calender_icon.png 11 January, 2026 | 6:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత శిక్షణ అర్హత పరీక్ష కు విశేష స్పందన

10-01-2026 02:52:13 PM

ఎంపికైన 150 మంది విద్యార్థులకు 50 రోజుల రెసిడెన్షియల్ ఉచిత శిక్షణ 

జిల్లాలోని 17 మండలాల  ప్రభుత్వ పాఠశాలల నుండి 750 మంది  విద్యార్థుల హాజరు 

  మహబూబ్‌నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి, వారికి ఉన్నత విద్యా అవకాశాలు అందించాలనే దృఢ సంకల్పంతో మహబూబ్‌నగర్ ఫస్ట్, వందేమాతరం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షకు అపూర్వ స్పందన లభించిందని మహబూబ్‌నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్ తెలిపారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే  యెన్నం  శ్రీనివాస్ రెడ్డి  స్వంత నిధులతో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక శిక్షణ శిబిరానికి అర్హులైన విద్యార్థులను ఎంపిక చేయడం కోసం ఈ అర్హత (స్క్రీనింగ్) పరీక్షను నిర్వహించినట్లు పేర్కొన్నారు.

అర్హత సాధించిన విద్యార్థులను ఎంపిక చేసి, 50 రోజులపాటు పూర్తిస్థాయి రెసిడెన్షియల్ విధానంలో నిష్ణాతులైన అధ్యాపకుల బృందం ద్వారా నాణ్యమైన విద్యాబోధన అందించడంతో పాటు, వారికి మంచి పౌష్టికాహారం, వసతి సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు.  ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ నగరంలోని స్థానిక మాడ్రన్ స్కూల్‌లో ఈ స్క్రీనింగ్ పరీక్షను నిర్వహించగా విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించిందని గుండా మనోహర్ పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని 17 మండలాల్లో ఉన్న ప్రతి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థులు చొప్పున మొత్తం 750 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారని తెలిపారు.

ఇది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఉన్న పోటీ సామర్థ్యం, ప్రతిభకు స్పష్టమైన నిదర్శనమని ఆయన అన్నారు. గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లోని విద్యార్థులు కూడా సరైన మార్గదర్శకత్వం, నాణ్యమైన శిక్షణ అందితే జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశం సాధించగలరనే నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఈ స్క్రీనింగ్ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి, వారికి మరింత లోతైన, లక్ష్యోన్నతమైన శిక్షణ అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఈ పరీక్షలో మెరిట్ సాధించిన 150 మంది విద్యార్థులకు పూర్తిగా ఉచితంగా 50 రోజులపాటు పూర్తి రెసిడెన్షియల్ విధానంలో ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ శిబిరంలో అనుభవజ్ఞులైన, నిష్ణాతులైన అధ్యాపకుల బృందం ప్రత్యేకంగా రూపొందించిన అకడమిక్ షెడ్యూల్ ప్రకారం విద్యార్థులకు శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. శిక్షణ కాలంలో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం, పరిశుభ్రమైన వసతి సదుపాయాలు, క్రమశిక్షణతో కూడిన విద్యావాతావరణం కల్పించడంతో పాటు, గణితం, సైన్స్, లాజికల్ థింకింగ్, సమస్య పరిష్కార నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి సారించి శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఐఐఐటి లో సీటు సాధించడమే ప్రధాన లక్ష్యంగా ఈ శిక్షణ శిబిరం నిర్వహించబడుతుందని స్పష్టం చేశారు. 

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇలాంటి అవకాశాలు కల్పించడం ద్వారా సామాజిక సమానత్వం పెంపొందడంతో పాటు, మహబూబ్‌నగర్ జిల్లాలో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని గుండా మనోహర్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఈ తరహా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టాలన్న ఆలోచన  ఎమ్మెల్యేకి ఉందన్నారు.  ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాన్ని రెండవ పట్టణ సీఐ నిజాయుద్దీన్ తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. స్క్రీనింగ్ పరీక్షను వందేమాతరం ఫౌండేషన్ కో-ఆర్డినేటర్ రవీందర్ రెడ్డి, సొంబూపాల్ రెడ్డి తదితరులు పర్యవేక్షించారు.