22-12-2025 02:10:20 PM
హైదరాబాద్: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలే మీ తోలు తీశారు కేసీఆర్ అంటూ గాంధీభవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియా కాన్ఫరెన్స్ లో మాట్లాడటం కాదు... అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్ విసిరారు. సలహాలు ఇస్తే గౌరవంగా స్వీకరిస్తామని సూచించారు.
ప్రజా సమస్యలపై మాట్లాడాలంటే అసెంబ్లీ వేదికగా చర్చించాలని డిమాండ్ చేశారు. 12 ఏళ్ల పాటు ఏం చేశారో కేసీఆర్ చెప్పగలరా? అని పొన్నం ప్రశ్నించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలే బీఆర్ఎస్ పూర్తి చేయలేదని ఆరోపించారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని పొన్నం వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులపై కలిసి వస్తే పోరాడుదామని తెలిపారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు.