31-08-2025 11:16:05 AM
రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు..
అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం వద్ద గోదావరి(Godavari) నది ఉదృతంగా ప్రవహిస్తున్నది. ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు 48 అడుగులకు చేరుకోగానే జిల్లా అధికారులు వెంటనే రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేసి వరద సహాయక అధికారులను సిద్ధం చేశారు. దీంతో భద్రాచలం వద్ద నదీ ప్రవాహం 11, 44,645 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తున్నది. గోదావరి ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల ప్రభావం వల్ల గోదావరి నది పొంగి ప్రవహిస్తున్నది. భద్రాచలంనకు ఎగువనగల పేరూరు వద్ద గోదావరి వరద స్థిరంగా ఉన్నందున భద్రాచలం వద్ద మరింత పెరిగి తగ్గే అవకాశం ఉంది. మరింత పెరిగితే వరద సహాయ కార్యక్రమాలు చేపట్టడానికి, అవసరమైత వరద బాధితుల కోసం పునరావాస కేంద్రాలు ప్రారంభించడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు.
అంతేకాకుండా వరద బాధితులకు, ప్రజలకు తాగునీరు ఆహారం వైద్య సేవలు విద్యుత్ సరఫరా వంటి సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్(District Collector Jitesh V Patil) ఆదేశించారు. అంతేకాకుండా వరద ప్రాంతాలలో అత్యవసర స్థితిలో సహాయ సహకారాలు అందించేందుకు రెవెన్యూ పోలీస్ వైద్య పంచాయతి రాజ్ మున్సిపల్ విద్యుత్ శాఖ అధికారులు సైతం సిద్ధంగా ఉంచారు. వరద పెరుగుతున్నందున గోదావరి నదిలో దిగి స్నానం చేయడాన్ని, అలాగే పడవ ప్రయాణాలు చేయటాన్ని పూర్తిగా నిషేధించారు. వరద నీరు ప్రవహిస్తున్న వంతెనలు, చెరువులు, వాగులు, కాలువల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సెల్ఫీలు లేదా వీడియోల కోసం ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లా యంత్రాంగం ప్రజలకు సులభంగా సహాయం అందించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూములను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రజలు క్రింది నంబర్లకు సంప్రదించవచ్చని సూచించారు:
సబ్ కలెక్టర్ కార్యాలయం, భద్రాచలం – 08743-232444
వరదల కంట్రోల్ రూమ్ – 7981219425
జిల్లా కలెక్టర్ కార్యాలయం, పాల్వంచ – 08744-241950
ఐటీడీఏ కార్యాలయం, భద్రాచలం – 7995268352
ప్రజలందరూ అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించి, సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని కలెక్టర్ అప్రమత్తంగా పనిచేస్తూ, ప్రజలకు సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నదని ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు.