calender_icon.png 19 May, 2025 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మణిపూర్ మారణహోమానికి ఏడాది

04-05-2024 12:20:21 AM

మైతీ, కుకీల మధ్య హింస చెలరేగి 226 మంది బలి

క్షతగాత్రులు 1,500 మంది, నిరాశ్రయులు 60 వేల మంది 

ఇప్పటికీ చెదురు మదురు దాడులు.. శాంతిస్థాపన కోరుతున్న పౌరులు

న్యూఢిల్లీ, మే 3: మణిపూర్‌లో మైతీ, కుకీ తెగల మధ్య వైరం హింసకు దారి తీసి సరిగ్గా ఏడాది పూర్తయింది. 3 మే 2023న ప్రారంభమైన అల్లర్లు సుమారు వారం పాటు కొనసాగాయి. రెండు జాతుల మధ్య పరస్పర దాడులు ఘర్షణ వాతావరణానికి దారితీశాయి. దీంతో ఆ రాష్ట్రం అగ్నిగుండంగా మారింది. అల్లర్లలో మొత్తం 226 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 20 మంది మహిళలు కాగా ఎనిమిది మంది చిన్నారులు, ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు ఉన్నారు. దాడుల్లో 1,500 మంది గాయపడ్డారు. 13,247 కట్టడాలు, ఇండ్లు నేలమట్టమయ్యాయి. ఏకంగా 60,000 మంది నిరాశ్రయులయ్యారు. కొందరు అపహరణకు గురయ్యారు. మరికొందరి ఆచూకీ లేకపోవడంతో పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. చురాచాంద్‌పూర్, బిష్ణుపూర్ జిల్లాలో అల్లర్ల తీవ్రత ఎక్కువగా కనిపించింది. రెండు జాతుల మధ్య భీకర పోరు అక్కడి ప్రభుత్వానికి తీవ్రమైన శాంతిభద్రతల సమస్యగా పరిణమించింది. ఇప్పటికీ రాష్ట్రంలో ఏదోఒక చోట జాతుల మధ్య చెదురు మదురు దాడులు చోటుచేసుకుంటున్నాయి. కానీ సాధారణ ప్రజలు మాత్రం రాష్ట్రంలో శాంతి స్థాపన జరగాలని కోరుకుంటున్నారు.

ఘర్షణ ఎందుకు మొదలైందంటే..

మణిపూర్‌లో ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితులు ఉంటాయి. రాష్ట్రమంతా కొండలు, లోయలతో కూడిన ప్రాంతమే. రాజధాని ఇంఫాల్ మైదాన ప్రాంతం అత్యంత జనసాంద్రత గల ప్రాంతం. రాష్ట్ర జనాభాలో కేవలం ఇక్కడే 90శాతం మంది ప్రజలు నివసిస్తారు. ఇక్కడ మైతీ తెగకు చెందిన వారిదే పైచేయి. రాష్ట్రంలో వీరి జనాభా 53 శాతం. ఇక కొండ, లోయ ప్రాంతాల్లో కుకి, నాగా తెగల ప్రజలు నివసిస్తారు. చట్ట ప్రకారం వీరు మైదాన ప్రాంతంలోని భూములను కొనే అవకాశం ఉంది. కానీ మైదాన ప్రాంతంలో నివసిస్తున్న మైతీ తెగవారు మాత్రం ఏజెన్సీలో భూమి కొనేందుకు వీలు లేదు. దీంతో మైతీ తెగ ఆందోళనకారులు కొన్నేళ్ల నుంచి తమను ఎస్టీల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.

రాష్ట్రంలో నివసిస్తున్న కుకీల్లో ఎక్కువ మంది పొరుగు దేశమైన మయన్మార్ నుంచి వలస వచ్చిన వారేనని ఆరోపిస్తున్నారు. ఈ డిమాండ్‌ను కుకీ, నాగా తెగల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. తమకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించా లని మైతీ ఉద్యమకారులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పదించింది. మైతీలకు రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై కేంద్ర షెడ్యుల్ ట్రైబల్ మినిస్ట్రీకి ప్రతిపాదనలు పంపాలని ఆదేశాలు జారీ చేయడంతో కుకీ, నాగ తెగలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ వార్త దావానలంలా పాకి రాష్ట్రమంతా అగ్నిగుండమైంది. మైతీ, కుకీల మధ్య మారణ హోమం జరిగింది. శాంతియుతమైన చర్చలతోనే మైతీ, కుకీల సమస్యను పరిష్కరిం చవచ్చని, ఘర్షణ, అల్లర్లతో ఎలాంటి ఉపయోగం ఉండదని ప్రజాస్వామికవాదులు, ప్రజాసంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు.