01-11-2025 01:02:09 AM
నాటి గర్జనలేవి.. గాండ్రింపులేవి!?
* ‘మేము రాష్ట్రాన్ని అడగడం లేదు, మా ఆత్మను తిరిగి పొందాలనుకుంటున్నాం’ అని ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో గర్జించిన ప్రొ. కోదండరామ్, ప్రజల ఆశల తుఫాన్ లాగా వచ్చిన టీజేఎస్ మాటున చల్లపడిపోయారు.. ‘ఇప్పుడు ఆయన మంత్రుల గదుల వద్ద తచ్చాడుతున్నారు’.. మిలియన్ మార్చ్ గర్జన గుర్తున్న వారిలో కోదండ్‌రామ్ తిరిగి ప్రజల్లోకి వస్తారనే ఆశ సజీవంగానే ఉంది. ఎందుకంటే కోదండరామ్ సర్ గాయపడి ఉన్నా, మళ్లీ గర్జించడానికి తెలంగాణ స్ఫూర్తి ఇంకా రగులుతూనే ఉంది.
హైదరాబాద్, అక్టోబర్ 31 (విజయక్రాంతి) : ప్రొఫెసర్ కోదండరామ్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన పేరు తెలియ నివారంటూ ఉండరు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన చూపిన ప్రభావం అలాంటిది. సమైక్య పాలకులకు ఎదురొడ్డి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ఘనత ఆయన సొంతం. ప్రొ. జయశంకర్ సారు సిద్ధాంతా లను అమలుచేయడంలో ప్రొ.కోదండరామ్ కీలక పాత్ర పోషించారు.
తెలంగాణ యువతను చైతన్యపరిచి, ఉద్యమానికి ఊపిరి పోసిన ఆయనను అందరూ ‘కోదండరామ్ సర్’గా గౌరవంగా పిలుచుకునేవారు. ఉద్యమ సమయంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ(టీజేఏసీ)కి నాయకత్వం వహించిన కోదండరామ్ ఉద్యమానికి దిక్సూచిగా నిలిచారు. ఆయన మార్గనిర్దేశం లో కోట్లాదిమంది సమైక్యవాదానికి వ్యతిరేకంగా ఉద్యమంలో భాగస్వాములయ్యారు.
అయితే కోదండరామ్ చేసిన కృషికి తెలంగాణ ఆవిర్భావ చరిత్రలో ఆయన పేరు శాశ్వతంగా నిలిచిపో తుంది. కానీ నేడు ఆయన కీర్తి మసకబారిందనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన అధికారం, స్వంత ప్రయోజనం అనే క్రాస్ రోడ్డులో నిల్చొని ఉన్నారు. ప్రజల గళం వినకపోతే, లేకపోతే శక్తివంతమైన జ్వాలలు కూడా మసకబారుతాయనడానికి కోదండరామ్ ప్రస్థానం ఒక స్పష్టమైన నిదర్శనం.
2011 వేసవిలో మొదటిసారి అన్యాయంపై ఆయన గళం విప్పారు. జేఏసీ చైర్మన్‌గా ఆయన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వామపక్షాలు వంటి విభిన్న రాజకీయ శక్తులను ఒకే జెండా కిందకి చేర్చారు. ఆయన మాటే చట్టంగా, ఆయన పిలుపే ఒక ఆజ్ఞగా.. ఉద్యమం నడిచింది. చరిత్రలో నిలిచిపోయే ఘట్టమైన ‘మిలియన్ మార్చ్’ సమయంలో లాఠీఛార్జీలు, టియర్ గ్యాస్ దాడు లను ఎదురించి కోదండరామ్ ధైర్యంగా నిలబడ్డారు.
‘మేము రాష్ట్రాన్ని అడగడం లేదు, మా ఆత్మను తిరిగి పొందాలనుకుంటున్నాం’ అని ఆయన గర్జించారు. లాఠీఛార్జులు, అరెస్టులతో దారుణమైన అణచివేతలోనూ తెలంగాణ రాష్ట్ర సాధన పట్ల ఆయన సంకల్పం తెలంగాణ ప్రజల ఆవేదనను తిరుగుబాటుగా మలిచింది. పార్టీలు, వర్గాలకు అతీతంగా నాయకులు, ప్రజలు కదిలారు. ఢిల్లీ దాకా కోదండరామ్ పిలుపు వినిపించింది. బీబీసీ నుంచి న్యూయార్క్ టైమ్స్ వరకు మీడియా సంస్థలు ఆయనను ప్రజా ఉద్యమ నాయకుడిగా కొనియాడాయి.
ప్రత్యేక తెలంగాణకూ ఆయన నాయకుడనుకున్నా..
అనేక పోరాటాలు, వందలాది మంది అమరుల త్యాగం ఫలితంగా 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిం చింది. త్యాగం, బలిదానాల నుంచి పుట్టిన ఫీనిక్స్‌లా కొత్త రాష్ట్రానికి కాపలాదారుడిగా, ప్రజల పక్షాన నిలిచే నాయ కుడిగా కోదండరామ్ ఉంటారని ప్రజలందరూ ఊహించారు. కానీ అధికారం కావా లని ఆయన తాపత్రయ పడలేదు. స్వంత ప్రయోజనాలు పొందాలనే తపన ఆయనకు లేదు. నిజాయతే ఆయన సంపదగా, నిష్కల్మషమే ఆయన కవచంగా ముందుకు సాగారు. కానీ అనేక రాజకీయ పరిణామాల మధ్య ఆయనకు వ్యతిరేక పవనాలు వీచా యి.
తెలంగాణ విజయానికి శిల్పి అయిన కేసీఆర్.. కోదండరామ్‌ను పక్కన పెట్టారు. సెక్రటేరియట్ గోడల వెనుక నిశ్శబ్ద యుద్ధం మొదలైంది. మొదట మర్యాదపూర్వకంగా మొదలైన దూరం, తరువాత స్పష్టమైన విరోధంగా మారింది. కనీసం మాట్లాడటానికి కూడా స్వేచ్ఛ లేకుండా కోదండరామ్‌పై పోలీసుల దౌర్జన్యమే సమాధానం అయింది. ఆయనను ఇంటిలోనే నిర్భందించడం, రాత్రి సమయంలో ఆయన ఇంటిపై దాడులు చేయడం, కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేయడం వంటి దారుణమైన పరిస్థితులు ఎదురయ్యాయి.
ఆచరణకు నోచుకోని హామీ..
అనేక నిర్బంధాలు, అవరోధాలను ఎదుర్కొన్న కోదండరామ్ మొక్కవోని మనో ధైర్యంతో 2017లో తెలంగాణ జన సమితి(టీజేఎస్)ను ప్రారంభించారు. ఉద్యమ ఆద ర్శాలను కాపాడే దీపంలా పార్టీని ముందుకు నడిపించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, టీడీపీతో పొత్తుపెట్టుకుని పోరాడారు. కానీ ఫలితం మాత్రం నిరాశపరిచింది. ప్రజల మద్దతు లభించలేదు. 2023లో ఆయన మళ్లీ కాంగ్రెస్ వైపు మొగ్గారు. రేవంత్‌రెడ్డి ఎదుగుదలకు మార్గదర్శిగా మద్దతు ఇచ్చారు.
ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారు. కానీ ఎన్నికల సమయంలో కోదండరామ్‌కు ఇచ్చిన హామీ ఆచరణకు నోచుకోలేదు. ప్రజాగళాన్ని ఎమ్మెల్సీగా మండలిలో వినిపించే అవకాశం కోదండరామ్‌కు ఇస్తామని చెప్పినప్పటికీ, ఆ హామీ ఇప్పుడు న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకుంది. కోదండరామ్ పరిస్థితి హామీల సముద్రంలో తేలుతున్న పడవలా మారిపోయింది.
రాజీ పడటమే కారణం..
అయితే నాటి మిలియన్ మార్చ్‌లో పాల్గొన్న ఒక వృద్ధ మహిళ కోదండ్‌రామ్‌ను ఉద్దేశించి ‘ఆయన మా నార్త్ స్టార్’ అని సికింద్రాబాద్ టీ స్టాల్‌లో కన్నీళ్లతో చెప్పారు. ‘ఇప్పుడు ఆయన మంత్రుల గదుల వద్ద తచ్చాడుతున్నారు.. మంత్రి పొన్నం ప్రభాకర్‌లను కలుస్తూ ఉద్యమంలో పాల్గొన్న కార్యకర్తలకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఒక సింహం సాదు జంతువుగా మారినట్టుంది’ అని ఆమె ఆవేదన వెలుబుచ్చారు. గతంలో ఆయన అడుగులతో మారుమోగిన అధికార గదులు ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్నాయి.
ప్రజల ఆశల తుఫాన్ లాగా వచ్చిన టీజేఎస్ ఇప్పుడు సాధారణ మెరుపులా మారిపోయింది. కేవలం రాజీ పడటం మూలానే ఆయన కీర్తి మసకబారుతోంది. ‘ఆయన కేసీఆర్‌కి లొంగి ఉండి ఉంటే రాజ్యసభ సీటు చాలా ఏళ్ల క్రితమే వచ్చేది’ అని కోదండరామ్‌తో జేఏసీలో పనిచేసిన సహచరుడు ఒకరు ఆవేదనతో చెప్పారు. ‘కానీ కోదండరామ్ సర్ ఎవరికీ లొంగడు, కానీ ప్రస్తుతం ఆయన పరిస్థితి చూడటం చాలా బాధాకరం’ అని అన్నారు.
కోదండరామ్ సర్ మళ్లీ రావాలి..
ఇన్నేళ్లలో కోదండరామ్ అనేక సవాళ్లను ఎదురున్నప్పటికీ ప్రజల్లో ఆయన పట్ల విశ్వాసం ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణాల్లో విద్యార్థుల గళాలు, మహబూబ్‌నగర్ పొలాల్లో రైతుల ఆశలు, పటాన్‌చెరు పరిశ్రమలలో కార్మికుల ఆర్తనాదాలు ఒకే ఆవేదనను వ్యక్తం చేస్తున్నా యి. కోదండరామ్ సర్ అస్తిత్వాన్ని తిరిగి కోరుకుంటున్నాయి. టీజేఎస్‌ను పార్టీగా రద్దుచేసి ప్రజా ఉద్యమంగా తిరిగి ప్రారంభించాలని కోరుకుంటున్నారు. రాజకీయ బంధనాల నుంచి విముక్తి పొందిన సామాజిక శక్తిగా మారాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ, అధికారంపై వ్యామోహం లేకుండా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. ప్రొఫెసర్ జయ శంకర్ వంటి తెలంగాణ సిద్ధాంతకర్తగా మళ్లీ ఆ బాధ్యతను స్వీకరించాలని కోరుకుంటున్నారు. ప్రజా నాయకుడైన నిజాయతీ గల కోదండరామ్ మళ్లీ తెలంగా ణలో ఉద్యమ అగ్నిని రగిలిస్తే ఆంధ్ర కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలు, సరిహద్దులు దాటి వచ్చి రాష్ట్ర సంపదను దోచుకునే వారిపై తుఫాన్‌లా మారుతుంది.
ఉద్యోగాలు లేక నిరాశలో ఉన్న యువత కోసం, అప్పుల బారినపడి విలవిల్లాడుతున్న రైతులు, ఉద్యోగుల కోసం కోదండరామ్ మళ్లీ పోరాట పతాకం ఎగురవేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సందర్భంగా ‘శక్తిని అధికారుల నుంచి కాదు, ప్రజల నుంచి పొందాలి’ అని ఒక యువ కార్యకర్త సోషల్ మీడియాలో రాసిన మాటలు వైరల్ అవుతున్నాయి. కోదండ్‌రామ్‌కు ఎలాంటి ఎమ్మెల్సీ సీటు అవసరం లేదు, ఎలాంటి మంత్రివర్గం గుర్తింపు అవసరం లేదు, కావలసింది ప్రజల స్వచ్ఛమైన నినాదం మాత్రమే అని తేటతెల్లమవుతున్నది.
తెలంగాణ ప్రజానీకంలో అది సజీవ ంగానే ఉంటుంది. ఉద్యమ నాయకత్వం నుంచి నిర్లక్ష్యానికి గురయ్యే పరిస్థి తికి చేరుకున్న కోదండ్‌రామ్ ప్రయాణం.. ఆకర్షణకు లోనుచేసే అధికారం పట్ల అప్రమత్తతగా ఉండాలన్న హెచ్చరికను మరో సారి ముందుకు తెచ్చింది. అయితే ప్రజల నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయాన్ని కోదండరామ్ వింటారా, మళ్లీ రాజకీయ క్షేత్రంలో నుంచి ప్రజల మధ్యకు వస్తారా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మిలియన్ మార్చ్ గర్జన గుర్తున్న వారిలో కోదండ్‌రామ్ తిరిగి వస్తారనే ఆశ సజీవంగానే ఉంది. కోదండరామ్ సర్ గాయపడి ఉన్నా మళ్లీ గర్జించడానికి తెలంగాణ స్ఫూర్తి ఇంకా రగులుతూనే ఉంది.