గ్రేటర్‌లో అటకెక్కిన స్క్రాప్

24-04-2024 02:03:52 AM

స్క్రాప్ పాలసీ అమలుపై నీలి నీడలు

కాలం చెల్లిన వాహనాలతో పెరుగుతున్న కాలుష్యం.. ప్రమాదాలు 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరం లో ఏటేటా కాలంచెల్లిన వాహనాలు పెరుగుతున్నాయి. గడువు ముగిసిన వాహనాలు నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతుండటంతో నగరంలో వాయు కాలుష్యం తో పాటు రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నా యి. రిజిస్ట్రాడ్ వెహికిల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (ఆర్‌విఎస్‌ఎఫ్)ని హైదరాబాద్‌లో అమలు చేయాలని ఆర్టీఏ అధికారులు భావించినా మార్గదర్శాలు విడుదల చేయకపోవడంతో కాలం చెల్లిన వాహనాలు పెరుగుతున్నాయి. 

కాలం తీరిన వాహనాలు 20 లక్షలు 

హైదరాబాద్ మహానగరంలో దాదాపు 70లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. వీటిలో 15ఏండ్ల జీవిత కాలం దాటి గడువు ముగిసిన వాహనాలు దాదాపు 20లక్షలు ఉన్నాయి. బైక్‌లు 2లక్షల కిలో మీటర్లు, ఆర్టీసీ బస్సులు 12లక్షల కిలో మీటర్లు తిరిగిన వాహనాలను గడువు ముగిసిన వాహనాలుగా రవాణా శాఖ భావిస్తోంది. వీటిని మరికొన్నేళ్ల పాటు నడుపుకోవడానికి ఆర్టీఏకు గ్రీన్‌ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ వాహనాలు ఫిట్‌నెస్ లేకపోవడం వల్ల కాలుష్యాన్ని పెద్ద మొత్తంలో వెదజల్లుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 10ఆర్టీఏ కార్యాలయా ల ద్వారా ప్రతిరోజు సుమారు 2500 కొత్త వాహనాలు అమ్మకాలు జరిగి రోడ్డుపైకి వస్తున్నట్టుగా అధికారులు చెబుతున్నారు.

ఈ మొత్తం వాహనాల ద్వారా ఘనపు మీటరు గాలిలో 60 మైక్రో గ్రాములు ఉండాల్సిన దూళి రేణువులు సరాసరి 90 నుంచి 100 మైక్రో గ్రాముల దూళి రేణువులు ఉంటున్నట్టుగా సమాచారం. వాహనదారులు తమ గడువు ముగిసిన వాహనాలను తుక్కుగా మార్చి, మరో కొత్త వాహనం కొనుగోలు చేయడానికి  వీలుగా కేంద్రం రిజిస్ట్రర్డ్ వెహికిల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (ఆర్‌విఎస్‌ఎఫ్) విధానాన్ని తీసుకొచ్చింది. గత ప్రభుత్వ హయాంలోనే ఈ విధానాన్ని హైదరాబాద్ నగరంలోనూ అమలు చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేయాలని ఆర్టీఏ అధికారులు భావించారు. కానీ, ఆచరణలో సాధ్యం కాలేదు.

పాత వాహనాన్ని స్క్రాప్ ఫెసిలిటీ కేంద్రంలో ఇచ్చినట్టయితే అక్కడ జారీ చేసే సర్టిఫికెట్ ద్వారా వాహనదారుడికి ఆ వెహికిల్ ధరలో 4నుంచి 5శాతం చెల్లించడం, కొత్త వాహనం కొనుగోలు చేస్తే వాహన ధరలో 5నుంచి 6శాతం రాయితీతో పాటు ఉచిత రిజిస్ట్రేషన్, రోడ్డు ట్యాక్స్ మినహాయింపు పొందే వీలుంది. నగరంలో పెరుగుతున్న వాయి కాలుష్యాన్ని, రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆర్‌విఎస్‌ఎఫ్ పాలసీని తీసుకురావాలని వాహన దారులు కోరుతున్నారు.