calender_icon.png 5 May, 2025 | 9:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అస్తవ్యస్తంగా హస్తం పార్టీ!

05-05-2025 01:22:21 AM

  1. చుక్కాని లేని నావలా అధికార పార్టీ
  2. ఉమ్మడి ఖమ్మంలో నాయకత్వలేమి 
  3. ముగ్గురు మంత్రుల వర్గపోరు 
  4. సమావేశం పెడితే రసాభాసే 

భద్రాద్రి కొత్తగూడెం, మే 4 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆ పార్టీకి బీటలు వారుతోందా? రాష్ట్రంలో ఆ పార్టీ అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఉమ్మడి జిల్లాలో నా యకత్వలేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, భ ట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కాంగ్రె స్ క్యాడర్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.

ఒకవైపు మంత్రుల వర్గపోరు, మరోవైపు ‘అసలు కాంగ్రెస్.. వలస కాంగ్రెస్’ అనే భేదా ల మధ్య ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చుక్కానీ లేని నావగా కాంగ్రెస్ పార్టీ మారిందని ప్రచారం జరుగుతోంది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఓ హోటల్లో జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించగా, పార్టీ పెద్దల ఎదుటే కార్యకర్తల రసాభాస చేశారు. దీంతో అర్ధాంతరంగా సమావేశం నిలిచిపోయింది. 

కంచుకోటకు బీటలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆది నుంచి కాంగ్రె స్ పార్టీకి కంచుకోట అనే చెప్పవచ్చు. ఏతరహా ఎన్నికలు జరిగినా ప్రజలు ఆ పార్టీకే మద్దతు ఇస్తూ వస్తున్నారు. అంతటి ప్రజాధరణ ఉన్న కాంగ్రెస్లో నేడు నాయకత్వలేమి, వర్గపోరుతో కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి చోటుచేసుకుంది. కాంగ్రెస్ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం అధికంగా ఉంటుందని చెప్తుంటారు. ప్రస్తుతం ఆ పార్టీలో నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తుండటంతో  స్థానికంగా ఉండే చోటామోటా నాయకులు సొంతంగా కార్యక్రమాలు నిర్వహించుకొంటున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా లోని నాయకుల తీరు అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం యావత్తు టీఆర్‌ఎస్ హవా కొనసాగినా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు మాత్రం కాంగ్రెస్కు జైకొట్టారు. పది నియోజకవర్గాల్లో తొమ్మిదింట కాంగ్రెస్ అభ్యర్థులు విజయ ఢంకా మోగిస్తుంటారు. అంతటి బలం కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పవచ్చు. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు తిప్పికొట్టారు.

గెలిచిన తర్వాత నాయకులను తమ పార్టీలోకి ఆకర్షించుకోవడం తప్ప ప్రజాక్షేత్రంలో పార్టీని గెలిపించుకోలేకపోయారు. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ను వీడిన తర్వాత ఆ పార్టీ ఆ స్థాయి నాయకుడిని తయారు చేసుకోకపోవడం వారి వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. రాష్ట్రంలో అధికారం చలాయిస్తున్నా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గల్లీ లీడర్లతో పార్టీని నెట్టుకొస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో చెప్పవచ్చు. 

ముగ్గురు మంత్రులు ఉన్నా..

ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు మంత్రు లు ప్రాతినిధ్యం వహిస్తున్నా వర్గపోరు తారస్థాయిలో ఉంది. ఇటీవల భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా పాల్వంచ మండలంలోని పెద్దమ్మతల్లి ఆలయ పాలక మండలి నియామకం లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, భట్టి విక్రమార్కల మధ్య వర్గపోరు బహిర్గతమైంది.

తాజాగా అశ్వరావుపేట నియోజకవ ర్గంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటనలో అధికార పార్టీ ఎమ్మెల్యేకు జరిగిన అవమానం పొంగులేటి, తుమ్మల మధ్య వర్గ పోరును తేటతెల్లం చేస్తోంది. పాల్వంచలో జరిగిన జిల్లా స్థాయి కార్యకర్తల సమా వేశంలో ‘అసలు కాంగ్రెస్.. వలస కాంగ్రెస్’ అనే భేదం కొట్టొచ్చినట్టు కనిపించింది. 

బలం పుంజుకుంటున్న సీపీఐ 

కొత్తగూడెం ఎమ్మెల్యేగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్రంలో అధికారం లో ఉన్న నియోజకవర్గంలో ఆ పార్టీ పెద్ద చిక్కులో పడ్డదని చెప్పక తప్పదు. నియోజకవర్గంలో పెద్ద సంఖ్యల్లో గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీని వీడి ప్రజలు సీపీఐ  చేరుతుండటం ఆ పార్టీకి బలం చేకూరుస్తోందని చెప్పవచ్చు.

స్థానికంగా ప్రజలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారం కావాలన్నా, అభివృద్ధి పనులు జరగాలన్న స్థానికంగా అధికారంలో ఉన్న పార్టీ పంచన చేరడమే శ్రేయస్కరమని ప్రజలు భావిస్తున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మున్సిపాలిటీలో పంచాయతీల్లో ఉన్న మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఎర్రజెండా నీడలో చేరడం అనివార్యంగా మారిందని చెప్పొచ్చు. 

ప్రెస్నోట్లకే పరిమితం

మంత్రులు, ఎంపీల పర్యటన సందర్భాల్లో తప్పా మిగితా రోజుల్లో కాంగ్రెస్ నేతలు ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. ఉన్నవారు కేవలం ప్రెస్నోట్లకే పరిమితం అవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తు తం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పోలెం వీరయ్య భద్రాచలం దాటి బయటకు రావట్లేదన్న అపవాదు ఉంది. క్యాడ్ప ఆయనకు అజమాయిషీ లేదని ప్రచారం ఉంది. దీంతో జిల్లా వ్యాప్తంగా పార్టీలో స్తబ్దత నెలకొంది.

స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా, జమిలి ఎన్నికలు చోటుచేసుకున్నా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని కాంగ్రె స్ క్యాడర్లో ఆందోళన కనిపిస్తున్నది. ఇప్పటికైనా అగ్రనాయకత్వం ఉమ్మడి ఖమ్మం జిల్లా పై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.