అడుగడుగున గుడి ఉంది.. అన్నిటిపై ఒట్టుంది!

23-04-2024 02:34:39 AM

l దేవుళ్లపై ఒట్టేస్తున్న సీఎం రేవంత్

l దూరమవుతున్న రైతులను ఆకట్టుకునేందుకే

l ఒక్కో ప్రాంతానికి ఒక్కో దేవుడిపై ఒట్టు

* ప్రపంచం తల్లకిందులైనా వచ్చే ఆగస్టు నాటికి రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం. యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి సాక్షిగా నేను హామీ ఇస్తున్నా..

 యాదాద్రి భువనగిరి రోడ్‌షోలో సీఎం రేవంత్


* అలంపూర్ జోగులాంబపై ఒట్టేసి చెబుతున్నా.. ఆగస్టు 15 నాటికి రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం..

 19న మహబూబ్‌నగర్‌లో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి

* బాసర సరస్వతి మందిరంపై ఒట్టేసి చెబుతున్నా.. పంద్రాగస్టు లోపల రైతాంగానికి రూ. 2 లక్షల రుణ మాఫీ చేస్తుంది మా ప్రభుత్వం.. నాదీ, మా మంత్రి వర్గానిదీ ఈ బాధ్యత..

 22న నిజామాబాద్ సభలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో వింతలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీపై వివిధ వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడితో.. ఆయా వర్గాలను సంతృప్తి పర్చి.. తమకు అనుకూలంగా మలుచుకునేందుకు నేతలు కొత్త పుంతలు తొక్కుతున్నారు. గడిచిన నాలుగైదు రోజులుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ప్రసంగంలో పంచ్‌లు విసురుతూనే, రాష్ట్రంలోని రైతాంగాన్ని ఆకట్టుకునేలా.. వారికి హామీ ఇచ్చేలా పెట్టుకుంటున్న ‘ఒట్టు’పై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.

కొత్తగా ఒట్టు ప్రచారం..

గడిచిన నాలుగైదు రోజులుగా సీఎం చేస్తున్న ఓట్ల ప్రచారంపై విపక్షాలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నప్పటికీ.. అకస్మా త్తుగా ఈ ఒట్టు ఎందుకు వచ్చిందనేది ప్రజల్లోనూ చర్చించుకుంటున్నారు. జోగులాంబ నుంచి మొదలుకుని.. సోమవారం బాసర సరస్వతి దేవాలయం వరకు సీఎం రేవంత్‌రెడ్డి ఎవరినీ వదలకుండా.. తమ ప్రభుత్వం చేయాల్సిన రుణ మాఫీ నేపథ్యంలో ఒట్టు పెట్టుకుంటూ వస్తున్నారు. దీనితో ఈసారి ఎన్నికల ప్రచారంలో కొత్త అస్త్రం తెరపైకి వచ్చినట్టయ్యింది. గతంలో జరిగిన ఎన్నికల్లో వివిధ పార్టీల నేతలు ఒకటీ అరా ఒట్టు పెట్టుకున్నప్పటికీ.. ఇంతలా ప్రచారాన్ని ఒట్టు చుట్టూ తిప్పిన నేతలు ఎవరూ లేరు. ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి విస్తృతంగా ఒట్టును వినియోగించుకుంటున్నారు. దీనితో ఈ అంశం ఎందుకు వచ్చిందనే సందేహాలు, చర్చలుకూడా కొనసాగుతున్నాయి.

రైతాంగం దూరమవుతోందా?

నిజానికి రైతుల రుణమాఫీ అనేది ఏ పార్టీకైనా ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా ఉపయోగపడేదే. ప్రస్తుతం ప్రతిపక్షాలైన బీఆర్‌ఎస్, బీజేపీలు రైతుల రుణమాఫీ ఎందుకు చేయడం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎప్పుడు చెప్పారు.. ఎప్పుడు తీర్చుతారంటూ సూటిగా  కాంగ్రెస్ పార్టీపై దాడికి దిగుతున్నాయి. పైగా రాష్ట్ర రైతాంగంలో ఉన్న ఒకింత అసంతృప్తి ఉన్నట్టుగా గ్రహించిన పార్టీలు దీనినే తమ ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర రైతాంగానికి గట్టిగా హామీ ఇవ్వకపోతే వారి అసంతృప్తి కాస్తా తమకు నష్టం కల్గిస్తాయనే ఆలోచన కాంగ్రెస్ నేతల్లో మొదలైనట్టు తెలుస్తుంది. అందుకే తాముకూడా రైతాంగానికి సంబంధించిన రుణ మాఫీనే  ప్రచారంలో ఒక ముఖ్యమైన అంశంగా ముందుకు సాగితే.. రైతాంగం అండగా ఉంటుందని, ప్రచారాన్ని తన భుజస్కంధాలపై తీసుకెళుతున్న సీఎం రేవంత్‌రెడ్డి... ఈ ‘ఒట్టు’కు తెరతీసినట్టుగా చర్చించుకుంటున్నారు.

రెండు ప్రయోజనాలు..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో దేవుడి ప్రభావం ఎక్కువగా కనపడుతోంది. అయోధ్య రాముడి పేరును పలకకుండా బీజేపీ నుంచి మొదలుకుని.. ఏ పార్టీకూడా ప్రచారం నిర్వహించడం లేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే.. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం యావత్తూ.. దేవుళ్ల చుట్టూ ఎక్కువగా తిరుగుతుందనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో అటు దేవుడి ప్రభావాన్ని ఉపయోగించుకోవడంతోపాటు.. ఇటు రైతాంగాన్ని ఆకట్టుకునేలా.. రుణమాఫీ తప్పకుండా చేస్తామని హామీ ఇస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అంటే ఇతర పార్టీలకు ధీటుగానే దేవుళ్లను స్మరిస్తూ.. ఇటు పనిలో పనిగా రైతాంగాన్ని ఆకట్టుకునేలా.. రెంటికీ లింక్ వేసి ప్రసంగిస్తున్నారు.

ఒక్కో దేవుడిపై ఒట్టు.. అదే దిక్కు.. 

రాష్ట్రంలో అనేక ముఖ్యమైన దేవాలయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న దేవుళ్ళపై ఆ చుట్టుపక్కల ప్రజల నమ్మకం కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కనుక సీఎం రేవంత్‌రెడ్డి దీనిని అవకాశంగా మలుచుకుంటూ.. ఆయా ప్రాంతాల్లో ఉండే దేవుడిపై ఒట్టు పెడుతూ.. రైతాంగానికి భరోసా కల్పించేలా సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే మంచి మార్గంలా.. దేవుడే దిక్కనేలా.. కనపడి ఉండవచ్చని అనుకుంటున్నారు. రెండు విధాలా లాభమే కనుక.. రైతాంగం ఆయా దేవుళ్ళపై వేసే ఒట్టు ప్రభావానికి లోనవడంతోపాటు.. తాముకూడా దేవుళ్ళపై వేసే ఒట్టును నిలబెట్టుకునేలా వ్యవహరిస్తామనే నమ్మకంతోనే ప్రచారాస్త్రంగా మలుచుకుంటున్నారని చెప్పవచ్చు.

అందులో భాగంగా నాలుగు రోజుల క్రితం జోగులాంబపై, ఆ తరువాత యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామిపై.. సోమవారం నాడు బాసర సరస్వతీ దేవాలయంపై ఒట్టువేసి ఆగస్టు 15 లోగా రుణ మాఫీ చేస్తానంంటూ ఒట్టు పెట్టుకున్నారు. మరింత ప్రచారం ఉండనే ఉంది.. పైగా రాష్ట్రంలో ధర్మపురి నర్సింహస్వామి, వేములవాడ రాజన్న, భద్రాద్రి రామన్న, ఓరుగల్లు భద్రకాళి, రామప్ప, చిలుకూరి బాలాజీ... ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే దేవుళ్ళు ఉన్నాయి. ఎన్నికల పుణ్యమాని వీరందరిపైకూడా ఒట్లు తప్పవేమో. వేచి చూడాల్సిందే..!