calender_icon.png 1 November, 2025 | 7:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడుగు మంత్రులకు అరకొర శాఖలు

01-11-2025 12:43:25 AM

  1. అగ్రవర్ణ అమాత్యుల చేతిలోనే కీలకమైనవి

80 శాతం ప్రజలకు 8 స్థానాలు... 20 శాతం ప్రజలకు 8 స్థానాలు

హైదరాబాద్, అక్టోబర్ 31 (విజయక్రాంతి) : సమాజంలో 80 శాతం బడుగు వర్గాలుగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలపై ప్రభుత్వం నిజంగా సానుభూతితో ఉందా.. పరిపాలనలో వారికి సముచిత స్థానాన్ని కల్పించాలని కోరుకుంటుందా.. మేమెంతో మాకంత అనే నినాదంతో ముందుకు సాగుతున్న వివిధ వర్గాల పట్ల ప్రజాప్రభుత్వం ఎలాంటి వైఖరితో ఉందనే దానిని లోతుగా ఆలోచిస్తే.. పెదవి విరుపే కనపడుతోంది.

పైకి ప్రచారం చేసుకున్నంతగా ప్రభుత్వంలో వారికి అవకాశం దక్కనీయడం లేదనే ఆరోపణలకు బలమైన వాదనలు వినపడుతున్నాయి. సాక్షాత్తు రాష్ట్ర మంత్రివర్గంలో కేటాయించిన ఆయా శాఖలను పరిశీలిస్తే.. అగ్రవర్ణ అమాత్యులకు మాత్రమే కీలకమైన శాఖలను కేటాయించగా.. బడుగులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులకు మాత్రం ఏదో తూతూ మంత్రంగా ఆయా శాఖలను కట్టబెట్టినట్టుగా అర్థమవుతోంది.

20 శాతం కూడా లేని వర్గాలకు 50 శాతం అమాత్య పదవులు

రాష్ట్ర మంత్రి వర్గంలో సీఎంతో కలుపుకుని మొత్తం 18మంది వరకు ఉండవచ్చు. సీఎంతోపాటు మొత్తం 15 మంది మంత్రులుండగా.. శుక్రవారం  ముస్లిం మైనారిటీ వర్గం నుంచి అజారుద్దీన్‌కు మంత్రిగా అవకాశం ఇచ్చారు. దీనితో మంత్రివర్గంలోని సంఖ్య మొత్తం 16కు చేరింది.

బడుగుల గురించి గొప్పగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభు త్వం 80 శాతానికిపైగా ప్రాతినిధ్యం వహించే బడుగు, బలహీన వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందినవారికి కేవలం 8 స్థానాలు కేటాయించగా.. తాజాగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్‌తో కలుపుకుని మొత్తం 8 మంది అగ్రవర్ణాలకు చెందినవారే ఉండటం గమనార్హం. అంటే సమాజంలో 80శాతం ప్రజలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం కేవలం 8 మందికి ఇవ్వగా...

20 శాతం అగ్రవర్ణాలకు చెందినవారికి మరో 8స్థానాలు అప్పజెప్పడంపై బలహీన వర్గాలు  అసంతృప్తితో ఉన్నాయనేది సత్యం. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వర్‌రావు, మహ్మద్ అజారుద్దీన్‌లు ఓసీ కేటగిరీ కిందకు వస్తారు.

ఇక మిగిలిన వారిలో 56 శాతానికి పైగా జనాభా ఉన్న బీసీ వర్గాలకు చెందిన మం త్రులు కేవలం ముగ్గురు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి ఉన్నారు. ఎస్సీల్లో నల్గురికి డిప్యూటీ సీఎం భట్టి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వివేక్ వెంకటస్వా మి, దామోదర రాజనర్సింహలకు అవకాశం కల్పించారు. గిరిజన వర్గం నుంచి కేవలం ఒకే ఒక్కరికి సీతక్కకు అవకాశం కల్పించారు. 

బడుగులకు అత్తెసరు శాఖలు

సీఎంతో కలుపుకుని అగ్రవర్ణాలకు చెందినవారు 8మంది ఉండగా.. వీరందరికీ ప్రాధాన్యమైన, కీలకమైన శాఖలను అప్పజెప్పడం గమనార్హం. బీసీ, ఎస్సీ, ఎస్టీ మం త్రులతో పోల్చుకుంటే.. ప్రభుత్వంలో చక్రం తిప్పే, ప్రభావం చూపే శాఖలను సీఎంతోపాటు, ఓసీ వర్గాలకు చెందిన మంత్రుల వద్దే ఉండటం బడుగులను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది.

ప్రభుత్వంలో కీలకమైన సీఎం రేవంత్ రెడ్డి వద్ద జీఏడీ, ఎంఏయూడీ, హోం, విద్యతోపాటు మంత్రులకు కేటాయి ంచని శాఖలన్నీ ఉన్నాయి. ఇక ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నుంచి  జూపల్లి వరకు ఉన్న ఓసీ మంత్రుల పోర్ట్‌ఫోలియోలు  ప్రాధాన్యత ఉన్నవి.  తాజా మంత్రి అజారుద్దీన్‌కు ఇంకా శాఖలను కేటాయించలేదు.

పెదవి విరిచేలా..

ఇదే సమయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మంత్రులకు కేటాయించిన శాఖలు మాత్రం పెదవి విరిచేలా ఉన్నాయని ఆయా సామాజిక వర్గాలే అంటున్నాయి. అయితే ఇందులో డిప్యూటీ సీఎం భట్టి వద్ద ఆర్థిక, విద్యుత్తు శాఖలు ఉన్నాయనేది కాస్తా ఆలోచించాల్సిన అంశమని బడుగులు అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో సుమారు  పదేండ్ల పాటు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న ఆర్థిక శాఖ, విద్యుత్తు శాఖలను డిప్యూటీ సీఎంకు అంటగట్టడంపై లోలోపల అసంతృప్తి వ్యక్తమవుతోంది.

వ్యవసాయ శాఖతో సంబంధం ఉండే పశు సంవర్థక, పాడి అభివృద్ధి శాఖను వాకిటి శ్రీహరికి ఇవ్వడంపై ఆయా సామాజిక వర్గాల్లో చర్చ జరుగుతోంది.  పొన్నం ప్రభాకర్, సీతక్క, దామోదర రాజనర్సింహ లాంటివారికి కేటాయించిన శాఖలు అత్యంత కీలకమైనవి కావు కానీ.. ఒకింత ప్రాధాన్యత ఉన్నవే అనేది ఉంది. ఇవి మినహా మిగతావారికి కేటాయించిన శాఖలను పరిశీలిస్తే.. ఏదో ఇచ్చాం.. అన్నట్టుగానే కనపడుతోంది. వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, ఉన్నత చదువులు చదివిన సీతక్క లాంటి వారికి మరింత కీలకమైన శాఖలను కేటాయించాల్సిందనే చర్చ కూడా ఉంది.

ఏదేమైనా అసలు 80 శాతం ప్రజలకు ప్రాతినిధ్యం వహించేవారికి అతి తక్కువ అవకాశాలు ఇవ్వడం.. ఆ ఇచ్చిన శాఖలుకూడా తూతూ మంత్రంగా కేటాయించినట్టుగా చర్చ జోరుగా సాగుతోంది. పైగా ఆయా నేతలకు ఉన్న అనుభవం, చదువును పరిగణలోకి తీసుకుని శాఖలను కేటా యించినా మరింత కీలకమైన, ప్రాధాన్యత ఉన్న శాఖలు వచ్చేవని అంచనా వేస్తున్నారు.

ఇప్పటికీ విద్య, మున్సిపల్ పరిపాలనా, పట్టణాభివృద్ధి, హోం లాంటి శాఖలు సీఎం వద్దే ఉన్నాయి. ఇలాంటి కీలకమైన శాఖలనైనా బడుగులకు కేటాయిస్తే.. సముచితమైన అవకాశం కల్పించినట్టవుతుంది.  

కాంగ్రెస్ అవకాశాలు కల్పిస్తుందా?

ఇక 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని కుండబద్దలు కొడుతున్న కాంగ్రెస్ పార్టీ.. మంత్రివర్గ పదవుల్లోనూ అదే స్థాయిలో అవకాశాలు కల్పిస్తుందా అనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మొత్తం 18 మంత్రి పదవులకుగాను బీసీలకు కనీసం 8 స్థానాలైనా కేటాయిస్తేనే... 42 శాతం రిజర్వేషన్లు అనేది ప్రజల్లోకి వెళు తుందని.. లేకపోతే.. ప్రజాప్రభుత్వం కూడా సామాజిక వర్గాలకు న్యాయం చెయ్యదనే అసంతృప్తి మరింత పెరిగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఆయా వర్గాలకు సముచితమైన స్థానాలు ఇవ్వడంతోపాటు.. కీలకమైన, ప్రాధాన్యత ఉన్న శాఖలను కేటాయిస్తే.. బడుగులపై చిన్నచూపు అనేది లేదని చెప్పినట్టవు తుందని అంటున్నారు. ప్రభు త్వం పూర్తిస్థా యిలో (18) మంత్రివర్గం పునర్వవస్థీకరించే సమయానికైనా ఈ దిశగా నిర్ణయం తీసుకుంటుందా.. లేదా వేచి చూడాల్సిందే.

సీఎం/మంత్రుల పేరు సామాజిక వర్గం కేటాయించిన శాఖలు

1. ఏ రేవంత్‌రెడ్డి (ముఖ్యమంత్రి) ఓసీ (రెడ్డి) జీఏడీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ (ఎంఏయూడీ), లా అండ్ ఆర్డర్, విద్యా శాఖ,మంత్రులకు కేటాయించని ఇతర అన్ని శాఖలు

2. ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓసీ (రెడ్డి) నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి, ఆహారం, పౌర సరఫరాల శాఖ

3. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఓసీ (రెడ్డి) రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ

4. డీ శ్రీధర్‌బాబు ఓసీ (బ్రాహ్మణ) ఐటీ, కమ్యూనికేషన్లు, పరిశ్రమలు, వ్యాపారం, శాసనసభా వ్యవహారాలు

5. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓసీ (రెడ్డి) రెవెన్యూ, హౌజింగ్, సమాచార, పౌర సంబంధాలు

6. తుమ్మల నాగేశ్వరరావు ఓసీ (రెడ్డి) వ్యవసాయం, మార్కెటింగ్, సహకార శాఖ, చేనేత, జౌళి శాఖలు

7. జూపల్లి కృష్ణారావు ఓసీ (వెలమ) ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, పర్యాటకం, సాంస్కృతిక శాఖలు

8. మహ్మద్ అజారుద్దీన్ ఓసీ (ముస్లిం) * ఇంకా శాఖలు కేటాయించలేదు

9. భట్టి విక్రమార్క ఎస్సీ ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్తు శాఖలు

10. దామోదర రాజనర్సింహ ఎస్సీ వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, సైన్స్ అండ్ టెక్నాలజీ

11. గడ్డం వివేక్ వెంకటస్వామి ఎస్సీ కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలు, మైన్స్ అండ్ జియాలజీ

12. అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఎస్సీ ఎస్సీ అభివృద్ధి, ఎస్టీ, మైనారిటీ సంక్షేమం, వికలాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సాధికారత శాఖలు

13. పొన్నం ప్రభాకర్ బీసీ రవాణా, బీసీ సంక్షేమం

14. కొండా సురేఖ బీసీ దేవాదాయ, పర్యావరణ, అటవీ శాఖలు

15. వాకిటి శ్రీహరి బీసీ పశు సంవర్థక, డైరీ డెవలప్‌మెంట్, ఫిషరీస్, స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్

16. ధనసరి అనసూయ సీతక్క ఎస్టీ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి (గ్రామీణ నీటి సరఫరా), మహిళా, శిశు సంక్షేమం