18-12-2025 07:23:45 PM
- సర్పంచులకు సన్మానం
- బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి
బెల్లంపల్లి (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి గ్రామ స్వయం పాలనకు పెద్దపీట వేస్తున్నదని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి అన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులను గురువారం బెల్లంపల్లి క్యాంప్ ఆఫీస్ ఆవరణలో సన్మానించారు. ఈ సందర్భంగా ప్రజల విశ్వాసంతో గెలుపొందిన బెల్లంపల్లి, నెన్నల, తాండూర్, కాసిపేట, వేమనపల్లి, భీమిని, కన్నెపల్లి మండలాల నూతన సర్పంచ్‌లను శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.
అంతరం ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యానికి, గ్రామ స్వయంపాలనకు ఎప్పుడూ పెద్దపీట వేస్తుందని, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల బలోపేతానికి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని, ప్రజలు ఇచ్చిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని సర్పంచ్‌లకు సూచించారు. తాగునీరు, పారిశుధ్యం, రోడ్లు, విద్యుత్, విద్య, ఆరోగ్యం వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధించాల్సిన బాధ్యత సర్పంచ్‌లదేనని అన్నారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలతో గ్రామీణ ప్రజల జీవన ప్రమాణం మెరుగుపడుతుందని తెలిపారు. పార్టీ, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాల అభివృద్ధి వేగవంతం అవుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పిన్నింటి రఘునాథ్ రెడ్డి, ఏడు మండలాల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.