01-11-2025 12:54:22 AM
మైనార్టీల నేతగా మైమరపిస్తారా?
హైదరాబాద్, అక్టోబర్ 31 (విజయక్రాంతి): భారత క్రికెట్ అభిమానులందరికీ మొహమ్మద్ అజారుద్దీన్ సుపరిచితమే. మణికట్టు మాంత్రికుడిగా ఆయన బ్యాటింగ్ సరళి క్రీడాభిమానులను ఎంతో ఆకర్షించిం ది. మేనమామ ప్రోద్బలంతో క్రికెట్ కెరీర్‌ను ఎంచుకున్న అజార్ అంచలంచెలుగా ఎదిగారు. భారత క్రికెట్ టీం కెప్టెన్‌గా, మేటి బ్యాట్స్‌మెన్‌గా ఆయన సాధించిన ఘనతలు అనేకం ఉన్నాయి. కెరీర్ అత్యుత్తమస్థానంలో ఉన్నప్పుడు ఆయన ఎన్నో అనుకోని ఆటుపోట్లను ఎదుర్కొన్నారు.
ఆ తర్వాత రాజకీయ రంగప్రవేశం చేశారు. అక్కడ కూడా అదేస్థాయిలో సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. కానీ ప్రస్తుతం రాజకీయంగా ఆయనకు అద్భుత అవకాశం లభించింది. అజహరుద్దీన్‌కి ఇది చివరి అవకాశం. 80వ దశకంలో క్రికెట్ రంగంలో మెరిసిన ‘గోల్డెన్ బాయ్’ తన జీవిత ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాడు. 62 ఏళ్ల ఈ మాస్టర్ బ్లాస్టర్ ఇప్పుడు కొత్త బాధ్యతలు చేపడుతున్నారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా మారారు.
కానీ తన రాజకీయ జీవితం సరిచేసుకోగలరా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్‌లో శుక్రవారం అజారుద్దీన్‌కి మంత్రి పదవి లభించింది. ఆయన ప్రమాణస్వీకారంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ నిర్ణయాన్ని మార్చుకోలేదు. క్రికెట్ పిచ్ నుంచి రాజకీయాల దిశగా అజార్ ప్రయాణం కూడా ఆయన వ్యక్తిగ త జీవితంలాగే ఒడిదుడుకులను చూసింది. మొరాదాబాద్ నుంచి హైదరాబాద్ దాకా ఆయన పయనం విమర్శలతోనే నిండిపోయింది.
కొత్త ఇన్నింగ్స్ : అజార్ ఎదుట పెద్ద సవాళ్లు ఉన్నాయి. ఆయన ఒవైసీని ఎదుర్కొని తెలంగాణలో కాంగ్రెస్‌ను బలపరచగలరా, మైనార్టీల జీవనస్థాయిని మెరుగుపరచడంలో మార్పు తేగలరా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తెలంగాణలో సుమారు 10% ముస్లిం ఓటు బ్యాంక్ ఉన్నందున, అజార్‌కు ముస్లిం నాయకుడిగా ముందుండే మంచి అవకాశం. దీనికి తోడు ఆయనకు కాంగ్రెస్ హైకమాండ్ ఆశీర్వాదం కూడా ఉంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే 2020 నుంచి 2023 వరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా అజార్ పరిపాలన అనేక వివాదాలతో నిండింది. జట్టులో చోటు కోసం రూ.15 నుంచి 40 లక్షల మధ్య లంచాలు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ అవినీతి కారణంగానే రంజీ జట్టు దారుణమైన ప్రదర్శన ఇచ్చిందని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతోపాటు 2009లో మొరాదాబాద్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో అజార్ గెలిచారు. కానీ ఆ తర్వాత ఆయన రాజకీయ ఇన్నింగ్స్ నిలబడలేదు. 2014లో రాజస్థాన్‌లోని టోంక్ మాధోపూర్ నుంచి పోటీ చేసి లక్షకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు.
మరో ‘మిస్‌హిట్’ అవుతుందా..
గతంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్న అజారుద్దీన్‌కు ప్రస్తుతం రాజకీయంగా సువర్ణావకాశం లభించింది. ఇప్పుడు ఆయన తెలంగాణ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిని వ్యక్తిగత లాభాల కోసం వాడుకుంటారా, లేక నిజంగా మైనార్టీల కోసం, పారదర్శకత కోసం, రాష్ర్ట క్రీడా రంగ ప్రతిష్ఠ పెంచడం కోసం పనిచేస్తారా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎట్టకేలకు రాజకీయంగా ఒక మైలురాయిని అందుకున్నర అజారుద్దీన్‌కు మ్యాచ్ ఫిక్సింగ్ మచ్చ ఆయన జీవితాన్ని ఎప్పుడూ వెంటాడుతుంది.
భారత తరఫున 100 టెస్టులు ఆడలేకపోవడం ఆయన జీవితంలోని అతిపెద్ద బాధగానే మిగిలింది. ఇప్పుడు ఈ ‘గోల్డెన్ బాయ్’కి మరోసారి ప్యాడ్లు కట్టుకునే రాజకీయ క్రీడలో పాల్గొనే అవకాశం వచ్చి ంది. కానీ ఇది నిజంగా అజార్ చివరి అవకాశమే. అజారుద్దీన్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా తన కెరీర్‌ను ముగించిన తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఉత్తర భారతదేశం రాజకీయ అరంగేట్రం చేసిన అజార్, 2023లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మాగంటి గోపినాథ్‌పై పోటీ చేసి ఓటమి చెందారు.
సీఎం రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికార బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ముస్లిం మైనార్టీ వర్గానికి అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ నాయకత్వం భావించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన ఒక్కరూ కూడా విజయం సాధించికపోవడంతో ఆ సామాజికవర్గానికి పదవి ఇచ్చే అవకాశం లేకుండాపోయింది. గతంలో జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్‌కు తిరిగి ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశం వచ్చింది.
గతంలో 16 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన అజారుద్దీన్‌ను తిరిగి పోటీకి దింపడం కంటే, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు గవర్నర్ కోటాలో అజారుద్దీన్‌తో పాటు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాలని నిర్ణయించి.. గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపారు.
ఒకవేళ గవర్నర్ కోటాలో అజారుద్దీన్ ఎంపిక విషయంలో ఏదైనా సాంకేతికపరమైన ఇబ్బంది తతెత్తితే వచ్చే ఏడాదిలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీల్లో ఇతర కోటా కింద ఎంపిక చేసే అవకాశం ఉంటుందని పార్టీ నిర్ణయం తీసుకున్నది. మైనార్టీ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది.