పేకమేడలా కూలిన వంతెన

24-04-2024 02:06:25 AM

l ఈదురుగాలులకే కుప్పకూలింది

l పెద్దపల్లి జిల్లా ఓడేడు మానేరులో ఘటన

l రాత్రివేళ జరగడం వల్ల తప్పిన పెను ప్రమాదం

మంథని, ఏప్రిల్23(విజయకాంత్రి): కాళేశ్వరం సంఘటన మరువకమందే మరో వంతెన పేకమేడలా కూలిపోయింది. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని ఓడేడు మానేరు వంతెన ఈదురుగాలులకు కుప్పకూలిపోయింది. బ్రిడ్జి ఇంకా నిర్మాణ దశలోనే ఉండగా సోమవారం రాత్రి వీచిన గాలి బీభత్సానికి బ్రిడ్జిపై వేసిన గైడర్లు సపోర్టింగ్ లేక కిందపడ్డాయి. రాత్రి సమయంలో కూలడం, అక్కడ ప్రజలు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ విషయంలో అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. గాలికి వంతెన కూలిపోవడంపై స్థానిక ప్రజలు నివ్వెరపోతున్నారు. ఓడేడు మానేరు వంతెనను 2016 జూన్‌లో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది.

అప్పటి మంథని ఎమ్మెల్యే పుట్ట మధు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, స్పీకర్ సిరికొండ మధుసూదన్‌చారి శంకుస్థాపన చేశారు. ఈ బ్రిడ్జిని శ్రీసాయికన్‌స్ట్రక్షన్‌కు చెందిన శరత్ టెండర్ ద్వారా కాంట్రాక్ట్ దక్కిచ్చుకున్నారు. తొలుత నిర్మాణ వ్యయాన్ని రూ.49 కోట్లుగా అంచనా వేశారు. మొదట్లో వేగంగా జరిగిన నిర్మాణ పనులు ఆ తర్వాత నత్తనడకన సాగాయి. అనంతరం బ్రిడ్జి పనులను పూర్తిగా నిలిపివేశారు. అధికారులు సదరు కాంట్రాక్టర్‌కు నోటీసులు సైతం జారీ చేశారు. కొన్ని రోజుల తర్వాత వంతెన నిర్మాణ ఖర్చు అంచనాను రూ. 60 కోట్లకు పెంచారు. దీంతో కాంట్రాక్టర్ మళ్లీ పనులను ప్రారంభించారు.

మానేరులో గైడర్లు పోసి కొన్నింటిని ఫిల్లర్లపై అమర్చారు. మరికొన్నింటిని మానేరులో వదిలేశారు. ఈ ఏడు వచ్చిన వర్షాలకు ఆ గైడర్లు కొట్టుకుపోయాయి. ఒక జేసీబీ కూడా మునిగిపొయింది. దీంతో తాము తీవ్రంగా నష్టపోయామని మళ్లీ పనులను నిలిపివేశారు. అప్పటి నుంచి బ్రిడ్జి పనులు కొనసాగడం లేదు. సోమవారం మామూలుగా వీచిన గాలి దుమారానికే మూడు గైడర్లు విరిగి కింద పడ్డాయి. దీంతో బ్రిడ్జి నాణ్యతపై గ్రామ ప్రజలు అందోళన చెందుతున్నారు. ఈ బ్రిడ్జి మొత్తం నాసిరికంగా నిర్మించారని ఆరోపిస్తున్నారు. 

తప్పిన పెను ప్రమాదం

మానేరు నదిలో నిర్మిస్తున్న బ్రిడ్జి పక్కనే మట్టి రోడ్డు ఉంది. ఆ రోడ్డును చుట్టుపక్కన ఉన్న పలు గ్రామాల ప్రజలు వినియోగిస్తారు.  ఇసు క లారీలు కూడా ఈ మార్గం నుంచే వరంగల్ వైపు వెళుతాయి. ఈ బ్రిడ్జి గైడర్లు కూలినప్పుడు వాహనాలు కాని, ప్రజలు ప్రయాణిస్తే తీవ్ర ప్రాణనష్టం జరిగేదని ప్రజలు తెలిపారు. సోమవారం రాత్రి వీచిన గాలి దుమరానికే గైడర్లు కిందపడ్డాయని మంథని ఆర్‌అండ్‌డీ ఇంజినీర్ జావీద్ తెలిపారు. పెద్దపల్లి ఎస్‌సీ చంద్‌సీంగ్, ఈఈ రాములు, డీఈ జాఫర్ వంతెనను పరిశీలించారు. ఉన్నతధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 

బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అన్ని పేకమేడలే..

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అన్ని పేక మేడలే నిర్మించారని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యాక్షుడు చొప్పరి సదానందం, మండల పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, పీఏసీఎస్ చైర్మన్ అల్లాగి యాదగిరిరావు విమర్శించారు. కూలిన బ్రిడ్జిని పరిశీలించిన అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు తీసుకొని బ్రిడ్జిలను పరిశీలించకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు. వంద ఏండ్లు ఉండాల్సిన వంతెనలు కేవలం వంద నెలలు కూడా ఉండటంలేదన్నారు. లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరంలో ప్రాజెక్టు ఘటన మర్చిపొకముందే నేడు ఓడేడు బ్రిడ్జి గాలికి కొట్టుకుపొవడంతో ప్రజలు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని చూసి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ బ్రిడ్జి నాణ్యతపై పుట్ట మధు, మాజీ సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.