05-01-2026 12:00:00 AM
మానవీయ రాజకీయానికి నిదర్శనం
అశ్వాపురం,జనవరి 4 (విజయక్రాంతి): అశ్వాపురం మండలం మల్లెల మడుగు గ్రామంలో సోమవారం జరగనున్న కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ దానూరి అబ్బయ్య వర్ధంతి వేడుకలకు ముందు రోజే హృదయాన్ని తాకే దృశ్యం ఆవిష్కృతమైంది. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్గా, సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా గుర్తింపు పొందిన దానూరి అబ్బయ్య స్మృతిని గౌరవిస్తూ, ప్రస్తుత సర్పంచ్ మచ్చ నరసింహారావు వారి దిమ్మెలకు స్వయంగా పెయింటింగ్ వేస్తూ నివాళులు అర్పించారు.
రాజకీయ విభేదాలను పక్కనపెట్టి, గ్రామాభివృద్ధి కోసం అబ్బయ్య చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ నరసింహారావు భావోద్వేగానికి లోనయ్యారు. గ్రామానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి. పార్టీ ఏదైనా, గ్రామం కోసం పనిచేసిన నాయకుడికి గౌరవం ఇవ్వాల్సిందే అంటూ ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై, అబ్బయ్య సేవలను స్మరించుకున్నారు.
ప్రజాసేవలో నిబద్ధత, గ్రామ అభివృద్ధిపై ఆయన చూపిన శ్రద్ధను పలువురు గుర్తు చేసుకుంటూ, ఇటువంటి ఘటనలు రాజకీయాలకు మానవీయ కోణాన్ని తెస్తాయని అభిప్రాయపడ్డారు. పార్టీ గీతలు చెరిగిపోయి, స్మృతికి రంగులు అద్దిన ఈ ఘటన మల్లెల మడుగు గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ప్రజాసేవే రాజకీయాల లక్ష్యమని మరోసారి నిరూపించిన సంఘటనగా స్థానికులు దీనిని అభివర్ణిస్తున్నారు.