01-11-2025 12:34:41 AM
- సస్పెండ్ చేయకపోతే కలెక్టరేట్ ను ముట్టడిస్తాం..
- నేతకాని మహర్ నాయకుల హెచ్చరిక
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ దుగుట భార్గవ్ అకాల మరణానికి స్థానిక ఎంపీడీవో మహేందర్ వేధింపులే కారణమని నేతకాని మహర్ సేవా సంఘం రాష్ట్ర నాయకులు , మాజీ ఎంపిటిసి ముడిమడుగుల మహేందర్, గట్టు బానే, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గోమాస శ్రీకాంత్, జిల్లా అధికార ప్రతినిధి తాళ్లపల్లి రాజలింగు, సామాజిక ఉద్యమ కార్యకర్త లింగంపల్లి భీమేష్ లు ఆరోపించారు. దుగుట భార్గవ్ మరణానికి కారణమైన ఎంపీడీవో మహేందర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
శుక్రవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మండలంలోని సోమగూడెం గ్రామపంచాయతీలో బృహత్ పల్లె ప్రకృతి వనంలో మొక్కలకు నీళ్లు పట్టించే పనులకు రూ 1.72 లక్షల బిల్లును ఎంబి రికార్డ్ చేసేందుకు ఎంపీడీవో మహేందర్, పంచాయతీ కార్యదర్శి ప్రేమ్ ప్రసాద్ లు ఉపాధి హామీ ఈసీ అనిల్ కుమార్, టి ఏ భార్గవ్ లతో ముందుగా 80 శాతం పర్సంటేజీకి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. పనులకు సంబంధించిన ఎంబి రికార్డ్ పూర్తి చేశాక 50 శాతం పర్సంటేజీ ఇస్తానని నమ్మించి ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి ముందుగానే రూ 1.50 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు.
మొక్కల మెయింటెనెన్స్ చేసిన ఉపాధి హామీ ఈసీ అనిల్, టి ఏ భార్గవ్ లకు మిగిలిన రూ 25 వేలు గ్రామపంచాయతీ నుండి చెక్కు రూపంలో ఇచ్చి తన వద్ద పర్సంటేజీ వసూలు చేశారని బ్లాక్మెయిల్ చేసినట్లు వారు ఆరోపించారు. దీంతో ఆందోళన చెందిన ఉపాధి హామీ ఈసీ అనిల్ కుమార్, టీ ఏ భార్గవ్ లు ఎంపీడీవోను నిలదీయడంతో గొడవ జరిగినట్లు వారు తెలిపారు. తనకు అనుకూలంగా అగ్రిమెంట్ పత్రం రాసి ఇవ్వాలని లేకుంటే తన వద్ద పర్సంటేజీ చెల్లించిన విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తానని ఎంపీడీవో బెదిరించడంతో ఈసీ అనిల్ కుమార్, టి ఏ భార్గవ్ ను ఎంపీడీవో చెప్పినట్లుగానే లిఖితపూర్వకంగా అగ్రిమెంట్ పత్రాన్ని రాసి ఇచ్చినట్లు వారు తెలిపారు.
గొడవ జరిగిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంపీడీవో మహేందర్ కొనసాగుతున్న ఈజీఎస్ పథకం నేమ్ బోర్డుల కు మంజూరు చేసిన బిల్లులలోను పర్సంటేజీ డిమాండ్ చేసినట్లు వారు ఆరోపించారు. ఉపాధి హామీకింద చేపట్టిన పనులను ఫీల్డ్ విజిట్ చేస్తున్నట్లు చెప్పి 140కి పైగా నేమ్ బోర్డులు నిర్మించకుండానే రూ 5.80 లక్షలు ఎలా స్వాహా చేశారని కార్యాలయంలో అందరి ముందు తిట్టారని వారు ఆరోపించారు. బిల్లులు మంజూరు చేసిన 131 నేమ్ బోర్డులను మాత్రమే పూర్తి చేయాల్సి ఉండగా 120 వరకు గుత్తేదారు జునుగురు సతీష్ పూర్తి చేసినట్లు వారు తెలిపారు. కేవలం 10 నేమ్ బోర్డులు మాత్రమే నిర్మాణ పనుల్లో ఉండగా మొత్తానికే నిర్మించలేదని, నిధులు స్వాహా చేశారని ఎంపీడీవో అసత్య ఆరోపణలు చేయడంతో ఈసీ అనిల్ కుమార్, టి ఏ భార్గవ్ తీవ్ర మనోవేదనకు, ఒత్తిడికి గురయ్యారని వారు తెలిపారు.
ఎంపీడీవో తనను మానసికంగా వేధిస్తున్నాడని మృతుడు భార్గవ్ తమతో ఆవేదన పంచుకున్నట్లు వారు స్పష్టం చేశారు. ఎంపీడీవో మహేందర్ గతంలో ఇదే మండలంలో పనిచేసిన సమయంలో 350 మంది పేదల పింఛన్లు అకారణంగా తొలగించారని ఆరోపించారు. గతంలో ఆయన పనిచేసిన పలు మండలాలలో కూడా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. సోషల్ మీడియాలో తమపై తన సొంతగా వీడియో పోస్టులు పెట్టితాను మంచివాడినని నిరూపించుకునే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా టి ఏ భార్గవ్ మృతిపై జిల్లా కలెక్టర్ స్పందించి కారకుడైన ఎంపీడీవో మహేందర్ ను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎంపీడీవో మహేందర్ పై చర్యలు తీసుకున్నట్లయితే జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని, దశల వారి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.