ఇండ్లు కూడా గుంజుకుంటరు!

23-04-2024 02:41:46 AM

l కాంగ్రెస్‌కు ఓటేస్తే ఆస్తులు, పుస్తెలు దక్కవు

l వాళ్ల మ్యానిఫెస్టోలోనే ఆ విషయం స్పష్టం

l కాంగ్రెస్ యువరాజే స్వయంగా చెప్పారు

l అలీగఢ్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని విమర్శలు

అలీగఢ్, ఏప్రిల్ 22: ప్రధాని సోమవారం కూడా కాంగ్రెస్‌పై పుస్తెలతాడు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఆ పార్టీకి ఓట్లేసి అధి కారం అప్పగిస్తే హిందూ మహిళలకు అత్యంత పవిత్రమైన మంగళ సూత్రాలను కూడా లాక్కుంటారని అన్నారు. ప్రజల వ్యక్తిగత ఆస్తులను, ఇండ్లను కూడా స్వాధీనం చేసుకొంటారని ప్రజలను హెచ్చరించారు. దేశంలోని ప్రతి ఒక్క పౌరుడికి ఎంత ఆస్తులున్నాయో లెక్కించి సంపదను సమానంగా పంచుతామని కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలోనే ప్రకటించిందని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో సోమవారం ఆయన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మీ ఆదాయం, సంపదపై కన్నేశాయి.

కాంగ్రెస్ ప్రభు త్వం వస్తే మీ ఆస్తుల లెక్కలు తీస్తానని ఆ పార్టీ యువరాజు అంటు న్నారు. మీ ఆస్తులపై దర్యాప్తు జరిపి అన్నీ ప్రభుత్వం తీసేసుకుంటుంది. ఇండ్లు, ఆభరణాలు కూడా లాగేసుకొంటుంది. ఇతరులకు పం చుతుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలోనే ప్రకటించింది. మహిళలు బంగారాన్ని నగలుగానే భావించరు. అది స్త్రీతనంగా భావిస్తారు. దాన్ని చట్టాలు కాపాడుతాయి. వాళ్లు (కాంగ్రెస్) అధికారంలోకి వస్తే చట్టాలు మార్చేసి మీ ఆస్తులను కాజేస్తారు. మన తల్లులు, చెల్లెళ్ల మెడల్లో ఉన్న మంగళసూత్రాలను కూడా వదలరు’ అని హెచ్చరించారు. ఆది వారం రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారంలో కూడా మోదీ ఇవే వ్యాఖ్య లు చేసిన విషయం తెలిసిందే. 

యువరాజులకు ఇంకా కీ దొరకలేదు

కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ యువరాజులకు (రాహుల్‌గాంధీ, అఖిలేశ్‌యాదవ్) ఉత్తరప్రదేశ్‌లో పనిలేకుండా పోయిందని ప్రధాని మోదీ వివర్శించారు. ‘క్రితంసారి నేను ఇక్కడికి (అలీగఢ్) వచ్చినప్పుడు అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు కంపెనీలకు తాళాలు వేయాలని మిమ్మల్ని కోరాను. మీరు వాటికి బలమైన తాళాలు వేశారు. వాటి తాళం చెవులు యువరాజులకు ఇంకా దొరకనేలేదు’ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశంలో ఉగ్రవాదులు వరుస బాంబుదాడులకు పాల్పడేవారని, తన ప్రభుత్వం వచ్చాక ఉగ్రవాదులను అణచివేశానని తెలిపారు.