృతి చెందారని తెలిపారు.
మృతి చెందిన ఆ నలుగురి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించడంతో పాటు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లోని ఐకేపీ సెం టర్లు, కల్లాల వద్ద తడిసిన ధాన్యం, పత్తిని సైతం వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. హుస్నాబాద్ మార్కెట్ యార్డులో వడ్లు కొట్టుకుపోయి నష్టపోయిన తారవ్వ అనే మహిళా రైతుకు డబ్బులు వెంటనే చెల్లించడం హర్షణీయమని, నియోజకవర్గంలోని ఇలాంటి ఇతర బాధితులకు కూడా సకాలంలో డబ్బులు చెల్లించేలా మంత్రి చొరవ తీసుకోవాలని కోరారు. తుఫాను వల్ల దెబ్బతిన్న ప్రతి పంటపై పూర్తిస్థాయిలో సర్వే చేసి, నివేదికను వెంటనే తెప్పించుకుని పరిహారం కూడా సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే, రైతుల పక్షాన బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.