సీఎం చిల్లర రాజకీయం

24-04-2024 12:58:24 AM

l దేవుళ్లపై ఒట్టేసి మభ్యపెట్టే ఎత్తు

l రేవంత్ కాంగ్రెస్‌లో ఉండుడు అనుమానమే

l విశ్వాసఘాతకులే పార్టీ మారుతారు

l రామున్ని మొక్కుదాం..బీజేపీని తొక్కుదాం

l బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

వరంగల్/వనపర్తి, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): శాసనసభ ఎన్నికల్లో 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, వాటిని అమలు చేయడంలో విఫలమైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. హామీలు అమలుచేయాలని నిలదీస్తే.. ఇప్పుడు దేవుళ్ల మీద ప్రమాణం చేస్తూ మరోసారి మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్‌గాంధీ ఒకటి మాట్లాడుతుంటే, రాష్ట్ర సీఎం మరొకటి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉన్నదని అనుమానం వ్యక్తంచేశారు. ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ కాంగ్రెస్‌లో ఉంటాడా అనేది అనుమానమేనని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా మంగళవారం వరంగల్‌తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాలు, నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానం కార్యకర్తల సమావేశాల్లో కేటీఆర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైటెన్షన్ వైరునంటున్న సీఎం రేవంత్‌రెడ్డి.. కరెంటు లేకపోతే ఏ వైరు అయినా ఒక్కటే అన్న విషయం గ్రహించాలని చురకలంటించారు. సీఎం హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డి చిల్లరగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ల ద్వారా వచ్చిన ఉద్యోగాలకు ఇప్పుడు నియామక పత్రాలు అందించి తన ఘనతగా చెప్పుకొంటున్నారని ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే కాంగ్రెస్, బీజేపీకి భయం ఉంటుందని చెప్పారు. ఓటర్లను ప్రలోభపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. తన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ఆగష్టు 15లోగా రైతు రుణమాఫీ అంటూ నాటకాలాడుతున్నదని విమర్శించారు. 

వాళ్లు విశ్వాసఘాతకులు 

విశ్వాసఘాతకులే పార్టీ మారుతారని కేటీఆర్ అన్నారు. కడియం శ్రీహరి, అరూరి రమేష్, పసునూరి దయాకర్ తడిగుడ్డతో గొంతు కోశారని మండిపడ్డారు. వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికే పరిమితం అవుతుందని చెప్పారు. కేసీఆర్ సీఎంగా ఎన్నో ఆలయాలు నిర్మించినా ఎప్పుడూ దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేయలేదని తెలిపారు. అందరివాడైన రామున్ని మెక్కాలని, బీజేపీని తొక్కాలని పిలుపునిచ్చారు.  పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న సుధీర్‌కుమార్‌ను ఎంపీగా గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ 60 ఏండ్ల పాలనలో సాధ్యంకాని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను పదేళ్లలో కేసీఆర్ చేసి చూపించారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీని డిసెంబర్ 9వ తేదీన రైతుల ఖాతాలో వేస్తామని చెప్పి.. ఇప్పటివరకు ఒక్కరికి కూడా పైసా మాఫీ చేయలేదని విమర్శించారు.

ఇప్పుడు ఆగస్టు 15వ తేదీలోపు మాఫీచేస్తామని దేవుళ్ల మీద ఒట్లు వేసి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. నాగర్‌కర్నూల్ బీఆర్‌ఎస్ అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. తాను గురుకులాల కార్యదర్శిగా ఉన్నప్పుడు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దానని నాగర్‌కర్నూల్ బీఆర్‌ఎస్ అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. తాను బీఆర్‌ఎస్‌లో చేరే సమయంలో అధికార పార్టీ నేతలు ఎన్నో ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నించినా వాటిని తిరస్కరించి కేసీఆర్ నాయకత్వంలో పని చేయడానికి సిద్ధమయ్యానని వెల్లడించారు. ఎన్నికల్లో తనకు అత్యధిక మెజార్టీ ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తిచేశారు.