calender_icon.png 19 May, 2025 | 10:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్ గాంధీ పేరుంటే పోటీ చేయొద్దా?

04-05-2024 12:33:41 AM

పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం

ఢిల్లీ, మే 3 (విజయక్రాంతి): ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో సుప్రీం కోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకే పేరుతో ఉన్న అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ నుంచి నిషేధించాలని దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించింది. రాజకీయ నేతల పేర్లు పెట్టుకున్నంత మాత్రాన వ్యక్తులను ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా నిషేధించలేమని పేర్కొంది. ఇలా చేయడం వ్యక్తుల హక్కును హరించడమేనని అభిప్రాయపడింది. కాగా, ఒకే రకమైన పేర్లు గల అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని కోరుతూ సాబు స్టీఫెన్ అనే వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ బీఎస్ గవాయ్ నేతృత్వంలోని జస్టిస్ చంద్ర శర్మ, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. “రాహుల్ గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లు పెట్టుకున్నంత మాత్రాన ఆయా అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోలేం. ఇది వారి హక్కులకు విఘాతం కలిగించడమే.” అని వ్యాఖ్యానిస్తూ పిటిషనర్ తరపు న్యాయవాది వీకే బిజు వాదనలను తోసిపుచ్చింది. దీనిపై విచారణకు నిరాకరించింది. 

తిరస్కరణకు గురైన పిటిషన్..

కాగా, ఎన్నికల్లో ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి పేరు గల మరో అభ్యర్థిని స్వతంత్య్ర అభ్యర్థిగా కొన్ని పార్టీలు రంగంలోకి దింపుతున్నాయి. తద్వారా, ఓటర్లను తికమక పెట్టి గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇలాంటి అభ్యర్థుల వల్ల ముఖ్య నాయకులు స్వల్ప తేడాతో ఓడిపోతున్నారు. అందుకే, స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికల ప్రక్రియ కోసం ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేసేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ పిటిషనర్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా, పిటిషన్‌ను కొట్టేసింది. అనంతరం కోర్టు అనుమతితో పిటిషనర్ తన వాజ్యాన్ని ఉపసంహరించుకున్నారు.