మోదీ కెప్టెన్సీలో ఐపీఎల్ కప్ బీజేపీదే

19-04-2024 02:29:19 AM

l 400 సీట్లలో ఘనవిజయం సాధించబోతున్నాం

l కెప్టెన్ కూడా లేని కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడిస్తం

l విజయక్రాంతి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో బండి సంజయ్ 

l రాష్ట్రంలో కాంగ్రెస్ టీంకు ప్లేయర్లే లేరు

l బీఆర్‌ఎస్ టీం ప్లేయర్ల డకౌట్ ఖాయం

l కరీంనగర్ అభివృద్ధికి 12 వేల కోట్లు తెచ్చిన

l కాదని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంట

కరీంనగర్, ఏప్రిల్ 1౮ (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లతో ఘనవిజయం సాధిస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ప్రధాని అభ్యర్థి ఎవరో కూడా తెలియని విపక్ష కూటమికి ఈసారి కూడా ఘోర ఓటమి తప్పదని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలులో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ కనిపించకుండా పోతుందని పేర్కొన్నారు. గురవారం ఆయన ‘విజయక్రాంతి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంతోపాటు రాష్ట్రంలో ఎక్కడైనా కాంగ్రెస్ 6 గ్యారెంటీల ద్వారా ఒక్కరంటే ఒక్కరు లబ్ధి పొందినట్లు నిరూపించినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు..

తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుందని మీ అంచనా?

ఐపీఎల్ క్రికెట్ మాదిరిగానే దేశంలో ఇండియన్ పొలిటికల్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ రసవత్తరంగా ప్రారంభమైంది. ఈ ఎన్నికల పోటీల్లో నరేంద్రమోదీ కెప్టెన్సీలో బీజేపీ టీం 400 సీట్లతో ఐపీఎల్ కప్ గెలవబోతున్నది. తెలంగాణ పొలిటికల్ లీగ్ (టీపీఎల్) లో కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో 17 సీట్లు సాధించి కప్‌ను కైవసం చేసుకోబోతున్నాం. బీఆర్‌ఎస్ టీం నుంచి బరిలో నిలిచిన ప్లేయర్లు పోటీ నుండే తప్పుకుని పక్క టీముల్లోకి జారుకుంటున్నారు. కాంగ్రెస్ పరిస్థితి చూస్తే జాలేస్తున్నది. కెప్టెన్ (ప్రధాని అభ్యర్ధి) లేకుండానే ఆ పార్టీ బరిలో దిగింది. రాష్ట్రంలోనైతే ఆ టీంకు అసలు ప్లేయర్లే దొరకడం లేదు. కరీంనగరే ఇందుకు నిదర్శనం.  .

ఐదేళ్లలో ఎంపీగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు సాధించిన విజయాలు ఏమున్నాయంటే ఏం చెప్తారు?

తెలంగాణ ప్రజలను అరిగోస పెడుతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గల్లిలోకి గుంజుకొచ్చి గడీల పాలనను బద్దలు కొట్టిన. ఏ ప్రభుత్వమైతే ధర్నాలు, నిరసనలను నిషేధించిందో అదే ప్రభుత్వాన్ని ధర్నా చౌక్ కే గుంజుకొచ్చిన. కేసీఆర్ పాలనలో విసిగిపోయిన ప్రజలందరికీ అండగా ఉంటూ పోరాటాలు చేసిన. ఆర్టీసీ ఆస్తులు అమ్మకుండా అడ్డుకున్న.  కరీంనగర్ వరంగల్, కరీంనగర్  జగిత్యాల మధ్య కేంద్రం సహకారంతో రూ.4 వేల కోట్లపైచిలుకు నిధులతో ఫోర్ లేన్ రహదారి విస్తరణ పనులు ప్రారంభించేలా చేసిన. ఎంపీగా నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.12 వేల కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చిన. కరీంనగర్  వరంగల్ ఫోర్ లేన్ విస్తరణ పనులకు 2,146.86 కోట్లు, కరీంనగర్ - జగిత్యాల 4 లేన్ విస్తరణ పనులకు రూ. 2,151.35 కోట్లు, ఎల్కతుర్తి - సిద్దిపేట రోడ్డు విస్తరణ పనుల కోసం రూ. 578.85 కోట్లు, తీగలగుట్ట ఆర్వోబీకి సేతుబంధన్ పథకం కింద కేంద్రమే పూర్తిగా నిధులను (రూ.154.85 కోట్లు) విడుదల చేసేలా ఒప్పించిన.

సీఆర్‌ఐఎఫ్ ద్వారా రూ.328.5 కోట్లు, కరీంనగర్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం 51.80 కోట్లు తెచ్చిన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ ఎక్స్‌టెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయించిన. ప్రధానమంత్రి అవాస్ యోజన ద్వారా 8,041 ఇండ్లకు 145 కోట్ల నిధులు మంజూరు చేయించిన. అమృత్ 1.0 ద్వారా రూ.281 కోట్ల తో 12 ప్రాజెక్టులు, అమృత్ 2.0 ద్వారా రూ.583.27 కోట్లతో 11 ప్రాజెక్టులు గుర్తించడం జరిగింది. పీఎం స్వనిధి ద్వారా 46,974 మంది స్ట్రీట్ వెండార్స్‌కు 76.48 కోట్ల రుణ సహాయం చేశాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు 756.73 కోట్ల సహాయం అందించాం. ఉజ్వల యోజన ద్వారా 50,647 కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్‌లు ఇచ్చాం. ఇవి కొన్ని మాత్రమే. 

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నేతలు బండి సంజయ్ ఎంపీగా నయాపైసా తేలేదని పదేపదే ప్రచారం చేస్తున్నాయి. అందుకు మీ సమాధానం?

నేను గతంలోను చెప్పాను.. ఇప్పుడూ చెప్తున్నాను. నేను నా కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం ఏం చేశానో చర్చకు సిద్ధం. గ్రామాల వారీగా కేంద్రం ఎన్ని నిధులు ఖర్చు చేసిందో లెక్క పత్రం ఉంది. అవే ప్రజాహిత యాత్రలో గ్రామగ్రామాన ప్రజలకు వివరించిన. అయినా కండ్లుండి చూడలేని కబోదులు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు. ఇక్కడ పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్ అభ్యర్ధి నాన్ లోకల్..  బహుశా అందుకే బండి సంజయ్ చేసిన అభివృద్ధి ఏమిటో  తెల్వదనుకుంటా. 

బండి సంజయ్ రాముడి పేరు మీద ఫ్లెక్సీలు కట్టి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి?

అయోధ్యలో రామ మందిర నిర్మాణం దేశంలోని హిందువులందరి 5 శతాబ్దాల కల.. ఆ కలను నెరవేర్చిన మహానాయకుడు మోదీ. మా దేవుడు శ్రీరాముడు. మాకు ఆదర్శం మోదీ. మేం దేశం కోసం, హిందూ ధర్మం కోసం పనిచేస్తామే తప్ప..కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మాదిరిగా రాహుల్‌గాంధీ కోసమో, కేసీఆర్ కుటుంబం కోసమో రాజకీయం చేయడం లేదు. అయోధ్యలో రామమందిర నిర్మాణం హిందువులకు ఒక పండుగ. ఫ్లెక్సీలు కట్టుకుని సంబురం చేసుకుంటే తప్పేముంది?  

బండి సంజయ్ పార్లమెంట్‌కు వెళ్లలేదు.. మాట్లాడలేదని అంటున్నారు?

అబద్ధాలకు కూడా హద్దు పద్దు ఉండాలి. నేను పార్లమెంట్ సభ్యుడుగా అనేక చర్చల్లో పాల్గొన్న. నేను ఎంపీగా గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు దేశం మొత్తం కరోనా ప్రభావాన్ని చూసింది. కరోనా టైంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులెవరూ గడప దాటి బయటకు రాలేదు. పారాసెటమాల్ వేసుకుంటే తగ్గిపోద్దని ఉచిత సలహాలిస్తూ.. వాళ్లు మాత్రం పెద్దపెద్ద దవాఖానల్లో ట్రీట్ మెంట్ చేయించుకున్నరు. కానీ నేను ప్రాణాలకు తెగించి కరోనా పేషెంట్ల వద్దకు వెళ్లి వారికి మానసిక ధైర్యం కల్పించిన.   

బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ విమర్శిస్తోంది. దీనికి మీ సమాధానం?

నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఆ రెండు పార్టీలు నటిస్తున్నయ్. నిజానికి చీకటి ఒప్పందాలు, అవినీతిపై విచారణల్లేకుండా రాయబారాలు నడుపుతూ డ్రామాలాడుతోంది బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలే. పార్లమెంట్ లో కలిసి పనిచేస్తోంది ఆ రెండు పార్టీలే.  

బండి సంజయ్‌కి హిందువులను రెచ్చకొట్టి లబ్ధి పొందడమే పని అని మీ ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు కదా?

హిందువులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేది ఎంఐఎం పార్టీ. 15 నిమిషాలు టైమిస్తే హిందువులను నరికి చంపుతానని ఒవైసీ చెబితే చర్యలు తీసుకోకుండా ఆ పార్టీతో పదేళ్లపాటు సంసారం చేసింది బీఆర్‌ఎస్. అధికార మనుగడ కోసం ఒవైసీతో అంటకాగుతోంది కాంగ్రెస్ పార్టీ.  హిందువుల ఆత్మగౌరవం కోసం కొట్లాడుతా.  

మీరు గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారని మీ పార్టీ నేతలే చెబుతున్నారు.  

నేను బీజేపీ సైనికుడి. కరీంనగర్ ప్రజల సేవకుడిని. మోదీ బాటలో నడిచే కార్యకర్తను. పార్టీ అప్పగించిన పనిని వంద శాతం నిర్వహించడమే నా భాధ్యత. నాకు ఎలాంటి భాధ్యత, గుర్తింపు ఇవ్వాలో మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా నాయకత్వంలోని మా జాతీయ నాయకత్వం నిర్ణయిస్తది.  

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో ఎంపీ ఎన్నికల్లో ప్రజలు తమకే ఓట్లేస్తారని ఆ పార్టీ ధీమాతో ఉన్నది కదా? దీనిపై మీరేమంటారు?

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కొద్దిరోజులే అయ్యింది కదా అని ఇన్నాళ్లు ఊరుకున్నం. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పింది. కాంగ్రెస్ వారెంటీ ముగిసిపోయింది. గ్యారెంటీలపై చేతులెత్తేసింది. మళ్లోసారి జనాన్ని మోసం చేసేందుకు సిద్ధమైంది. దొంగ హామీలు ఇవ్వడం, మోసం చెయ్యడం కాంగ్రెస్ డీఎన్‌ఏ లోనే ఉంది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 ఇచ్చారా? వృద్ధులు, వితంతవులకు నెలకు రూ.4 వేల పెన్షన్ ఇచ్చారా? రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేల చొప్పున ఇచ్చారా? విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు ఇచ్చారా? ఇల్లులేని పేదలందరికీ జాగా తోపాటు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేశారా? రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశారా? ఈ ఆరు గ్యారెంటీల్లో ఒక్కటంటే ఒక్కటైనా అమలు చేశారా? కాంగ్రెస్ నేతలకు సవాల్ చేస్తున్నా.. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆరు గ్యారెంటీల్లో ఒక్కరంటే ఒక్కరు లబ్ధి పొందినట్లు నిరూపించినా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా?  

బీఆర్‌ఎస్ నాయకులు స్మార్ట్ సిటీ, హై వేలకు మా చొరవతోనే నిధులు వచ్చాయంటున్నారు?

దాచుకోవడం, దోచుకోవడం.. ప్రశ్నించే వాళ్లపై కేసులు పెట్టి వేధించడం తప్ప బీఆర్‌ఎస్ నేతలు చేసిందేముంది? స్వలాభం కోసం కరీంనగర్ అభివృద్ధిని కుంటుపరిచిన నేతలు బీఆర్‌ఎస్ వాళ్లు. చిత్తశుద్ధితో కరీంనగర్‌ను అభివృద్ధి చేసింది నేను. కేసీఆర్ అవినీతిని, నిధుల దారి మళ్లింపు అంశాన్ని నేను కేంద్రం దృష్టికి తీసుకుపోయిన. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో అధికారులను నిలదీసిన. కేంద్రమిచ్చిన నిధులను వారం రోజుల్లో జమ చేయకపోతే వడ్డీతోసహా వసూలు చేస్తామని కేంద్రం హెచ్చరించేదాకా పట్టించుకోని నాయకులు.. ఇవాళ తగుదునమ్మా అని సిగ్గు లేకుండా మా ఘనతే అని చెప్పుకుంటున్నరు. నాడు రోడ్లు బాగు చేయాలని జనం మొత్తుకున్నా పట్టించుకోలే. ఇవన్నీ నేను ఎంపీ అయ్యాకే భారీ ఎత్తున నిధులు తీసుకొచ్చిన. తెలంగాణలో కేంద్ర రహదారుల మౌలిక సదుపాయల నిధి కింద అత్యధిక నిధులు తీసుకొచ్చింది నేను.