31-08-2025 12:38:22 AM
-దశాబ్దాల పూడిక తొలగింపు పనులు
-క్షేత్రస్థాయిలో కమిషనర్ రంగనాథ్ పర్యటన
హైదరాబాద్ సిటిబ్యూరో, ఆగస్టు 30 (విజయక్రాంతి): నగరంలోని అమీర్‌పేట వరద కష్టాలకు చెక్ పెట్టేందుకు హైడ్రా రంగంలో దిగింది. దశాబ్దాలుగా అమీర్‌పేట, కృష్ణానగర్ వాసులను వేధిస్తున్న ఈ జల గండానికి శాశ్వత పరిష్కారం చూపేందుకు హైడ్రా కంకణం కట్టుకుంది. ఈ పనుల పురోగతిని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. శనివారం క్షేత్రస్థాయిలో పర్యటించి ఆయన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. స్థానికులతో నేరుగా మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
భారీ వర్షం కురిసినప్పుడల్లా అమీర్‌పేట చౌరస్తా నడుం లోతు నీటిలో మునిగిపోవడానికి ప్రధాన కారణాన్ని కమిషనర్ గుర్తించారు. జూబ్లీహిల్స్, యూసుఫ్‌గూడ, మధురానగర్ నుంచి వచ్చే వరద కాలువలు కలిసే ఈ ప్రాంతంలో, భూగర్భ బాక్సు డ్రైన్లు పూర్తిగా పూడుకుపోవడమే సమస్యకు మూలమని నిర్ధారించారు.
జూబ్లీహిల్స్ నుంచి అమీర్‌పేట వరకు ఉన్న ప్రధాన నాలాలను పరిశీ లించిన కమిషనర్, కొన్నిచోట్ల 8 మీటర్ల లోతున్న కాలువలు ఆరేడు అడుగుల మేర పూడికతో నిండిపోవడాన్ని గమనించారు. కృష్ణానగర్‌లోని ప్రగతినగర్ వద్ద నాలాను పూర్తిగా ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను తక్షణమే తొలగించాలని ఆదేశించారు. పూడిక మొత్తం తీశాక వరద సమస్య చాలా వరకు తగ్గుతుంది. అవసరమైతే అన్ని శాఖలతో, స్థానికులతో సమావేశమై శాశ్వత పరిష్కారం కనుగొంటామన్నారు.