నేడు హనుమాన్ శోభాయాత్ర

23-04-2024 02:52:14 AM

l యాత్ర వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు

l మద్యం దుకాణాలు బంద్

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో ఏటా నిర్వహించే హనుమాన్ జయంతి శోభాయాత్రకు రంగం సిద్ధమైంది. ఈ శోభాయాత్ర మంగళ వారం ఉదయం 11.20 గంటలకు గౌలిగూడ రామమందిరం నుంచి ప్రారంభమవుతుంది. పుత్లిబౌలి, కోఠి, సుల్తాన్‌బజార్, రామ్‌కోఠి, కాచిగూడ, నారాయణగూడ, చిక్కడపల్లి మీదుగా కొనసాగనుంది. రాత్రి 8 గంటలకు తాడ్‌బండ్‌లోని హనుమాన్ మందిరం చేరాక యాత్ర ముగియనుంది. మొత్తం దాదాపు 12 కిలోమీటర్ల మేర శోభయాత్ర కొనసాగుతుంది. మరో ఊరేగింపు కర్మన్‌ఘాట్‌లోని ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం నుంచి ప్రారంభమై చంపాపేట్ వద్ద హైదరాబాద్ నగర పరిధిలోకి ప్రవేశిస్తుంది.

మూసారంబాగ్ జంక్షన్, మలక్‌పేట, ఆజంపురా రోటరీ, చాదర్‌ఘాట్ మీదుగా ప్రధాన ఊరేగింపులో కలుస్తుంది. ఈ నేపథ్యంలో శోభాయాత్ర జరిగే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. కొన్ని మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించనున్నారు. సీసీ కెమెరాల నిఘాలో ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం నగరవ్యాప్తంగా బార్లు, మద్యం దుకాణాలను బంద్ చేయాలని ఎక్సైజ్‌శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 24 గంటల పాటు ఈ నిబంధనలు వర్తిస్తాయని అధికారులు వెల్లడించారు.


హనుమజ్జయంతి శుభాకాంక్షలు తెలిపిన : మంత్రి సురేఖ

హనుమజ్జయంతిని పురస్కరించుకొని అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హనుమంతుని ఆరాధన గొప్ప క్రమశిక్షణ, జీవన శైలిని అలవర్చుతుందని పేర్కొన్నారు. పరాక్రమానికి, ఆరోగ్యానికి, కార్యదక్షతకు మారుపేరైన ఆంజనేయుడు ఆదర్శప్రాయుడు అని అన్నారు. 

భూమాతను రక్షించుకుందాం..

మానవులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ  భూమాతను రక్షించాలని మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి చేపట్టిన ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్ (ప్లాస్టిక్‌పై భూలోకం యుద్ధం) ఉద్యమానికి ఆమె సంఘీభావాన్ని ప్రకటించారు. పలు జీవజాతులు, చెట్లు నశించడం, ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతల్లో వస్తున్న మార్పులు మానవుల తప్పిదమే అన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వరదలను చూసైనా మానవాళిలో మార్పు రావాలని తెలిపారు.