calender_icon.png 3 July, 2025 | 8:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మసకబారిన ‘ఆధార్’

03-07-2025 02:42:44 AM

సులభతరమైన పాలనకు ఆధార్ కార్డు ఒక విప్లవాత్మకమైన మార్పునే తెచ్చింది. ఇందులో సందేహంలేదు. పథకాలు, సదుపాయాలు అందించడంలో సమ్మిళిత పాలనకు ఆధార్ కార్డు ఎంతగానో దోహదపడింది. పదిహేనేళ్ల క్రితం యూనివర్సల్, బయోమెట్రిక్ విధానంలో దేశంలోని ప్రతి పౌరుడిని గుర్తించాలని ప్రభుత్వం ఆధార్‌ను ప్రవేశపెట్టింది. పేదవారు, ఏ రికార్డులకు ఎక్కని వారు ఏదో ఒక విధంగా లబ్ధిపొందడానికి ఆధార్ ఉపకరిస్తుందని అంతా భావించారు.

అప్పటివరకు రేషన్‌కార్డులు, ప్రభుత్వం కార్డు నుంచి పొందే సర్టిఫికెట్లు, పాస్‌పోర్టులను గుర్తింపు కోసం ఉపయోగించేవారు. దేశంలోని పౌరులందరి వద్ద ఇవి ఉండే ఆస్కారం లేదు. ఇక్కడ ఏర్పడిన లోటును ఆధార్ భర్తీ చేసింది. కోట్లాది మంది దేశస్థులకు ఆధార్ కార్డులు ఇచ్చే మహా యజ్ఞాన్ని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) తలకెత్తుకుంది. పౌరుల వేలిముద్రలు తీసుకొని, ఐరిస్ విధానంలో కంటిపాప గుర్తును సేకరించడంలో పెద్ద పనిని పూర్తి చేసింది.

ఆధార్ కార్డు సాధిస్తేనే ఇక దేశ పౌరుడిగా గుర్తింపు, తద్వారా ఏ పథకమైనా అమలులో లబ్ధి పొందవచ్చని సామాన్య ప్రజానీకం అందుకు సహకరించింది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో, గ్రామాల్లో కరెంటు లేక, ఇంటర్నెట్ కనెన్షన్ సరిగాలేక ఆధార్ కేంద్రాలకు పలుమార్లు వెళ్లి ప్రజలు పడిగాపులు పడేవారు. అలా ఆధార్ కార్డు సాధించిన వారి ఆనందమే వేరు. ఆధార్ విధానానికి మొదట్లో న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. వ్యక్తిగత గోప్యతకు ఇది ముప్పు అని భావించిన వారున్నారు.

బయోమెట్రిక్ విధానంలో సేకరించిన పౌరుల వివరాలు ఇతరుల చేతిలో పడితే ప్రమాదకమైన పరిణామాలు ఉంటాయనే ఆందోళన కూడా వ్యక్తమైంది. 2016లో ఆధార్‌పై ఒక చట్టం వచ్చేవరకు సమస్యలు, సందేహాలు కొనసాగాయి. ఆ తర్వాత ఆధార్ కార్డును తప్పనిసరి చేశారు. ప్రభుత్వం నుంచి ఏదైనా పథకం ద్వారా మొబైల్ సిమ్ కార్డులు కొనాలన్నా, లబ్ధి చేకూరాలన్నా, బ్యాంకు ఖాతా తెరవాలన్నా, చివరికి పిల్లల్ని స్కూల్‌లో చేర్పించాలన్నా ఆధార్ నంబర్ తప్పనిసరైంది. ఇక ఆధార్ కార్డులో ఏదైనా సవరణ కావాలన్నా మొదట్లో ఎదురైన తిప్పలు మామూలు కాదు.

ఇప్పటికీ దాదాపు 10 కోట్ల మంది దేశ పౌరులు ఆధార్ కార్డుకు దూరంగానే వున్నారని అంచనా. ఆధార్ నంబర్ పౌరుల గుర్తింపు, వారి చిరునామా గుర్తింపునకు మాత్రమే తప్ప వారి పౌరసత్వాన్ని గుర్తింపు కాదనేది గుర్తించాల్సిన అంశం. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఆధార్ కార్డులో నమోదైన వయస్సును పరిగణలోకి తీసుకునేవి. కాని.. ఆధార్ కార్డులో వున్న వయస్సును పరిగణలోకి తీసుకోలేమని సుప్రీం కోర్టు రూలింగ్ ఇవ్వడంతో ఆధార్ కార్డులోని వయస్సు చెల్లుబాటును కోల్పోయింది.

తర్వాత క్రమంగా ఆధార్ కార్డు ప్రాధాన్యతను కోల్పోతూ వస్తున్నది. పాన్‌కార్డుతో పాటు ఆధార్ కార్డ్ కూడా పౌరసత్వానికి రుజువుగా చూపించేందుకు వీలులేదని కేంద్రప్రభుత్యం చెబుతున్నది. ఈ కార్డులకు నకిలీలు పుట్టుకురావడం సమస్యగా మారింది. నటీనటుల ఫొటోలు మొదలుకొని మాఫియా డాన్ల ఫొటోల వరకు ఆధార్‌కార్డులపై దర్శనమివ్వడం కూడా ఈ విధానాన్ని నీరుగార్చింది. దేశంలోకి అక్రమంగా వలసవచ్చిన వారికి కూడా ఆధార్ కార్డులు లభించడం లోపభూయిష్టంగా మారింది.

అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీహార్‌లో ఎన్నికల కమిషన్ కూడా ఓటర్ల గుర్తింపునకు ఆధార్‌ను పరిగణించడం లేదు. ఆధార్ నంబర్ ఇప్పుడు రైలు, విమాన టికెట్లు కొనేందుకు ఉపయోగపడుతున్నా, రానున్న రోజుల్లో అక్కడ కూడా చెల్లుబాటు కాదేమో. అసలు లక్ష్యానికి ఆధార్ ఇప్పుడు ఆమడ దూరం జరిగినట్టు కనిపిస్తోంది.