calender_icon.png 5 May, 2025 | 9:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కష్టపడ్డ కార్యకర్తకే పెద్దపీట

05-05-2025 01:48:50 AM

  1. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

రానున్న స్థానిక సంస్థల్లో సత్తాచాటాలి

ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ్మ

సంగారెడ్డి, మే 4(విజయక్రాంతి)కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి ఆయువుపట్టని, కష్టపడ్డ ప్రతీ కార్యకర్తను పార్టీ గుర్తించి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మ తెలిపారు. ఆదివారం డీసీసీ ప్రెసిడెంట్, టీజిఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి అధ్యక్షతన సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రితో పాటు జిల్లా అబ్జర్వర్లు రాంమోహన్రెడ్డి, దయాకర్ పాల్గొన్నారు.

మంత్రి మాట్లాడుతూ  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ సంక్షేమ పథకాల అమలు చేస్తుందని తెలిపారు. దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలను సైతం పరిష్కరిస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. తెలంగాణలో చేపట్టిన బీసీ కులగణన ను ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేపట్టేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

బీసీ రిజర్వేషన్లతో పాటు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. దానికి తోడు ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలలో అనేక హామీలను ఇప్పటికే అమలు చేస్తున్నామని వివరించారు. ఈ విషయాలన్నీ క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకుని వెళ్లి పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని  పిలుపునిచ్చారు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి పార్టీ గుర్తించి పెద్దపీట వేస్తుందని భరోసా ఇచ్చారు.

త్వరలో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు చేపట్టనున్న పార్టీ పదవుల భర్తీలో కష్టపడ్డ కార్యకర్తలకు తప్పకుండా న్యాయం జరుగుతుందన్నారు. జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి,  మాజీ మంత్రి, జహీరాబాద్ ఇంచార్జ్ చంద్రశేఖర్, స్పోరట్స్ చైర్మన్ శివసేన రెడ్డీ, సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, నర్సాపూర్ ఇంచార్జ్ రాజిరెడ్డి, ఉజ్వల్ రెడ్డి, కాట సుధా గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.