31-08-2025 12:34:57 AM
-కొనసాగుతున్న యూరియా సంక్షోభం
-ఇబ్బందులు పడుతున్న రైతులు
-పలుచోట్ల రాస్తారోకోలు, తోపులాటలు
మహబూబాబాద్/హుస్నాబాద్/నంగునూరు/రామాయంపేట(మెదక్), ఆగస్టు 30 (విజయక్రాంతి): రాష్ట్రంలో యూరియా సం క్షోభం కొనసాగుతుండటంతో అన్నదాతలు అరిగోసపడుతున్నారు. వ్యవసాయ సీజన్ జోరుగా సాగుతున్న ఈ సమయంలో యూ రియా కొరత రైతులను మరింత నిస్సహాయ స్థితిలోకి నెట్టివేసింది.సాధారణంగా సీజన్ ప్రారంభానికి ముందే ప్రభుత్వం తగినన్ని యూరియా నిల్వలు అందుబాటులో ఉంచా లి. కానీ, ఈసారి సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల నిల్వలు తక్కువగా ఉన్నాయి.
ఉన్న కొద్దిపాటి యూరియాను పంపిణీ చేయడంలో కూడా జాప్యం జరుగుతోంది. మహబూబాబాద్ జిల్లాలో శనివారం యూరియా కోసం రైతులు మళ్లీ రోడ్డెక్కారు. నరసింహులపేట మండల కేంద్రంలో రాస్తా రోకో నిర్వహించారు. కేసముద్రం మండలం కలవల గ్రామంలో రైతువేదిక వద్దకు పెద్ద ఎత్తున రైతులు చేరుకొని టోకెన్ల కోసం తోపులాడుకున్నారు. కురవి మండలం గుం డ్రాతి మడుగులో టోకెన్ల కోసం గంటల తరబడి నిరీక్షించారు. కలవల రైతు వేదిక వద్ద వందలాది మంది రైతులు ఓ వైపు మహిళలు, మరోవైపు పురుషులు టోకెన్ల కోసం బారులు తీరగా, మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య వచ్చి, అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందని, రైతులను పక్కనే ఉన్న మోడల్ స్కూల్ కు తరలించడం వివాదాస్పదంగా మారింది.
అప్పటికే కొంత మందికి టోకెన్లు ఇవ్వగా మిగిలిన వారు మళ్లీ క్యూ పద్ధతి మారుతుందని ఆందోళనకు దిగారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అనంతరం ఏవో వెంకన్న 444 మం దికి ఒక్కో బస్తా చొప్పున యూరియా టోకెన్ ఇచ్చి కల్వల సొసైటీ ఎరువుల విక్రయ కేంద్రం వద్ద యూరియా పంపిణీ చేశారు. మిగిలిన రైతుల పట్టా పాస్ పుస్తకాల జిరాక్స్ ప్రతులను తీసుకొని యూరియా వచ్చిన తర్వాత టోకెన్లు ఇస్తామని శాంతింప చేశారు. గుండ్రాతి మడుగులో యూరియా కోసం బారులు తీరిన రైతులకు టోకెన్లు జారీ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని రైతు మిత్ర, మన గ్రోమోర్ ఎరువుల దుకాణాల ముందు రైతులు ధర్నా నిర్వహిం చారు.
బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొని ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. ఆ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధులు సుద్దాల చంద్రయ్య, అయిలేని మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ.. రైతులు వ్యవసాయ పనులు వదులుకొని రోజుల తరబడి యూరియా బస్తాల కోసం ఎరువుల దుకాణాల ముందు లైన్లలో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీ వద్ద రైతులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 500 బస్తాల యూరియా రాగా సుమారు 800 మందిపైగా రైతులు చేరుకున్నారు.
రైతులపై సోయిలేని కాంగ్రెస్: బీజేపీ
అక్కన్నపేట: అధికారంలోకి వచ్చాక రైతులకు అన్నీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు అన్నదాతల కష్టాలను పట్టించుకోవడం లేదని బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యూరియా సరఫరాలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఆ పార్టీ కిసాన్ మోర్చా రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు గొల్లపల్లి వీరాచారి ఆధ్వర్యంలో శనివారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో రైతులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వీరాచారి మాట్లాడుతూ.. రైతులు యూరి యా కోసం కిసాన్ సెంటర్లు, ఫెర్టిలైజర్ దుకాణాల వద్ద చెప్పులు వరుసలో పెట్టి గంటల తరబడి ఎదురుచూసే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి నెలకొనడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు. “హుస్నాబాద్ పట్టణంలో యూరియా కోసం వెళ్తే, ఫెర్టిలైజర్ దుకాణాల యజమానులు రైతులను చిన్నచూపు చూస్తూ, ‘యూరియా లేదు, మీకు దిక్కున్న చోట చెప్పుకోండి’ అని దాబాయించడం బాధాకరం’ అని అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయానికి తెల్లవారుజామునే రైతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి తరలివచ్చారు. కిలోమీటర్ల పొడవున క్యూలైన్లు, చేతిలో ఆధార్ కార్డులు, పాసుబుక్కులు పట్టుకుని ఎదురు చూశారు. కానీ ఆశించిన యూరి యా మాత్రం అందక నిరాశకు గురవుతున్నారు. ముందు రోజు అధికారులు టోకెన్లు ఇచ్చినాగానీ సరఫరా మాత్రం అందలేదు.
డ్రోన్ ద్వారా నానో యూరియా స్ప్రే
మహబూబాబాద్(విజయక్రాంతి): యూరియా కొరత నేపథ్యంలో ద్రవ రూపంలో ఉన్న నానో యూరియా వినియోగంపై మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం కాంపల్లి గ్రామంలో శనివారం మండల వ్యవసాయ అధికారి టి ఛాయారాజ్ నేతృత్వంలో డ్రోన్ ద్వారా వరి పంటపై ప్రయోగాత్మక పిచికారి కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతుల్లో నానో యూరియా పై ఉన్న అపోహలను తొలగించడంతోపాటు, తక్కువ ఖర్చుతో నానో యూరియా డ్రోన్ ద్వారా స్ప్రే చేయడం వల్ల సమయం ఆదా అవుతుందని చెప్పారు.