31-08-2025 12:40:31 AM
- డ్రైవర్‌ను బెదిరించి డబ్బులు వసూలు
- వేదింపులు భరించలేక బాధితుడు ఆత్మహత్యాయత్నం
మేడ్చల్, ఆగస్టు 30(విజయ క్రాంతి): లారీ డ్రైవర్ ను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ముగ్గురు విలేకరులను శామీర్ పేట్ పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. పోలీసుల కథనం ప్రకారం తిరు నారాయణపురం కార్తీక్ (ఏబీఎన్ ఆంధ్రజ్యోతి), బొమ్మెర్ల శ్రీకాంత్ (నమస్తే తెలంగాణ)తో పాటు వీరి అనుచరుడు కిషన్ నాలుగు నెలల క్రితం చాగర్ల శివకుమార్ లారీని మూడు చింతలపల్లి మండలం అనంతారం వద్ద కారుతో అడ్డగించి రూ. 60వేలు డిమాండ్ చేశారు. బాధితుడు రూ.30 వేలు చెల్లించాడు.
మళ్లీ మార్చి 18న లారీని అడ్డగించి రూ.4 వేలు, రూ. 8 వేలు, రూ.6 వేలు ఫోన్ పే ద్వారా బలవంతంగా వసూలు చేశారు. అంతేగాక ఫారెస్ట్ అధికారులచే లారీని సీజ్ చేయించారు. వీరి వేధిం పులు భరించలేక బాధితుడు జూన్ 15వ తేదీన ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధితుడు నెలరోజు ల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఇటీవల వ్యాపారాన్ని మళ్లీ ప్రారంభించాడు.
ఈ నెల 29న నారాయణపూర్ పాఠశాల వద్ద లారీని అడ్డగించి రూ.20 వేలు డిమాండ్ చేశారు. డ్రైవర్‌ని కొట్టి, వాహనం తాళాలు, మొబైల్ ఫోన్ లాక్కున్నారు. లారీ కింద తొక్కే చంపేస్తామని, కేసులు పెట్టిస్తామని బెదిరించారు. దీంతో బాధితుడు శామీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ముగ్గురిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కారు, ఫోన్లు, వసూలు చేసిన డబ్బు స్వాధీనం చేసుకున్నారు.