వరంగల్‌ను అభివృద్ధి చేస్తా..

24-04-2024 01:18:38 AM

నగరానికి ఓఆర్‌ఆర్ తెచ్చేందుకు ప్రయత్నిస్తా..

గెలుపుపై పూర్తి ధీమాతో ఉన్నాను

పార్టీ క్యాడర్ నుంచి మంచి మద్దతు లభిస్తోంది

కడియం కావ్యతో ‘విజయక్రాంతి’ ప్రత్యేక ఇంటర్యూ

హనుమకొండ/ ఏప్రిల్ 23 విజయక్రాంతి: వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న అన్ని సమస్యలు పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని వరంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి డాక్టర్ కడియం కావ్య స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారని, ఈ ఎన్నికల్లో తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ‘విజయక్రాంతికి’ ఇచ్చిన ప్రత్యేక ఇం టర్వ్యూలో వివిధ అంశాలపై మాట్లాడారు. 

ప్రత్యర్థుల విమర్శలను ఏ విధంగా ఎదుర్కొంటున్నారు? 

బీజేపీ, బీఆర్‌ఎస్ నాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయి. కానీ, ప్రజలు చైతన్యవంతులు. వారి మాటలు నమ్మే పరిస్థితు ల్లో లేరు. తనను ఎంపీగా గెలిపిస్తే వరంగల్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తా. వీటిలో ముఖ్యంగా విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో వరంగల్ అభివృద్ధికి కృషి చేస్తా. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలపై బీజేపీ మొండిచేయి చూపించింది. ఈ విషయంలో ప్రజలు,మేధావులు, యువత ఆలోచించాలి. 

మీ గెలుపునకు ఏ అంశాలు దోహదపడుతాయని భావిస్తున్నారు?

నా తండ్రి కడియం శ్రీహరి మంత్రి, డిప్యూటీ సీఎం, ప్రస్తుతం స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా ప్రజలకు అందించిన సేవలు, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసం తన గెలుపుకు దోహదపడతాయి. మూడు నెలల క్రితమే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చిన సంపూర్ణ మద్దతు నాకు అనుకూలాంశం. 

కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తిస్థాయిలో మీకు మద్దతు లభిస్తుందా?

ఎమ్మెల్యేల నుంచి మండల స్థాయి నాయకులు కూడా పూర్తి మద్దతు ఇస్తున్నా రు. దశలవారీగా అన్ని వర్గాల ప్రజలను కలిసి ఓట్లు వేయాలని కోరుతున్నా. 

ఎంపీ అయితే మీ లక్ష్యం ఏమిటి? 

నన్ను ఎంపీగా గెలిపిస్తే లెథర్ పార్క్, వరంగల్ నగరానికి ఓఆర్‌ఆర్, అండర్ గ్రౌండ్ డ్రైయినేజీ తీసుకొచ్చేందుకు కృషి చేస్తా. నిరాధారమైన ఆరోపణలు పట్టించుకోవల్సిన అవసరం లేదు. వాస్తవాలు ప్రజ లు గమనిస్తున్నారు. ఒక వైద్యురాలిగా వైద్యరంగంపై తనకు సంపూర్ణ అవగాహన ఉంది. మండలాలు, పట్టణాల్లో వైద్యసేవలు సామాన్య ప్రజలకు చేరువ అయ్యే విధంగా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తా. ఎన్నికల ప్రచారంలో యువత, మహిళలు, మేధావులు ఇతర వర్గాల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తోంది. తొలుత పార్టీలో చిన్న చిన్న విభేదాలు ఉత్పన్నమైనప్పటికీ సీనియర్ నేతల సమన్వయంతో అన్ని సద్దుమణుగుతున్నా యి. ఇతర పార్టీలనుంచి రోజురోజుకు కాంగ్రెస్‌లో చేరేందుకు ముందుకు వస్తున్నారు. పార్టీకి మంచి ఆదరణ ఉందనడానికి ఇది ఒక తార్కాణం. 24న (నేడు) సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనే సభకు ఒక్కో నియోజకవర్గం నుంచి పది నుంచి 15 వేల మంది జనసమీకరణ జరుగుతోంది. 80వేలకుపైగానే సీఎం సభకు హాజరుకానున్నారు.