03-07-2025 02:39:41 AM
భారతీయ రైల్వే పరిధిలో బెడ్ రోల్స్ అటెండర్లుగా పనిచేస్తున్న వారి జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. ఏసీ తరగతుల్లో ప్రయాణించే ప్రయాణికులకు పరిశుభ్రమైన దిండ్లు, దుప్పట్లు అందజేయటం వీరి పని. అంతేగాక, వీరు కొన్ని రకాల పారిశుద్ధ్య పనులు కూడా నిర్వహిస్తారు. రైల్వేశాఖ వీరిని కాంట్రాక్ట్ పద్ధతిలో నియమిస్తుంది. ఒక ప్రైవేటు కాంట్రాక్ట్ సంస్థ ద్వారా అంటెండర్లను నియమిస్తుంది. ఆ కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థ అటెండర్లకు నెలకు రూ.15,000 చొప్పున వేతనం అందిస్తుంది.
రోజువారీ కూలి పనిచేసుకునే వారికంటే వీరి వేతనం అతి తక్కువ అనేది సుస్పష్టం. అయితే.. ఆ వేతనం అంతకు అంత అటెండర్లకు అందితే బాగానే ఉంటుంది. కానీ, వారికి పూర్తి వేతనం అందడం గగనమైంది. ఏసీ క్లాస్ ప్రయాణికులు కొందరు దిండ్లు, దుప్పట్లను దొంగిలించడం పరిపాటిగా మారింది. దిండ్లు, దుప్పట్ల అపహరణపై రైల్వే అధికారులు గగ్గోలు పెడుతున్నారు. కాంట్రాక్ట్ సంస్థలకు తాఖీదులు ఇస్తున్నారు. దీంతో సదరు కాంట్రాక్ట్ సంస్థలు అటెండర్ల జీతాల్లో కోత పెడుతున్నారు.
తద్వారా రైల్వేశాఖకు రికవరీ అప్పగిస్తున్నారు. అంతేగాక.. సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో అటెండర్లు కంటిమీద కునుకు లేకుండా పనిచేస్తున్నారు. వారికి విశ్రాంతి కరువవుతున్నది. సాధారణంగా అలాంటి రకమైన షిఫ్టుల వారీగా విధులు ఉండాలి.కానీ, కాంట్రాక్ట్ సంస్థలు అలా చేయకుండానే ఉన్నవారితోనే పనికానిచ్చేస్తున్నాయి. ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల అటెండర్లు అనారోగ్యం బారిన పడుతుతున్నారు. ఒక్కసారి ఒక్క అటెండర్ ఒక ఊరిలో ఒక రైలు ఎక్కితే ఆ రైలు తిరిగి, అదేస్థానానికి రావడానికి 80 గంటలు పడుతుంది.
అంటే.. ఆ కాంపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వహిస్తున్న అటెండర్ అన్ని గంటలూ ప్రయాణికులకు అందుబాటులో ఉండాల్సిందే. అన్ని గంటలు కునుకుపాట్లు, లేదా నిద్రలేమితో అటెండర్లు బాధపడాల్సిందే. నిత్యం ప్రయాణికుల బెడ్ రోల్స్ ఎత్తడం, పంపిణీ చేయడం, కోచ్‌లను శుభ్రపరిచే క్రమంలో కొందరు అటెండర్లు ఇన్ఫెక్షన్లు, అలెర్జీల బారిన పడుతున్నారు. ప్రయాణికులు వాడిన దిండ్లు, దుప్పట్లు ఎత్తడం, శుభ్రం చేయడంతోనే ఇలాంటి పరిస్థితి తలెత్తుతున్నది.
కొందరైతే దారుణమైన చర్మ వ్యాధుల బారిన పడుతున్నారు. కొన్ని రైళ్లలో ప్యాట్నీ (కిచెన్) లేకపోవడంతో అటెండర్లు సొంత ఖర్చులతో భోజనం చేస్తున్నారు. అతి తక్కువ జీతం పొందే వీరు.. రైల్వే స్టేషన్‌లో ఎక్కువ డబ్బు పెట్టి ఆహారం తినగలరా? రైల్వేశాఖ ఇప్పటికైనా అటెండర్లు చేస్తున్న కష్టాన్ని గుర్తించాలి. వారికి ఆర్థికపరంగా మేలు చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. వారికి ఆరోగ్య భద్రత కల్పించేందుకు పూనుకోవాలి.
ఆళవందార్ వేణుమాధవ్, హైదరాబాద్