కాంగ్రెస్ సర్కార్‌కు బీజేపీ చెక్

19-04-2024 02:26:34 AM

రేవంత్ సర్కారును బీజేపీ కూల్చుతుంది l 104 మంది ఎమ్మెల్యేలున్న బీఆర్‌ఎస్‌నే వదలలేదు l 64 మంది ఉన్న కాంగ్రెస్‌ను వదిలిపెట్టదు ప్రభుత్వంపై ప్రజల్లో  పెరుగుతున్న వ్యతిరేకత l గట్టిగా పోరాడితే మెజార్టీ స్థానాలు మనవే l ఎమ్మెల్సీ కవితపై కక్షపూరితంగా కేసు బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు l ఎంపీ అభ్యర్థులకు బీఫామ్‌లు, చెక్కులు అందజేత 

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నదని, గట్టిగా పోరాడితే బీఆర్‌ఎస్ మెజార్టీ ఎంపీ సీట్లు సాధిస్తుందని ఆ పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు అన్నారు. కాంగ్రెస్‌లోకి వలస వెళ్లిన బీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు బాధపడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్‌లో అంతా బీజేపీ పెత్తనమే నడుస్తోందని చెప్పారు. గతంలో 104 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేసిందని, 64 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న కాంగ్రెస్ సర్కార్‌ను కమలనాథులు ఎందుకు వదిలిపెడుతారని ప్రశ్నించారు. గురువారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర నాయకులతో కేసీఆర్ విస్తృత సమావేశం నిర్వహించారు.

లోక్‌సభ ఎంపీ అభ్యర్థులకు బీఫామ్‌లు అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం ఒక్కో అభ్యర్థికి రూ.95 లక్షలు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదితకు రూ.45 లక్షల చెక్కులను అందించారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారంలో అనుసరించాల్సిన వ్యుహాలపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ భవిష్యత్తు అంతా బీఆర్‌ఎస్‌దేనని తెలిపారు. రైతుల సమస్యలపై పోరాడుతానని, ఉద్యమకాలం నాటి కేసీఆర్‌ను మళ్లీ చూస్తారని పేర్కొన్నారు. రైతుల సమస్యలే అజెండాగా ప్రజల్లోకి వెళ్లాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్‌లోకి కొందరు వెళ్లినంత మాత్రాన బీఆర్‌ఎస్‌కు ఎలాంటి నష్టంలేదని తెలిపారు.

పార్లమెంటులో గళం వినిపించాల్సిన అవసరం బీఆర్‌ఎస్‌కు ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో టీమ్‌వర్క్ లేదని, స్థిరత్వం ఎక్కడా కనిపించడంలేదని విమర్శించారు. ఎమ్మెల్సీ కవితపై ఎలాంటి కేసు లేకున్నా కక్షపూరితంగా అరెస్టు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్‌కు నోటీసులు పంపినందుకు బీఆర్‌ఎస్‌పై కక్ష పెంచుకుని ఆరోపించారు. మనీలాండరింగ్ కేసులో ఇరికించి పార్టీని దొంగదెబ్బ తీయాలని బీజేపీ కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. ఇసుక కుంగడంతో మేడిగడ్డ ఆనకట్ట వద్ద సమస్య వచ్చిందని తెలిపారు. రేవంత్‌రెడ్డి సర్కార్ మాటలు అధికారులు వినడంలేదని, కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మడం లేదని మజ్లిస్ నేత ఓవైసీ పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. 

పోస్టుకార్డు ఉద్యమం

రూ.500 బోనస్‌తో సహా ప్రభుత్వం ఎగ్గొట్టిన హామీలను వెంటనే అమలు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. నియోజకవర్గాలవారీగా పోస్ట్ కార్డు ఉద్యమం ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యమ కాలం నుంచి నేటివరకు తెలంగాణ ప్రజల హక్కులను కాపాడేది బీఆర్‌ఎస్ మాత్రమేనని, నాటి ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా కాంగ్రెస్ అసమర్థ పాలనను ఎండగట్టాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికల తరవాత బీజేపీ, కాంగ్రెస్‌ల కొట్లాటతో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొంటుందని కేసీఆర్ అన్నారు.

ఆ పరిస్థితిని తట్టుకుని రాజకీయ అస్థిరతకు లోనుకాకుండా ఉండాలంటే బీఆర్‌ఎస్ బలంగా ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్ కార్యకర్తలను అక్రమ అరెస్టు చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నదని, దీనిని పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కేసులపై పోరాడేందుకు లీగల్ సెల్‌ను ఇప్పటికే పటిష్ఠం చేశామని, కేసులు ఎదుర్కొనేందుకు ఎంత ఖర్చయినా వెనకడుగు వేయకుండా కార్యకర్తలను కాపాడుకుంటామని స్పష్టంచేశారు. ఇందు కోసం రూ.10 కోట్లు బీఆర్‌ఎస్ లీగల్ సెల్ అకౌంట్‌కు కేటాయించినట్లు ప్రకటించారు.

ఉదయం పొలంబాట, సాయంత్రం రోడ్ షోలు

లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ కొత్త పంథా ఎంచుకున్నారు. త్వరలో బస్సు యాత్ర చేపడుతామని తెలిపారు. బీఆర్‌ఎస్ సభలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదని చెప్పారు. చేవెళ్ల, మెదక్ నియోజకవర్గాల్లో సభలకు భారీగా జనం తరలివచ్చారని పేర్కొన్నారు. అంతకు ముందు సూర్యాపేట, జనగాం జిల్లాలో రైతుల సమస్యలపై పర్యటిస్తే పెద్ద సంఖ్యలో అన్నదాతలు వచ్చినట్లు తెలిపారు. ఈ నెల 22 నుంచి రోడ్ షోలు ఉంటాయని చెప్పారు. ఒక లోక్‌సభ పరిధిలోని రెండుమూడు అసెంబ్లీ స్థానాల్లో రోజుకు రెండుమూడు రోడ్ షోలు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

ఉదయం 11 గంటలవరకు రైతుల వద్దకు వెళ్లాలని, సాయంత్రం సమయంలో రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లు నిర్వహించాలని నిర్ణయించారు. వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్ కేంద్రాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎంపీ అభ్యర్థుల విజయం కోసం ముందుస్తు ప్రణాళికలు చేసుకోవాలని, జిల్లా నాయకులు కూడా ఇతర పార్టీల మోసాలకు గురికాకుండా సొంతపార్టీ గెలుపుకోసం కృషి చేయాలని సూచించారు.