03-07-2025 02:45:05 AM
తుష్టాన్ భూయః పూజయేత్, అతుష్టాతతన్ తుష్టిహేతోః త్యాగేన సామ్నాచ ప్రసాదయేత్ పరస్పరాద్వా భేదయే దేనాన్ (కౌటిలీయం -1-13) ‘నాయకుడు రాజ్యంపట్ల సంతోషంతో ఉన్నవారిని ఇంకా పూజించాలి. అనగా మ రింతగా ఆదరించాలి. అసంతృప్తులను ధనం ఇచ్చి గాని, మంచితనం చూపిగాని, కీలక బాధ్యతలు అప్పగించిగాని ఎక్కువ అనుకూలురుగా చేసుకోవాలి. అలా కుదరనప్పుడు వారిలో వారికి భేద భావనలు కల్పించాలి. ఇలా కుదరని సందర్భంలో వారికి పన్ను వసూలు చేసే అధికారాన్ని ఇచ్చి.. ప్రజల్లో వారి పట్ల ద్వేషంకలిగి తిరుగుబాటు చేసే విధంగా పరిస్థితులు కల్పించాలి’ అని అంటున్నాడు ఆచార్య చాణక్యుడు. అలా చేయని నాడు వారు శత్రుపక్షంలో చేరిపోయే ప్రమాదం ఉంటుంది. రాజ్యం లేదా సంస్థ సజావుగా నడవడంలో.. దానికై పనిచేసే ఉద్యోగులు కీలక బాధ్యతలు నిర్వహి స్తారు.
వారు అసంతృప్తులై, బద్ధకస్థులై పని పట్ల నైరాశ్యత కనబరిస్తే.. అది కార్యభంగానికి దారితీస్తుంది. రాజ్యం పరహస్తగతమౌ తుంది. సంస్థ పోటీదారుల పరమవుతుంది. అందుకే నాయకుడు అనుక్షణం అప్రమత్తుడై ఉండాలి. ప్రతి రంగాన్నీ నిశితంగా పర్యవేక్షించాలి. సమర్థత ప్రాతిపదికగా ఆయా కీలక పదవుల్లో అధికారులను నియమించి వారికి అవసరమైన అధికారాలు, వనరులు అందించి.. సంస్థను ఉన్నత స్థానం లో నిలిపేందుకు కృషిచేయాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. సంస్థ అనేది వ్యక్తి స్వంతమే కావచ్చు కాని.. అది పలువురు ఉద్యోగులకు ఉపాధినిచ్చి, భుక్తినంది స్తూ వారి వ్యక్తిత్వాన్ని పరిమళింపచేసే పరిశ్రమ అని గుర్తించాలి. సంస్థను కాపాడుకుం టేనే ఉద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.
మేధోవలసలకు కారణం..
ప్రపంచీకరణ నేపథ్యంలో మేధో వలసలు సర్వసాధారణమయ్యాయి. ప్రజల జీ వన ప్రమాణాలు పెరుగుతున్న సమయం లో ఎక్కువ మొత్తంలో జీతభత్యాలు చెల్లించడం, వసతులు కల్పించడం, గౌరవప్రప త్తులతో ఆదరించడం చూపిన సంస్థల పట్ల సమర్థులైన ఉద్యోగులు ఆకర్షితులవడం సహజం. ఉద్యోగులకు యాజమాన్యం సముచిత స్థానం కల్పించని సమయంలో ప్రత్యర్థి సంస్థలు సమర్థులైన ఉద్యోగులకు అధిక మొత్తాన్ని వేతనాల రూపంలో కాని, ఉన్నత పదవులు ఆశచూపి కాని ఆకర్షించే అవకాశం ఉంటుంది.
ఉద్యోగుల నిష్క్రమణ ఆ సంస్థ ప్రగతిపై ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా ఇలాంటివి చిన్న పరిశ్రమలలో అధికంగా ఉంటాయి. సంస్థ నుంచి ఉద్యోగుల వలసలు ఆపేందుకు వలసలకు మూ లకారణాలను విశ్లేషణ చేసుకోవాలి. విమర్శనాత్మకమైన ఆలోచనా సంబంధిత సమా చారాన్ని క్రమబద్ధంగా మూల్యాంకనం చేసి విశ్లేషించి సమర్థవంతమైన నిర్ణయం తీసుకునేందుకు సహకరిస్తుంది. విస్తృత పరిధిలో, లోతైన ఆలోచనా సరళి కారణాలను విశ్లేషణ చేసుకునేందుకు దోహదపడుతుంది.
యాజమాన్యం, ఉద్యోగుల మధ్య స్వల్ప భేదాభిప్రాయాలు, భావ వ్యక్తీకరణలో లోపాలు ఉద్యోగుల వలసలకు కారణాలవుతాయి. ఉద్యోగులకు పదవుల ఉన్నతీకరణ కు అవకాశం లేకపోయినా, సముచిత గౌరవం లభించకపోయినా, యాజమాన్య నిర్వహణలో లోపాలున్నా, సంస్థ పూడ్చుకోలేని నష్టాలతో మునిగిపోయే ఓడగా కనిపిం చినా ఉద్యోగులు మరొక సంస్థను ఆశ్రయిస్తారు. అలాంటి సమయంలో యాజమా న్యం, ఉద్యోగులు మరొక సంస్థను ఎన్నుకునేందుకు దారితీస్తున్న పరిస్థితులకు సంబం ధించిన సమాచారాన్ని అధ్యయనం చేయ డం ద్వారా, వారి అసంతృప్తికి కారణాలను అన్వేషించడం ద్వారా, పని స్థలాల్లో పరిస్థితులను చక్కదిద్దడం ద్వారా వాటిని అరికట్టే అవకాశం ఉంటుంది.
సమంజసమైన స మాచార విశ్లేషణల ద్వారా తప్పు ఎక్కడ జరుగుతున్నదో తెలుసుకొని దానిని సరిచేయడం వల్ల ఉన్నత ప్రమాణాలతో ఉద్యోగి స్తున్న వారిని నిలుపుకోవడం సాధ్యపడుతుంది. అవసరమైన శిక్షణను అందించి ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశాన్ని కల్పించడం, వారికి ఒక గురువుగా వారి సమస్యలను తెలుసుకొని అవసరమైన సహాయాన్ని అందించ డం, జీవన ప్రమాణాల కనుగుణమైన జీతభత్యాలను చెల్లించడం ద్వారా ఉద్యోగుల వలసలను అరిగట్టడం సాధ్యపడుతుంది. ఈ సందర్భంగా దివంగత రాష్ట్రపతి కలాం చెప్పిన చిన్న సంఘటన ఉద్యోగుల యాజమాన్య బంధాన్ని ఎలా పటిష్టపరుస్తుందో తెలియచేస్తుంది.
ఒకనాడు, కలాం వద్ద ఉద్యోగి తాను సాయంత్రం త్వరగా వెళ్లిపోవాలని, పిల్లలను షాపింగ్‌కు, సినిమాకు తీసుకువెళ్లాలని అనుమతి పొందాడు. అయితే.. ఆ ఉద్యోగి పనిలోపడి ఆ విషయం మరచిపోయాడు. కాని కలాం మాత్రం ఉద్యోగి తన కుటుంబానికి ఇచ్చిన మాటను గుర్తుంచుకుని ఉద్యోగి ఇంటికి వెళ్లి.. అతని భార్యాపిల్లలను షాపింగ్ కు, సినిమాకు తీసుకువెళ్లి ఇంటివద్ద దింపి వెళ్లిపోయాడు. ఇలాంటి అసాధారణమైన సహానుభూతి చూపడం ద్వారా యజమాని తన బృందానికి ఒక శక్తిమంతమైన ఉదాహరణగా నిలవడం తద్వారా యాజమాన్య ఉద్యోగుల బంధం పటిష్టమవుతుంది. ఉద్యోగికి యజమాని తన కుటుంబానికి విలువనిచ్చాడనే సత్యం అవగతమవుతుంది. తాను విస్మరించినా తన కుటుంబం పట్ల యజమాని చూపిన నిబద్ధత ఉద్యోగిలో కృతజ్ఞతాభావనను నింపుతుంది. బృందానికి నాయకునికి మధ్య విశ్వాసాన్ని నెలకొల్పడం తద్వారా నమ్మకం, సాన్నిహిత్యం ప్రాతిపదికగా సానుకూల పనివాతావరణం పెంపొందుతుంది.
చిన్నసంస్థల్లోనే ఎక్కువ సమస్యలు..
చిన్న సంస్థల్లో ఉద్యోగులకు ఎన్ని వసతులు కల్పించినా వారికి అసంతృప్తి హెచ్చుగానే ఉండే అవకాశం ఉంటుంది. వారికి ప్రేరణనందివ్వడం కత్తిమీద సాములాగానే ఉంటుంది. అయితే సమర్థులైన ఉద్యోగుల పట్ల యాజమాన్యం చూపేశ్రద్ధ, ఆప్యాతానురాగాలు వారిని నిలిపేందుకు ప్రేరణనిస్తాయి. యాజమాన్యం వాస్తవాల ను తమ అభిప్రాయాల దృష్టికోణం నుం చి, పక్షపాత వైఖరి నుంచి వేరుచేయడం, ఔచితీవంతంగా స్పందించడం, అనుమానాల దృష్టితో కాకుండా తార్కికంగా పరిస్థితులను బేరీజు వేసుకోవడం, కీలక నిర్ణయాల్లో సమర్థులైన ఉద్యోగులకు స్థానం కల్పించడం వంటి చర్యల వల్ల సమర్థత కలిగిన ఉద్యోగుల సేవలను దూరం చేసుకునే అవకాశం ఉండదు.
పూర్వ నిశ్చితాభిప్రాయాలను పక్క న పెట్టి ఉద్యోగుల సమర్థతను ఆదరించడం, ‘వ్యక్తిగత బంధు త్వం కన్నా సంస్థ ప్రయోజనాలే మిన్న’ అని భావించడం వల్ల ఉత్తమ ఫలితాలు ఆవిష్కృతమవుతాయి. సంక్లిష్టమైన నిర్ణయాలను దృశ్యమానం చేసుకోవడం వల్ల వ్యూహాత్మకమైన నిర్ణయాలను తీసుకోవ డం సులువవుతుంది. ఉద్యోగుల బలాబలాల పట్ల నిర్నిబద్ధమైన అంచనాలు, స మాచారాన్ని సేకరించడం, ఆధునిక సాంకేతిక నేపథ్యంలో విశ్లేషణ చేసుకోవడం వల్ల ఉద్యోగుల వలసలను అరికట్టడం సాధ్యపడుతుంది. అయితే.. ఏ విధమైన ప్రేరణ తోనూ సరిచేయలేని ప్రవర్తన కలిగిన ఉద్యోగులను, నిబద్ధత లేని ఉద్యోగులను ఎంత త్వరగా వదిలించుకుంటే.. సంస్థ అంతగా లభిస్తుంది.