దేవుళ్ల పేరుతో రాజకీయం మానుకోవాలి

23-04-2024 02:47:05 AM

n బీజేపీపై మంత్రి సీతక్క ఫైర్ 

ఆదిలాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలని మంత్రి సీతక్క అన్నారు. బీజేపీ నాయకులు దేవుళ్ల పేరుతో రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం చేపట్టిన జన జాతర సభలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల మంగళ సూత్రాలు తీసుకొని ముస్లింలకు ఇస్తారంటున్న బీజేపీ నాయకులకు అలా మాట్లాడడానికి బుద్ధి ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్య రామ మందిరం పేరుతో గ్రామగ్రామాన వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు.

పేద ప్రజల జన్‌ధన్ బ్యాంకు ఖాతాల్లోకి రూ.15 లక్షలు వేస్తానన్న ప్రధాని మోదీ ఇప్పటివరకు ఎంతమందికి డబ్బులు వేశారని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీల్లో మిగిలిన వాటిని త్వరలోనే అమలు చేస్తామని స్పష్టం చేశారు. 3 నెలల్లో 34 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో ఆదివాసీ ఆడబిడ్డ అయిన ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌తో ఒరిగిందేమీ లేదు

అంతకుముందు మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. 10 ఏళ్ల బీజేపీ, బీఆర్‌ఎస్ పాలనలో దేశ, రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. దేవుడిని కొలిచే వారంతా బీజేపీ నాయకులు కాదని, తాము సైతం దేవుళ్లను కొలుస్తామని పేర్కొన్నారు. మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయం చేస్తున్న బీజేపీకి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పేర్కొన్నారు.